Any Chance?: నార్వే దేశ జనాభా 54 లక్షలు. అందులో ఒక అంచున పది శాతం మంది అంటే అయిదున్నర లక్షల మంది మాత్రమే మాట్లాడే ఒకానొక నార్వేకు చెందిన “నైనార్స్క్” మాండలిక భాషలో రాసిన రచయిత జాన్ ఫోసెకు ఈ యేటి సాహిత్య నోబెల్ బహుమతి వచ్చింది. వ్యక్తం కాని విషయాలను తన రచనల్లో వ్యక్తపరచడంలో ఫోసే సిద్ధహస్తుడు అని అవార్డు ఎంపిక కమిటి చెప్పింది. సంతోషం.
ఈలెక్కన పది కోట్ల మందికి పైగా మాట్లాడే తెలుగుకు సాహిత్య నోబెల్ ఎప్పటికయినా వస్తుందా? అన్న ప్రశ్న మెదలాలి. ఎందుకు రాకూడదు? అన్న ఆశ మొలకెత్తాలి. కానీ- తెలుగువారికి అలాంటి చిన్న చిన్న విషయాలమీద పెద్ద పట్టింపు ఉండదు కాబట్టి చర్చ అకడెమిక్ డిబేట్ స్థాయికి కూడా వెళ్లదు.
Ads
కవులను, రచయితలను, పండితులను, వైయాకరణులను, సాహితీ విమర్శకులను గుర్తించి, గౌరవించడం ఒకప్పుడు సంస్కారం. మర్యాద. తెలుగులో జ్ఞానపీఠం అవార్డుకు అర్హుడై…ఆ అవార్డు రాక…మనసు గాయపడ్డ “సరస్వతీపుత్ర” బిరుదాంకితుడు పుట్టపర్తి నారాయణాచార్యుల సంగతి ఇది.
నేను హిందూపురంలో విలేఖరిగా పనిచేస్తున్నప్పుడు పెనుకొండలో ఒక సాహితీ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పుట్టపర్తి నారాయణాచార్యులు వస్తున్నారని తెలిసి పెనుకొండ వెళ్లాను. ఆ ఊళ్లో ఒక పండితమిత్రుడి ఇంట్లో పుట్టపర్తి వారున్నారు. నా వయసు 20. వారి వయసు 70 దాటి ఉంటుంది. అంత పెద్దాయనతో ఏమి మాట్లాడాలో? ఎలా మాట్లాడాలో? తెలియదు. కానీ ఆయన్ను చూడాలి. కలవాలి. మాట్లాడాలని ఉబలాటం. నేను అప్పటికి పారాయణంలా చదువుకుంటున్న శివతాండవం గురించి ఆయనకు చెప్పాలి అనుకుంటూ ఆయన బసచేసిన ఇల్లు చేరాను.
మహా మహా పండితులే పుట్టపర్తివారితో మాట్లాడలేరు అని ఎన్నెన్నో కథలు ఇదివరకే విని ఉన్నవాడిని. “నేను అది రాశా…ఇది రాశా…అని ఎవరయినా హెచ్చులుపోతే…వారితో ఆయన ఒక ఆట ఆడుకుంటారు. ఏమీ తెలియదు అని అంటే తనకూ ఏమీ రాదని…చిన్నపిల్లాడిలా హాయిగా కలుపుగోలుగా మాట్లాడతారు” అని మా గురువుగారు అనేకసార్లు చెప్పిన విషయం నాకు గుర్తుంది.
పుట్టపర్తి వారంటే నాకొక పులకింత…నమస్కారం పెట్టుకుని వెళ్లిపోతాను…అడగండి అని అక్కడ నాకు పరిచయమున్న ప్రఖ్యాత అష్టావధాని ఆశావాదిగారిని అభ్యర్థించాను. ఆయన మెల్లగా వెళ్లి అడిగారు. రమ్మన్నారు. ఫలానా పమిడికాల్వ చెంచు సుబ్బయ్య కొడుకును అని నమస్కారం పెట్టాను. గౌరిపెద్ది శిష్యుడే కదా మీనాయన? లేపాక్షి ఓరియంటల్ కాలేజీయేనా? అన్నారు. ఫలానా కర్రా వెంకటసుబ్రహ్మణ్యం శిష్యుడిని అని కూడా చెప్పా. అంతే…కూర్చోమన్నారు. కర్రా సుబ్రహ్మణ్యం- పుట్టపర్తి కడప రామకృష హై స్కూల్లో కలిసి కొంతకాలం పనిచేశారు.
కర్రా సార్ నాకు వ్యాకరణం ఛందస్సు అలంకారాలను మీ శివతాండవాన్ని ముందు పెట్టుకుని పాఠం చెప్పారు అన్నాను- ఆయన ఆనందిస్తారు అనుకుని. ఆయన దిగులుగా మొహం పెట్టి…ఎందుకప్పా! పద్యం కడుపు నింపుతుందా? కాలు నింపుతుందా? ఏ ఇంగ్లీషో, లెక్కలో నేర్చుకోకపోతివా! ఎక్కడన్నా ఉద్యోగానికన్నా పనికొస్తా ఉండె కదా! అని నిట్టూర్చారు. శివతాండవంలో “తలపైన చదలేటి అలలు తాండవమాడ” పద్యం నాకు నేనే కల్పించుకుని పాడాను- ఆయన పొంగిపోయి కౌగలించుకుని అభినందిస్తారనుకుని. సాహిత్యానికి మెతుకులు పుట్టే రోజులు కాదు నాయనా! ఇష్టానికి చదువుకో…బతుకు తెరువుకు ఇంకేమన్నా చూసుకో! అన్నారు. ఇక మాట్లాడేదేమీ లేదన్నట్లు మౌనంగా ఉండిపోయారు.
