భారీ వర్షాలు, వరదలు, ప్రవాహాలు ఉధృతం… ఓ కుటుంబం ఒక తెప్ప మీద కొట్టుకుపోతోంది…. ఒకరిద్దరు పిల్లలు కొట్టుకుపోయారు, పోతేపోయారు, మళ్లీ కనొచ్చు అనుకున్నారు,,. ప్రాణాలకు మించిన స్వార్థం ఏముంటుంది..? అసలు సగటు జీవలక్షణమే అది కదా… ఓ క్షణం, ఓ సందర్భం వచ్చింది… భార్య, ఒక కొడుకు, తను మిగిలారు… తాము ఏ తెప్ప మీద ఉన్నారో అది ఒకరికే ఆశ్రయం ఇవ్వగలదు, లేకపోతే ముగ్గురూ మునిగిపోతారు… భార్యను తోసేశాడు… బతికి బట్టకడితే మరో భార్య, లేకపోతే లేదు… ఇక కొడుకు… నేనుండాలా..? కొడుకు బతకాలా..? తనకు 80 ఏళ్లు, బతికినా ఉద్దరించేది ఏమీ లేదు, కొడుకు వయస్సు 35 ఏళ్లు, బోలెడు జీవితముంది… అప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలి..? సంక్లిష్టమైన ప్రశ్న కదా… ఢిల్లీ హైకోర్టుకూ ఇలాగే అనిపించింది…
ఒరేయ్ అబ్బాయ్, ఈ స్థితిలో ఎవరు బతకాలి..? ఒక స్థితిలో ఇటలీయే కాదు, ఇండియాలో కూడా కొన్నిచోట్ల… రోగుల వయసు ఆధారంగా బెడ్స్ కేటాయించే దురవస్థ… ముసలోడు పోతే పోనీ, బతికి సాధించేది ఏముంది..? యువకుడు బతికి ఉంటే జాతికి రక్ష… విస్తరణ… అందుకని ముందుగా యువతకు ప్రాధాన్యం అనే సూత్రం… అమానవీయం, ప్రాణాలు ఎవరివైనా ప్రాణాలే కదా అనకండి… అది సందర్భాన్ని బట్టి ఉంటుంది… ప్రాణం విలువకు గ్రేడింగ్ ఉంటుంది… ఇప్పుడూ అదే… ఎలాగంటే..?
Ads
మన మోడరన్ వైద్యం వికటించి… మన కార్పొరేట్, ప్రైవేట్ వైద్యం వెర్రితలలు వేసి…. వైద్యస్వార్థం అష్టావక్రల్ని సృష్టించినట్టుగా… బ్లాక్, యెల్లో, వైట్ వంటి ఫంగస్ వ్యాధుల్ని తీసుకొచ్చింది… అవి కొత్తవేమీ కాదు, కానీ మన అజ్ఞాన వైద్యం పుణ్యమాని అవి బలోపేతం అయ్యాయి… ప్రాణాల్ని కబళిస్తున్నయ్… మందు ఉంది… పేరు యాంఫోటెరిసిన్-బి… ఒక్కొక్కడికీ 60 పొడిస్తే తప్ప రోగి బతకడు… అసలే కార్పొరేట్ దందా… కంపెనీల దందా… ప్రభుత్వం చేతకానితనం… ఈ స్థితిలో ఉన్న సరుకే పరిమితం… మరి దాన్ని ఎవరికివ్వాలి..? ముసలోళ్లకు ఇవ్వాలా..? యువకులకు ఇవ్వాలా..?
నో, నో, ఇలా వివక్ష చూపొద్దు, ప్రాణం ఎవరిదైనా ప్రాణమే… ఫలానా వాడికే ఇవ్వాలి ఇంజక్షన్ అంటే అది అమానవీయం… ప్రకృతి నియమాలకే విరుద్ధం అంటారా..? కానీ ప్రశ్న ఏమిటంటే..? ఎవరికి ఆ మందు ఇవ్వాలి, ఎవరిని పక్కన పడేయాలి..? మందుకు కొరత ఉంది కాబట్టి క్రూరమైనా సరే ఓ నిర్ణయం తీసుకోవాలి అంటున్నది ఢిల్లీ హైకోర్టు… ఎవరికి మందు ఇవ్వాలో డాక్టర్లకు నిర్ణయాధికారం..? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి, ప్రాధాన్యతల్ని నిర్వచించాలి అని చెప్పింది నిన్న ఓ విచారణ సందర్భంగా…!
ఉదాహరణకు… 80 ఏళ్ల రోగి ఒకరు… 35 ఏళ్ల రోగి మరొకరు… ఉన్నది కాసింత మందే… ఎవడికి దక్కాలి ఆ మందు..? ఇక్కడ ఎవరి ప్రాణం విలువ ఎక్కువ, ఎవరి ప్రాణం విలువ తక్కువ అనేది కాదు సమస్య… ఎవరు బతకాలి..? ఇదే ప్రశ్న… నిజంగానే ఈ దురవస్థ దేశంలో… కేంద్రానికి ఏ విషయంలోనూ ఓ పాలసీ లేదు, ఉన్న పాలసీలు లోపభూయిష్టం… మరి ఇందులో ఏం చేయాలి..? అందుకని ముందుగా ప్రభుత్వ పాలసీ ఏమిటో ఖరారు చేసి చెబితే, తరువాత తన తీర్పు చెబుతాను అనేసింది కోర్టు… కోర్టు తీర్పు అంతిమం కాదు, పవిత్రమూ కాదు… కానీ అది తేల్చుకోలేక అడిగింది… మీరు చెప్పండి… ఆ మందు ఒకరికే ఉపయోగపడే పక్షంలో ఎవరికి ఇవ్వాలి..? ఎవరి ప్రాణాలకు విలువ..? ప్రాణాల్ని ప్రాధాన్యీకరించగలమా..?!
Share this Article