Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

స్మిత అందం… షబానా అభినయం… మండీ అంటే ఓ అబ్బురం…

January 10, 2023 by M S R

Sai Vamshi…..  ఆ అభినయ అందం పేరు ‘షబానా’

ప్రియతమా లే, నాతో కలిసి నడవాల్సిన సమయమిదే

యుద్ధ జ్వాలలు మన లోకాన్ని ముంచెత్తుతున్నాయి

Ads

కాలమూ విధీ ఒకే ఆకాంక్షను ప్రకటిస్తున్నాయి

మన కన్నీళ్లివాళ వేడి వేడి లావాలా ప్రవహిస్తాయి

అందానికీ ప్రేమకూ ఇవాళ ఒకటే జీవితం, ఒకటే ఆత్మ

నువ్విక నాతో కలిసి స్వేచ్ఛాజ్వాలతో కరిగిపోవలసిందే

లే, నా ప్రియతమా, నాతో కలిసి నడవాల్సిన సమయమిదే

(మూలం: కైఫీ ఆజ్మీ – అనువాదం: ఎన్ వేణుగోపాల్)

షబానా ఆజ్మీ తండ్రి కైఫీ ఆజ్మీ కవి. తల్లి షౌకత్ ఆజ్మీ రంగస్థల నటి. షౌకత్ హైదరాబాద్ వాస్తవ్యురాలు. 1930 నాటి హైదరాబాద్ సంస్థానంలో పౌరురాలు. ఖురాన్‌ను ఉర్దూలోకి అనువాదం చేసింది వారి పూర్వీకులే! కైఫీ ఏమీ తక్కువ కాదు. ఆయన ముగ్గురు సోదరులూ కవులే! షబానాది కళాకారుల కుటుంబం. కళాకారుల కడుపున కత్తులే పుడతాయి. షబానా అటువంటి కత్తి. హైదరాబాద్లో పుట్టారు. ఆ కత్తిని సానబెట్టిన వ్యక్తి సికింద్రాబాద్‌వాసి. ఆయనది తిరుమల్‌గేరి. పేరు బెనగళ్ల శ్యాం సుందర్ రావు. మనం చెప్పుకునే ప్రఖ్యాత దర్శకుడు శ్యాం బెనగల్.

శ్యాం బెనగల్ సినీప్రస్థానంలో షబానాది ఒక అధ్యాయం. షబానా ఆజ్మీ నట జీవితంలో శ్యాం శ్రీకారం. ఒకరి గురించి చెప్పకుండా మరొకరి గురించి చెప్పడం సాధ్యం కాదు. భారతదేశంలో ఇంతగా ప్రఖ్యాతి పొందిన కాంబినేషన్లు చాలా తక్కువే! దక్షిణాదిన జయసుధ-దాసరి, సరిత-కె.బాలచందర్, అర్చన-బాలూ మహేంద్ర.. ఇలా కొన్ని! శ్యాం బెనగల్ తొలి సినిమా ‘అంకుర్’లో షబానానే ముఖ్య పాత్రధారి. ఆయన ఆమెకు అవకాశం ఇచ్చారు. ఆమె చక్కగా నటించి జాతీయ అవార్డు తెచ్చుకుంది. ఆ తర్వాత మరిన్ని సినిమాలు, మరింత గొప్ప సమ్మేళనాలు.

‘మండీ’ వారిద్దరి కాంబినేషన్లోదే! ఈ సినిమాలో ప్రఖ్యాత నటులున్నారు. భారతీయ సమాంతర సినిమాకు స్తంభాలుగా నిలిచి చివరిదాకా ఆ నిర్మాణానికి తమదైన బలాన్ని చేకూర్చారు. షబానా ఆజ్మీ, స్మితా పాటిల్, ఓంపురి, అమ్రీష్ పురి, నసీరుద్దీన్ షా, కుల్‌భూషణ్ కర్బందా. ఎవరు తక్కువ! ఎవరు ఎక్కువ! ఇంతమందిని ఒక కథలో చేర్చి కూర్చి సినిమా తీయడం అరుదైన ఘనత. ఈనాటికి అదొక చిరస్మరణీయమైన స్మృతి. ఉర్దూ రచయితల గులాం అబ్బాస్ రాసిన ‘ఆనంది’ కథ ఆధారంగా బెనెగల్ ఈ స్క్రిప్ట్ రాసుకున్నారు.

