సంక్రాంతి పూట టీవీ స్పెషల్స్ ఏమంత బాగోలేవు… చూడబుద్ధి కాలేదు… సినిమాలు కూడా పాతవే… హనుమాన్ వోకే, మిగతా మూడు రొటీన్ ఫార్ములా సినిమాలు… చూడాల్సిన పనేలేదు… దరిద్రపు టీవీ సీరియళ్లకు తల అప్పగించే సాహసం చేయలేం… సూపర్ స్టార్ చూద్దామా అని మొన్నటి ఎపిసోడ్ ఓపెన్ చేస్తే (డిస్నీ హాట్‌స్టార్ ఓటీటీ) స్త్రీముఖి ఆంటీ కేకలు, అనంత శ్రీరాం గెంతులు నాట్ భరించబుల్… ఆమధ్య జీతెలుగులో వచ్చిన సరిగమప చూశాం కదా, ఇది దానికి క్లోన్ అన్నమాట… కాకపోతే ప్రదీప్ కుళ్లుజోకులు లేవు,.. అంతే తేడా…
అదే హాట్‌స్టార్‌లో సూపర్ సింగర్ 9 ఎపిసోడ్లు కనిపించాయి… ఆగకుండా రెండుమూడు ఎపిసోడ్లు అలా టైమ్ గడిచిపోయింది… ఇప్పటి మ్యూజిక్ షోలతో పోలిస్తే అవెంత బాగున్నాయో… దాదాపు ఎనిమిదేళ్ల క్రితం సీజన్ అది… ఇప్పుడంటే భ్రష్టుపట్టిస్తున్నారు గానీ సూపర్ సింగర్ నాణ్యత మాటీవీగా ఉన్నప్పటి నుంచీ బాగానే ఉండేది… (రేలారేరేలా వంటి ప్రోగ్రాములతో ఈ టీవీయే పాటల్ని మరింతగా జనంలోకి తీసుకెళ్లింది… ఉదయభాను స్వీయరచన గంగగరుడాలెత్తుకెళ్లేరా రేలారే ప్రోగ్రాములోనిదే… కాకపోతే అప్పుడు జడ్జిలు గోరటి, అనంతశ్రీరాం, వందేమాతరం, తమ్మారెడ్డి ఉన్నట్టున్నారు…) ఈ 9 సీజన్ మాత్రం నిజంగానే ‘సూపర్’ సింగర్… ఆసక్తి కలిగిన సంగీత ప్రియులు మరోసారి ఎంజాయ్ చేయవచ్చు…
ఇదే స్త్రీముఖి బక్కపల్చగా, అందంగా.., పెద్దగా అరుపులు కేకల జోలికి వెళ్లకుండా, ఒద్దికగా, నమ్రతగా, పద్ధతిగా హోస్ట్ చేసింది… ఇప్పుడు షోలలో ఆమె హోస్టింగ్ చిరాకెత్తుతోంది… ఆ సీజన్ జడ్జిలు చంద్రబోస్, మనో, ఆర్పీ పట్నాయక్, గోరటి వెంకన్న… గోరటి తనకు పెద్దగా పరిచయం లేని శృతులు, నోట్స్, ల్యాండింగుల వంటి సాంకేతికాంశాల జోలికి పోలేదు… తన జానర్ జానపదం,.. పట్నాయక్, మనోల విశ్లేషణ, చంద్రబోస్ వివరణలు బాగున్నయ్…
Ads
పర్టిక్యులర్‌గా ఈ సీజన్ గురించి చెప్పుకోవడం ఎందుకంటే..? దాదాపు ప్రస్తుత, ప్రఖ్యాత తెలుగు గాయకుల్లో చాలామంది ఉన్నారు… సునీత లేకపోవడం ఓ లోటు అనిపించింది… ఉష, గీత కూడా లేరు… కానీ కల్పన, కౌసల్య, గోపిక పూర్ణిమ, రఘు కుంచె, పార్థు, మల్లి లీడర్లుగా ఉన్న టీముల్లో కూడా ప్రముఖ గాయకులు మామూలు కంటెస్టెంట్లు… ఒకప్పటి జంట హేమచంద్ర, శ్రావణభార్గవి వేర్వేరే టీముల్లో… గోపిక, మల్లి వేర్వేరే టీముల లీడర్లు…
మొన్నటి ఇండియన్ ఐడల్ హిందీ సీజన్‌లో ఓ ఊపు ఊపేసిన మన షణ్ముఖ ప్రియ ఈ సూపర్ సింగర్ సీజన్‌లో చిన్న పిల్ల… ఆమే కాదు, ఇప్పుడు సూపర్ సింగర్‌లో కనిపిస్తున్న ప్రవస్తి, ఆహా ఇండియన్ ఐడల్ తెలుగు ఫస్ట్ సీజన్ రన్నరప్ వైష్ణవి కూడా అప్పుడు కంటెస్టెంట్లు… ధనుంజయ్, కృష్ణ చైతన్య, శ్రీకృష్ణ, రమ్య బెహరా, మాళవిక, ప్రణవి, లిప్సిక, అంజన సౌమ్య, మధుప్రియ, రోహిత్, దినకర్ తదితరులంతా టీమ్స్ మెంబర్స్… ఇంకొందరు పేర్లు సమయానికి యాదికొస్తలేవు… రేవంత్, శ్రీరామచంద్ర, కారుణ్య లేరు…
ఇదీ సినిమా పాటల పోటీ అంటే… ఒకరిని మించి మరొకరు… సాధన, తప్పులు దొర్లకుండా ప్రతిభను ప్రదర్శించడం కనిపిస్తుంది… సూక్ష్మాంశాలను కూడా మనో పట్టుకునే తీరు కూడా బాగుంటుంది… ప్రత్యేకించి కల్పన పాటల ఎంపిక, శ్రమ, ప్రతిభ అబ్బురం అనిపిస్తుంది… అందరూ ఎంచుకున్న పాటల్లో వైవిధ్యం కూడా ఉంది… ఇప్పటి పాటల పోటీల్లో అవేమీ లేవు… ఆహా ఓహో, అద్భుతంగా పాడావు అంటూ పొగడ్తలు…
జడ్జిలతో స్టెప్పులు వేయించి, జడ్జిలే టీమ్ లీడర్లుగా వ్యవహరించే ప్రస్తుత దిక్కుమాలిన పాటల పోటీల్లో కంటెస్టెంట్లే జడ్జిలను ఎంచుకునే తీరు ఓ పిచ్చితనం… ఇదుగో, ఈ పెడపోకడలు, ఇకారాల నడుమ ఆ పాత సూపర్ సింగర్ చూడటం ఓ స్ట్రెస్ బస్టర్, రిలాక్సింగ్… కాకపోతే పాత వీడియోలు కదా, క్వాలిటీ అంతంత మాత్రంగా ఉంది…!
Share this Article