ప్రజలు ఏం తీర్పు చెప్పారు అనేది బీజేపీకి అవసరం లేదు… ఏం చేస్తే గద్దెనెక్కగలం..? స్ట్రెయిట్‌గా గెలిస్తే వోకే, లేదంటే ఏం చేద్దాం..? ఇదొక్కటే ఫోకస్… యుద్ధంలో, శృంగారంలో ఏదీ తప్పు కాదు, సేమ్, రాజకీయాల్లో కూడా..! ఇదేమీ వాజపేయినాటి కాలం కాదు, ఇది మోడీషా జమానా… కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని కూలదోసిన తమకు రాజస్థాన్ మింగుడుపడకపోవడం బీజేపీకి నచ్చడం లేదు… జీర్ణం కావడం లేదు… మహారాష్ట్రలో కూడా బలమైన దెబ్బ తీయగలిగింది ప్రత్యర్థుల కూటమిపై..!
ఇప్పుడు గట్టిగా ప్రయత్నిస్తే బహుశా బీజేపీకి ఓ చాన్స్ దొరుకుతుంది… దానికి కాస్త వెనుకాముందు ఓసారి విశ్లేషిస్తే… మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింథియా ఎపిసోడ్ క్లిక్కయినట్టే… రాజస్థాన్‌లో సచిన్ పైలట్ ఎపిసోడ్ కూడా హిట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావించారు అప్పట్లో… కానీ రాజస్థాన్‌లో సచిన్ పైలట్ వేరు కుంపటి పెట్టబోయి, అశోక్ గెహ్లాట్‌కు ఎసరు పెట్టబోయి తనే ఎదురుదెబ్బ తిన్నాడు… తరువాత అన్నీ మూసుకుని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నాడు…
Ads
ఇక్కడ చాలా కారణాలు పనిచేశాయి… బీజేపీలోనే మోడీషా అంటే ఏమాత్రం గిట్టని వసుంధర రాజే సింధియా ఈ విషయంలో సొంత పార్టీ ఆలోచనలకు తగినట్టుగా అడుగులు వేయలేదు… ఆమెకు కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది… ప్రతిపక్షంలో ఉన్నాసరే, ఈరోజుకూ ఆమె గెహ్లాట్ ప్రభుత్వం పనితీరు మీద కామెంట్లు చేయదు… సింపుల్‌గా చెప్పాలంటే మోడీషా శిబిరానికి ఆమె కంటిలో నలుసు…
….. (అశోక్ గెహ్లాట్, రాహుల్, సచిన్ పైలట్)…
సచిన్ పైలట్ సీఎం అవుతాడనే నమ్మకం కాంగ్రెస్ సభ్యుల్లో కలిగితేనే, వచ్చి తనతో చేరతారు, ఆ నమ్మకాన్ని సచిన్ కలిగించలేకపోయాడు… పైగా గెహ్లాట్ మీద సొంత పార్టీ సభ్యుల్లో పెద్ద వ్యతిరేకత లేదు… వ్యక్తిగతంగా కూడా తన మీద పెద్ద ఆరోపణలు లేవు… పైగా సుదీర్ఘ రాజకీయానుభవం… సచిన్ పైలట్ ప్రమాదాన్ని ఆదిలోనే నలిపేశాడు… బీజేపీ కూడా సీరియస్‌గా సచిన్ పైలట్‌కు మద్దతుగా నిలవలేదు… ఎందుకు..?