అప్పటికి తొమ్మిది సినిమాలు తీసి, ఐదు జాతీయ పురస్కారాలు, అనేక అంతర్జాతీయ అవార్డులు అందుకున్న శ్యాం రాయాలంటే కథలు కొదవా? ఎవరిదైనా కథ చోరీ చేసి, సినిమా తీసి ‘ఇది నా సృజనే’ అంటే నమ్మే జనాలు తక్కువా? ఆయనకు అటువంటి పోకడలు లేవు. కథ గొప్పది. బలం కలిగినది. సినిమాకు అర్హమైనది. రచయితకు తప్పక క్రెడిట్ ఇవ్వాల్సినది. ఇచ్చారు. సినిమా తీశారు. అది నిబద్ధత. రచయితల మీద గౌరవం. ముసుగు వేసుకుని ఫొటోలు తీసే కాలం పోయింది. అయినా కొందరు దర్శకులకు ముసుగులు ఇష్టం. అందులో ఉంటూ ఇతరుల కష్టాన్ని తమదిగా చెప్పుకు తిరుగుతారు. గొప్ప దర్శకులకు ఆ చింత లేదు. శ్యాంకు అసలే లేదు.

రూపాయి కాసంత బొట్టు, తళతళలాడే రంగుల చీర, పొడుగాటి జుట్టు, చారెడంత మెరుపు కళ్లు, చేతిలో పాన్‌దాన్.. ఇదీ ఈ సినిమాలో షబానా ఆహార్యం. ఈ సినిమాలో కనిపించింత అందంగా, ఆకర్షణీయంగా మరే సినిమాలోనూ ఆమె కనిపించదు. ఇంత వయ్యారంగానూ నటించి ఎరుగదు. పాత్ర అలాంటిది. వేశ్యా గృహం నడిపే పెద్ద. తోడుగా వేశ్యలు, ఓ పనివాడు. అయితే సినిమా మొత్తంలో ఎక్కడా మనం షబానాను అసహ్యించుకోం. ‘అబ్బా’ అని అనుకోం!

అంకుర్’ చేసిన, ‘నిశాంత్’, ‘స్పర్శ్’ లాంటి సినిమాలు చేసిన ఆమే ఈమె అంటే నమ్మలేం! ఇక్కడ షబానా కనిపిస్తారు కానీ, ఆమెతోపాటు తను పోషించిన రుక్మిణీ బాయి పాత్ర మనలో నిలిచిపోతుంది. స్మితా పాటిల్ కనిపిస్తున్నా మనం షబానా వంకే చూస్తాం. స్మితది గొప్ప అందం. షబానా మాత్రం తక్కువేంటి అని అనుకోగలిగే మాయేదో ఆమె తన నటనతో చేశారు. సమ్మోహపరిచారు. ఓసారి ‘మండీ’ చూడండి. షబానా కోసం! స్మిత కోసం కూడా! ఇద్దరూ ఇద్దరే! సినిమా Amazon primeలో లభ్యం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓహో, నువ్వు సినిమా హీరోయిన్‌వా..? నేనెప్పుడూ నిన్ను చూడలేదమ్మా..!!
  • సరిగ్గా కుదరాలే గానీ… బేజా ఫ్రై టేస్టు… ఆరోగ్యానికి బెస్టు… ఇప్పుడిదే ట్రెండు…
  • రెండు శత్రు దేశాల్లోనూ ఒకడే జాతీయ హీరో… ఇంట్రస్టింగ్…
  • ఎస్వీరంగారావు… మెగా ఆర్టిస్టే కాదు… మెగాఫోన్ పట్టాడు, పైసలూ పెట్టాడు…
  • వావ్… రామాయణ్ గ్రాఫిక్ గ్లింప్స్… సింపుల్, జస్ట్, ఓ చిన్న శాంపిల్…
  • దగ్గరలోనే మరో రెండు ఆదిశక్తి పీఠాలు… ఓ విశిష్ట పరిచయం…
  • అంతటి చిరంజీవే మరణిస్తే… తెలుగు ప్రేక్షకులు మెచ్చుతారా..?
  • కామాఖ్యలో కనిపించిన ఓ విశిష్టమైన తంతు… నొప్పి మార్పిడి…
  • స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions