మహాభారత యుద్దంలో రాజమౌళి గెలుస్తాడా..? అల్లు అరవింద్ గెలుస్తాడా..? పోనీ, ఎవరు ముందుగా ఈ టాస్క్‌లో ముందంజలో ఉంటారు..? ఎవరి కథ మెప్పిస్తుంది… అత్యంత విచిత్రమైన ప్రశ్నలు కదా… కాదు, చాలా సాధారణ ప్రశ్నలే… దీనికి నేపథ్యం ఏమిటంటే..? మణిరత్నానికి పొన్నియిన్ సెల్వన్ అనే చోళసామ్రాజ్య స్థాపన కథ ఎలా ఓ డ్రీమ్ ప్రాజెక్టో… రాజమౌళికి మహాభారతం అంతే డ్రీమ్ ప్రాజెక్టు… ఎప్పటి నుంచో చెబుతున్నాడు… బాహుబలి, ఆర్ఆర్ఆర్ అనుభవంతో అలవోకగా తీయగలడు… అవసరమైతే బ్రహ్మాస్త్ర తరహాలో మూడు భాగాలుగా తీసి, బ్రహ్మాండంగా మార్కెటింగ్ చేసుకోగలడు… ప్రపంచమంతా విడుదల చేయగలడు…
సరిపడా డబ్బు కూడా రాజమౌళి దగ్గర ఉంది, వేరే నిర్మాతలు అవసరం లేదు… అయితే ఎప్పుడు తీస్తాడు, నిజంగానే ఈ ప్రాజెక్టు మీద సీరియస్‌గా ఉన్నాడా అనేది ఓ ప్రశ్న… అంతే అనిశ్చితమైన మరో ప్రాజెక్టు గురించి చెప్పాలి… అల్లు అరవింద్, మధు మంతెన, డిస్నీ హాట్‌స్టార్ కలిసి భారీ వ్యయంతో, గ్రాఫిక్స్‌తో మహాభారతం వెబ్‌సీరీస్ చేయాలని ప్లాన్… వాళ్లే స్వయంగా వెల్లడించారు…
Ads
విడుదల చేసిన ఫోటోలు కూడా గ్రాఫిక్స్‌కు ఇచ్చిన ఇంపార్టెన్స్‌ను సూచిస్తున్నాయి… ఎప్పటి నుంచి షూటింగ్ స్టార్ట్, ఎవరు దర్శకులు, ఎవరు నటులు అనేది తెలియదు… వాళ్లు కలిస్తే ఎంత ఖర్చయినా పెట్టగలరు… అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అవుతుంది… కానీ, షూటింగ్ స్టార్ట్ అయ్యేవరకు నిశ్చితంగా చెప్పలేం… కమర్షియల్ లెక్కలు కుదరాలి…
అయితే ఇక్కడ రెండు అంశాలు… మహాభారతం వందల ఏళ్లుగా, వేనవేల కళారూపాల్లో ప్రదర్శితం అవుతూనే ఉంది… తోలుబొమ్మలాటల దగ్గర నుంచి హరికథలు, బుర్రకథల మీదుగా సినిమాలు, యానిమేటెడ్ కార్టూన్ సీరీస్, టీవీ సీరియళ్ల దాకా… ఈ జాతికి తెలిసిన ప్రతి కళారూపంలోనూ మహాభారత కథలు ప్రజల్ని అలరించాయి… మరి కొత్తగా వెబ్ సీరీస్‌లో ఏం చెబుతాం..? చెప్పగలిగితే స్టోరీ రీటెల్లింగ్ అవసరం… దాన్ని ప్రజలు ఆమోదిస్తారా అనే సందేహం పీకుతూనే ఉంటుంది… ఆ రిస్క్ ఎవరు తీసుకోవాలి మరి..? అసలే భారీ ఖర్చు…
మరో మైనస్ ఏమిటంటే… భారీ ఖర్చుతో గ్రాఫిక్స్‌ను గనుక నమ్ముకుంటే (బ్రహ్మాస్త్ర తరహాలో)… థియేటర్లే బెటర్… బెటర్ సౌండ్, క్వాలిటేటివ్ వీడియో, త్రీడీ వంటివి ప్రేక్షకుల్ని అలరిస్తాయి… ఆ ఖర్చుకు సరిపడా ప్రదర్శన… వెబ్ సీరీస్‌లు ఎక్కువగా చూడబడేది స్మార్ట్ ఫోన్లలో… వాటిల్లో ఆ భారీ గ్రాఫిక్స్ ఏం అలరించగలవు..? ఆ మజా ఉండదు… పైగా భారీ ఖర్చు, భారీ గ్రాఫిక్స్ మాత్రమే ప్రేక్షకుడిని కనెక్ట్ కాలేదు… కథను కొత్తగా చెప్పే విధానం ముఖ్యం… మరీ మహాభారతాన్ని ఇంకా కొత్తగా ఏం చెప్పగలం..? ఇదీ అసలైన ప్రశ్న…
2017లో కావచ్చు… దుబయ్ బేస్డ్ కేరళ బడా వ్యాపారి 1000 కోట్లతో మహాభారతాన్ని తీస్తా అన్నాడు… జ్ఞానపీఠ్ విజేత వాసుదేవన్ నాయర్ రాసిన మహాభారత కథ రండామూజం ఆధారంగా తీయాలని ప్లాన్… మోహన్‌లాల్ భీముడి పాత్ర… ఆ కోణంలోనే కథనం… కానీ అది ఇతరత్రా కారణాలతో పట్టాలు ఎక్కలేదు… రెండు భాగాలకో, మూడు భాగాలకో భారతాన్ని కుదించలేం కాబట్టి వెబ్ సీరీస్ అని చెబుతారేమో అల్లు ప్లస్ డిస్నీ… కానీ అది సరికాదు, చెప్పే తీరులో ఉంటుంది… మాయాబజార్ సినిమాను అసలు పాండవుల పాత్రలే లేకుండా తీయలేదా..?
రెండు లేదా మూడు భాగాలకు కథను కుదించి… రాజమౌళి భారత కథను చెప్పగలడు… తండ్రి విజయేంద్రప్రసాద్ ఉండనే ఉన్నాడు… థియేటర్, ఓటీటీ, టీవీ, ఓవర్సీస్, ఇతర భాషల రైట్స్ అన్నీ కలిపితే తను సక్సెస్ చేసుకోగలడు… అందుకే డీస్నీ వెబ్ ప్లాన్ కరెక్టేనా అనేది డౌట్… ఒక్క ముక్కలో చెప్పాలంటే అది సరైన ఆలోచన కానేకాదు… కమర్షియల్‌గా, కథాపరంగా…
ఆమధ్య ఆమీర్‌ఖాన్ ప్లస్ రిలయెన్స్ కలిసి మహాభారతాన్ని నిర్మించే ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి… ఏ పాత్రకు ఎవరు సూటవుతారంటూ బోలెడు మీమ్స్, గ్రాఫిక్స్, వార్తలు గట్రా వచ్చాయి… కానీ అది వర్కవుట్ కాలేదు, ఇక లాల్‌సింగ్‌చద్దా దెబ్బకు ఆ ప్రతిపాదన అటకెక్కినట్టే… ఇలా ఒకటీరెండు భారీ మహాభారతం సినిమా నిర్మాణాల మీద వార్తలు వస్తూనే ఉంటయ్… మరి రాజమౌళి..? మరి అల్లు అరవింద్..? కాలం చెప్పాలి…!!
Share this Article