నమస్కారం పెట్టి బయటికి వచ్చి పెనుకొండ రోడ్ల మీద కాసేపు తిరిగి…సాయంత్రం ఆయన సాహిత్యోపన్యాసంలో శ్రోతగా జనం మధ్య కూర్చున్నా. ఆయన 13 ఏళ్ల వయసులో రాసిన తొలికావ్యం పెనుకొండ లక్ష్మితో మొదలు పెట్టి విజయనగర వీధుల్లో వీరవిహారం చేయించారు. గంటన్నరపాటు నేను అయిదు వందల ఏళ్ల కిందట పెనుకొండ వేసవి విడిదిలో కృష్ణదేవరాయల పక్క సీట్లో కూర్చుని ఉన్నట్లు గాల్లో తేలిపోయా. కాలేజీ పిల్లలు, ఊరి జనం ఈలలు, కేకలు, చప్పట్లు. మనం రోజూ తిరిగే పెనుకొండ ఇంత గొప్పదా! అని ప్రేక్షకుల్లో కొందరు పొంగిపోయారు.
నాకు మాత్రం ఆయన్ను కలిసి మాట్లాడానన్న ఆనందం కంటే...ఆయన వైరాగ్యం, కొత్తతరానికి సాహిత్యం కూడు పెట్టదన్న నిర్వేదం ఇప్పటికీ వెంటాడుతోంది.
“ఒకనాడు కృష్ణరాయ కిరీట సుమశేఖరంబయిన అభయ హస్తంబు మాది;
ఒకనాడు గీర్దేవతకు కమ్రకంకణ స్వనమయిన మాధురీ ప్రతిభమాది;
ఒకనాడు రామానుజ కుశాగ్ర బుద్ధికే చదువు నేర్పినది వంశమ్ము మాది;
ఒకనాటి సకల శోభలకు తానకంబయిన దండిపురంబు పెనుగొండ మాది;
తల్లిదండ్రుల మేధ విద్యా నిషద్య పాండితీ శోభ పదునాల్గు భాషలందు,
బ్రతుకునకు బడిపంతులు, భాగ్యములకు చీడబట్టిన రాయలసీమ మాది”
అని ఆయనే చెప్పుకుని బాధపడ్డారు. పద్నాలుగు భాషల్లో ప్రావీణ్యం. వందకు పైగా ప్రచురితమయిన పుస్తకాలు. వందల కొద్దీ ప్రింట్ కాకుండా కాలగర్భంలో కలిసిపోయిన రచనలు. శ్లోకం, పద్యం, గద్యం, పాట, కథ, నవల, విమర్శ, అనువాదం. వేన వేల ఉపన్యాసాలు. వందల కొద్దీ పుస్తకాలకు పీఠికలు. ముందుమాటలు. సూపర్ బజార్ ను సంస్కృతంలో “నిషద్య” అంటారు. తల్లిదండ్రుల నుండి ఆయనకు వారసత్వంగా వచ్చింది విద్యా నిషద్య. భాగ్యాలకు చీడబట్టిన రాయలసీమలో బతుకుదెరువుకు బడి పిల్లలకు తెలుగు పాఠాలు చెప్పుకుంటున్నాను అని ఎంతగా కుమిలిపోయారో?
తను పదమూడో ఏట రాసిన పెనుకొండ లక్ష్మి కావ్యం విద్వాన్ కోర్సులో తనకే పాఠంగా వస్తే…తన రచననే పాఠంగా చదువుకుని…పరీక్ష రాసిన కవి పుట్టపర్తి. ప్రపంచ సాహిత్య చరిత్రలో ఇలాంటి పురస్కారం ఇంకొకరికి వస్తుందా? ఎన్ని జ్ఞాన పీఠాలు, ఎన్ని నోబెల్ పురస్కారాలు ఈ గౌరవానికి సమానం? అని నాలాంటి అభిమానులు గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు.
ఇలా జ్ఞానపీఠం ఒక్కటే కాదు…ఏ పీఠాలు గుర్తించక అనామకంగా పోయిన తెలుగు కవులెందరో? ప్రపంచంలో కేవలం అయిదున్నర లక్షల మంది మాట్లాడే భాషలో రాసిన ఫోసే నోబెల్ సాహిత్య బహుమతి తెచ్చుకున్న సందర్భంగా ఆనందిస్తూ…తెలుగువారిగా కనీసం మనల్ను మనం కూడా గుర్తించక గాయపడ్డ కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో? రాసిన కావ్యాలకు గుర్తింపు లేక బాధపడ్డ హృదయాలెన్నో? తలచుకుంటూ…తలలు వంచుకుందాం…. -పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article