.
నిజమే, ఓ ప్రవచనకారుడు చెప్పినట్టు… ఏ దేవుడికీ సంబంధం లేని పండుగ ఉగాది… కేవలం కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మాత్రమే… అదీ చాంద్రమానంలో లెక్కించే సంవత్సరం… వసంతం ఆరంభం…
ఇంగ్లిషు కేలండర్ పాటించేవాళ్లకు జనవరి ఫస్ట్ పండుగ… అలాగే దేశంలో చాలా రకాల కేలండర్లున్నాయి… చంద్రుడి పయనం ఆధారంగా లెక్కించేది చాంద్రమానం… సూర్యుడి గతిని బట్టి లెక్కించేది సౌరమానం… అదనంగా లూని సోలార్…
Ads
మతం, ప్రాంతం, సంస్కృతి, ఆచరణ పద్ధతులను బట్టి ఈ కేలండర్లు రకరకాలు… తమిళ, బెంగాలీ, మలయాళ, ఒరియా, అస్సామీ కేలండర్లు ప్రధానంగా సౌరమానం ఆధారంగా లెక్కించేవి… గ్రెగోరియన్ కేలండర్ సరేసరి…
లూనిసోలార్ కేలండర్ అంటే… చంద్రుడు, సూర్యుడి కదలికల ఆధారంగా గణించబడేవి… చాంద్రమానం, సౌరమానం నడుమ సమన్వయం కోసం అదనపు రోజుల్ని (అధిక మాసం) జోడిస్తారు…
సో, ఎవరి కేలండర్‌ను బట్టి వారికి ‘ఉగాది’, అంటే నూతన సంవత్సరాది పండుగ ఉంటుంది… సో, మన కేలండర్‌ను బట్టి ప్రధానంగా ఇది తెలుగు, కన్నడ ప్రాంతాల పండుగ…
సరే, మన తెలుగు ఉగాదికి వస్తే… షడ్రుచులతో పచ్చడిని చేసుకుని స్వీకరించడం ఓ పద్ధతి… పేరుకే పచ్చడి కానీ అది ఆహారం కాదు, దేవుడికి పెట్టే నైవేద్యం అసలే కాదు… మరెందుకు..?
జీవితంలోని అన్నిరకాల సుఖదుఖాలను, అనుభవాలను గుర్తుకు తెచ్చుకునేందుకు కొత్త ఏడాది తొలిరోజున దాన్ని తాగాలని / తినాలని చెబుతారు… కానీ అదీ సరైన వివరణ అనిపించుకోదు… ఎందుకంటే..? బెల్లం తీపికి అంటే సుఖానికి… వేప చేదుకు అంటే దుఖానికి… మరి మిగతావి..?
- బెల్లం- తీపి- ఆనందానికి ప్రతీక
- ఉప్పు- జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
- వేప పువ్వు- చేదు- బాధకలిగించే అనుభవాలు
- చింతపండు- పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు
- పచ్చి మామిడి ముక్కలు- వగరు – కొత్త సవాళ్లు
- కారం- సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు
ఇలా ఏవేవో వివరణలు వినిపిస్తాయి… ఏదో చదవాలి, వినాలి, అంతే… అసలు షడ్రుచులు ఎందరికి తెలుసు..? మన నోటి అంగిలి రుచి ఫీలయ్యేవి ఆరు రుచులు… అవి ప్రాథమిక రుచులు… అవి తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం)
చాలామందికి ఏ టేస్ట్ ఏదో కూడా సరిగ్గా తెలియదు… ఉప్పు పులుపు అనుకుంటారు… వగరు చేదు అనుకుంటారు… ఉప్పు అంటే అదొక సపరేట్ టేస్ట్… లవణం… ఎక్కువైతే వికారం… అలాగే వగరు అంటే లేత పచ్చి మామిడి కాయల (పిందెలు, ఇంకాస్త పెద్దవి) రుచి… పులుపు అంటే చింతకాయ, చింతపండు, నిమ్మ, ఆరెంజ్‌లు రుచి… వగరు అంటే బీర్ రుచి… సరే, కారం, చేదు, తీపి అందరికీ తెలిసినవే…
పలుచోట్ల పచ్చడిలో కొబ్బరి, అరటి ఎందుకు కలుపుతారో తెలియదు గానీ… ప్రధానంగా కావల్సినవి ఈ ఆరు రుచులే… వగరు కోసం మామిడి.. తీపి కోసం బెల్లం (చక్కెర కూడా వోకే).. పులుపు కోసం చింతపండు (నిమ్మకాయ కూడా వోకే).. ఉప్పు సరేసరి… కారం కోసం కొందరు పచ్చి మిర్చి వేస్తారు, కానీ ఎండుకారం (మిరం) బెటర్, కొందరు మిరియాల పొడి వేస్తారు… చేదు కోసం వేప పువ్వే కావాలని ఏమీ లేదు, కాసింత కాకరరసం చాలు… ఎవరి వీలును బట్టి, ఎవరి అలవాటును బట్టి వాళ్లు…
వేప పువ్వే కావాలి, బెల్లమే వేయాలి, చింతపండే వాడాలి అనే నియమమేమీ లేదు… ఏదో ఓ పద్ధతికి అలవాటైపోయి, అదే శాస్త్రం, అదే విహితం, అదే పద్ధతి అన్నట్టుగా అలవాటు చేసుకోవడమే తప్ప ఆ సరుకులే వాడాలని ఏమీలేదు… అదీ సంగతి…
Share this Article