సచిన్ పైలట్ భార్య సారా… ప్రేమ వివాహం… ఆమె ఎవరో కాదు, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా బిడ్డ… ఒమర్ అబ్దుల్లా చెల్లె… మొదట్లో కొంత వ్యతిరేకించినా సరే, తరువాత ఆ కుటుంబం సారా ప్రేమకు అంగీకారం తెలిపింది… సచిన్ పైలట్‌ను అల్లుడిగా ఆహ్వానించింది… ఫరూఖ్ అబ్దుల్లా కుటుంబమంటే, ఆ పార్టీ అంటే బీజేపీకి కోపం… సహించదు… ఇదేమైనా బీజేపీ నిర్లిప్తతకు కారణమా తెలియదు…
….. (సచిన్ పైలట్, తన భార్య సారా)…
ప్రస్తుతం మళ్లీ సచిన్ పైలట్ పేరు వినిపిస్తోంది… ఎందుకంటే..? అశోక్ గెహ్లాట్‌కు నిర్బంధంగా ఎఐసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టబోతున్నారు… మన్మోహన్ ప్రధానిగా ఉంటే నెహ్రూ కుటుంబం ఏవిధంగా రిమోట్‌తో పాలించిందో, ఇప్పుడూ అదే జరగబోయేది… పేరుకు ఆ నెహ్రూ కుటుంబేతరులు పార్టీ అధ్యక్షులవుతారు… అవుతారని చెప్పేది కూడా రాహుల్ గాంధీయే… ఒక వ్యక్తికి ఒక పదవి అని డిసైడ్ చేసేదీ తనే… కాంగ్రెస్‌ను ఉద్దరించేందుకు సుదీర్ఘ పాదయాత్ర చేసేదీ తనే… అసలు ఓనర్ ఆయనే, వేరే డ్రైవర్‌ను పెట్టుకుంటున్నాడు… అంతే…
… (సచిన్ పైలట్‌తో మామ ఫరూఖ్, బావమరిది ఒమర్)…
ఐతే ఒక వ్యక్తికి ఒకే పదవి అనడం ద్వారా గెహ్లాట్ ముఖ్యమంత్రిత్వం గోవిందా అని అర్థమైపోయింది… కాకపోతే ఇప్పుడు కాదట… వచ్చే ఫిబ్రవరి దాకా తనే సీఎంగా ఉంటాడట… సో, చాలా టైముంది… ఒకవేళ సచిన్ పైలట్‌ను గనుక సీఎంగా సోనియా, రాహుల్ అంగీకరించకపోతే, సచిన్‌కు బోలెడంత టైం ఉంది… ఓ బలమైన గ్రూపు కట్టడానికి వెసులుబాటు ఉంది… కానీ గెహ్లాట్ అంత తేలికగా పడనివ్వడు… తనను ఇబ్బందిపెట్టిన సచిన్‌ను తనెందుకు క్షమిస్తాడు..?
… (స్పీకర్ సీపీజోషి, సచిన్ పైలట్)…
ఆల్‌రెడీ, సోనియాతో జరిగిన మీటింగులో ఓ షరతు పెట్టాడు… తాను ఎఐసీసీ పగ్గాలు తీసుకోవాలంటే తను చెప్పిన వ్యక్తి సీఎం కావాలీ అని… సచిన్ పైలట్ ఎపిసోడ్ సమయంలో తనకు బలమైన మద్దతుదారుగా నిలిచిన సీపీజోషిని గెహ్లాట్ కొత్త సీఎంగా ప్రతిపాదిస్తున్నాడు… తనిప్పుడు స్పీకర్… ఆయనే కాదు, ఇంకెవరైనా సరే… సచిన్ పైలట్ తప్ప… శుష్క అధికారాల ఎఐసీసీ పదవికన్నా తనకు రాజస్థానే ముఖ్యం… సచిన్ బలపడటాన్ని తను అస్సలు సహించడు… అది సహజం కూడా…
… (గెహ్లాట్ ప్రమాణ స్వీకారానికి వెళ్లి అభినందిస్తున్న వసుంధర)…
ఈ స్థితిలో సచిన్ పైలట్ బదులు ఇంకెవరైనా సీఎం అయితే… బీజేపీ ఈసారైనా సీరియస్‌గా ఓ ఎఫర్ట్ పెట్టగలదా..? సచిన్ అత్తింటి నేపథ్యాన్ని కాస్త పక్కనపెట్టి, వసుంధరరాజే నోరుమూసి, అవసరమైతే ఆమెను వదులుకోవడానికి కూడా సిద్ధపడి, అమిత్ షా గనుక రంగంలోకి దిగితే… సచిన్ మరో ఏకనాథ్ షిండే అవుతాడు… కాంగ్రెస్ ముక్తభారత్ దిశలో మరో బలమైన అడుగు వేయగలదు… యాంటీబీజేపీ రాజకీయ సంఘటన ప్రయత్నాల మీద నీళ్లు జల్లగలదు… ఆ సీరియస్‌నెస్ ఉందానేది డౌటే..!!
Share this Article