విశేషంగా కనిపించింది ఓ బ్యానర్ స్టోరీ… ఆంధ్రప్రభలో… విడ్డూరమనో, వింత ప్రతిపాదననో అలా కొట్టిపారేయనక్కర్లేదు… మానవీయ దృక్పథంతో, జర్నలిస్టిక్ కోణంలోనే ఒక సానుకూల ఆలోచనను డిబేట్కు పెట్టినట్టుగా పరిగణిద్దాం… అయితే ఆ సానుకూలత ఉందా..? ఆ ఆచరణసాధ్యత ఉందా..? అదీ అసలు ప్రశ్న… ఈ కథనం ఏమంటున్నదంటే..? ‘‘మావోయిస్టులు కూడా మనవాళ్లే కదా, విదేశీయులు కాదు, మావోయిజం సామాజిక సమస్య, వాళ్లు కూడా మన సమాజంలో భాగమే, కాపాడుకుందాం, గతంలో వైఎస్ ప్రభుత్వం చర్చలకు పిలిచి, భద్రంగా తిరిగి అడవుల్లోకి పంపించినట్టుగానే, వీళ్లను కూడా చికిత్సకు అనుమతించి, అరెస్టులు చేయకుండా… లొంగుబాటుకు ఆంక్షలు పెట్టకుండా, ఓ భరోసా ఇచ్చి వాళ్లను కాపాడుకుందాం… వీళ్లు కొన్ని సమస్యలపై ప్రభుత్వంపై పోరాడుతున్నారు తప్ప ఎవరి మీదా వ్యక్తిగత ద్వేషాలతో దాడులు చేయడం లేదు…’’ ఇదీ ఆ కథన సారాంశం… సమస్యను అర్థం చేసుకోవడంలో కొంత అపరిపక్వత, అసహజత్వం కనిపిస్తోంది తప్ప స్థూలంగా ఈ కథన ఉద్దేశాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు… అయితే..?
గతంలో వైఎస్ ప్రభుత్వం చర్చలకు పిలిచింది… ఆ చర్చలకు మావోయిస్టు నేతలు అడవులు వీడి బయటికి రావడానికి విస్తృతమైన ఓ ప్రాతిపదిక ప్రిపేర్ చేయాల్సి వచ్చింది… చర్చలు ముగిసేవరకూ ఇరువైపులా కార్యకలాపాల్ని నిలిపివేశారు… చర్చలు ఫలిస్తాయనే నమ్మకం ఇరుపక్షాల్లోనూ లేదు… కానీ ఒక శాంతి ప్రయత్నం… సమస్యపై ఒక డిబేట్… ఇప్పుడు మావోయిస్టుల్ని కరోనా కబళిస్తోంది… చాలామంది కీలకనేతలు కూడా వ్యాధిగ్రస్తులైనట్టు వరంగల్లో పట్టుబడిన ఓ కొరియర్ ద్వారా తెలిసిందని వార్త… ఈ స్థితిలో హఠాత్తుగా ప్రభుత్వం ఏకపక్షంగా, ఏ నిర్దిష్ట ప్రాతిపదిక లేకుండా ‘‘మానవీయ కోణాన్ని’’ ప్రదర్శించే చాన్సుందా..? ఎంత కసరత్తు సాగాలి..? ఇరువైపులా ‘‘తాత్కాలిక యుద్ధవిరమణ’’ ఒప్పందం కుదరాలంటే ఎంత ప్రయత్నం సాగాలి..?
Ads
ఇవేమీ లేకుండా…. ‘‘మీరు వచ్చేయండి, ఎక్కడైనా చికిత్స తీసుకొండి, వ్యాధి నుంచి కోలుకున్నాక తిరిగి అడవుల్లోకి నిర్భయంగా వెళ్లిపొండి, అప్పటివరకూ మేం ఏమీ అనబోం, తరువాత మళ్లీ మా వాహనాల కింద మందుపాతర్లు పేల్చండి.,. మేం కనిపిస్తే చుట్టుముట్టి కాల్చేయండి…’’ అని ప్రభుత్వాలు, పోలీసులు అంటారా..? అసలు ఒకరికొకరు కనిపిస్తేనే ఖతం చేసుకునేంత ఉద్రిక్తత ఉంది… ఇప్పుడు దండకారణ్యంలోనే మావోయిస్టు నాయకగణం ఉనికి… అక్కడి నుంచి కూడా తరిమేయాలనేది ‘రాజ్యం’ పంతం.., వేల బలగాలు, చివరకు డ్రోన్ బాంబింగ్ దాకా వెళ్లిపోయారనే వార్తలు… మావోయిస్టులు కూడా పోలీస్ వాహనాలపైనే దాడులకు దిగుతున్నారు… ఈ స్థితిలో కాగలకార్యం కరోనా తీరుస్తుంది అనే పోలీసువర్గాలు భావిస్తాయి… పైగా…
కేంద్రంలోని మోడీ సర్కారు కఠినంగా ఉంది… ఎల్గార్ పరిషత్ వంటి కేసుల్లోనే వయోవృద్ధులు, అనారోగ్య పీడితులకే బెయిళ్లు దొరకడం లేదు… కర్కశంగా వ్యవహరిస్తున్నది ప్రభుత్వం… అంతెందుకు..? సాధారణ యావజ్జీవానికి రెండురెట్లు జైలుశిక్ష అనుభవించినా సరే రాజీవ్ హంతకులను విడిచి పెట్టడం లేదు… అంటే కేంద్రం వైఖరి ఏమిటో చెప్పే సూచికలు ఇవి… ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి, తాత్కాలిక యుద్ధవిరమణ వంటి ఏదో సానుకూలత ప్రదర్శితం అవుతుందని ఆశించలేం… రణనీతిలో, రాజనీతిలో మానవీయత కనిపించే కాలమా ఇది..?!
Share this Article