.
మహాభారతంలో కుంతి తన దైవ సంతానమైన కర్ణుడిని నదీప్రవాహంలో ఓ పెట్టెలో పెట్టి వదిలేసింది… ఆ పెట్టె ఏదో ఓ గట్టుకు చేరుతుందని, ఎవరో చేరదీస్తారని అనుకుంది… అదీ ప్రేమే..! అసలు ఆ శిశువు బతికే ఉండకూడదని అనుకుంటే ఎక్కడో పూడ్చి వేయించేది…
ఆ కర్ణుడికి సమయానికి అతిరథ నందుడు అనే సూతుడు, రాధ అనే మంచి తల్లి దొరికింది… కాదు, వాళ్లకే తను దొరికాడు… కథ అలా సాగింది… దేశంలో చెత్త కుండీల్లో పడిన కర్ణుల వార్తలెన్ని చదవలేదు మనం…!
Ads
ఇక్కడ ఎవరు నిజమైన దోషులు..? సూర్యుడా..? కుంతి..? అప్పటి సమాజం..? వరమిచ్చిన మహర్షి..? ఈ మీమాంసలోకి వెళ్లడం వేస్ట్… అన్నీ చిక్కు ప్రశ్నలు… ఆ లోతుల్లోకి వెళ్తే బయటపడటం కష్టం… ఇప్పుడూ సేమ్, అలాగే… నాలుగేళ్ల క్రితం గంగానదిలో ఓ పెట్టె కొట్టుకొచ్చింది…
ఉత్తరప్రదేశ్… గాజీపూర్… గంగానది దాద్రీఘాట్… మంగళవారం సాయంత్రం నీటిపై తేలుతూ ఓ పెట్టె కనిపించింది… దగ్గరలోనే ఉన్న ఓ బోటు ఓనర్ మల్లాహ్ గుల్లు దాన్ని గమనించాడు… పెట్టెను ఒడ్డుకు లాగాడు…
తెరిచి చూస్తే ఓ పాప… హిందూ దేవుళ్ల ఫోటోలు… పాప జాతకచక్రం కూడా… శిశువు పేరు గంగ అని కూడా రాసి ఉన్న మరో కాగితం… అంటే అర్థమేమిటి..? నేటి భారతంలో ఓ కర్ణి… వదిలేసిన వాళ్లకు కాస్త జాలి, ప్రేమ ఉన్నయ్… గంగ ఒడ్డునే పాతేసి వెళ్లిపోలేదు…
ఎవరికో దొరికి, ఎక్కడో చల్లగా బతకాలనే కోరుకున్నారు… ఏ స్థితిలో వదిలేశారో, ఎవరో అనవసరం… ఆ బోటు ఓనర్ ఇంటికి తీసుకెళ్లాడు… గంగమ్మ తల్లే తమకు ఆ పాపను ప్రసాదించిందనీ, పెంచుకుందామని అనుకున్నారు…
అంతా సజావుగా సాగిపోవడానికి ఇదేమైనా నాటి భారత కాలమా..? ఠాట్ కుదరదు అంటూ పోలీసులు ప్రవేశించారు… అసలు ఇదే ఈ కథలో చెప్పుకోదగింది…
వచ్చారు, పాపను స్వాధీనం చేసుకున్నారు, శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు, కేసు నమోదు చేశారు… ఆ పాప అసలు తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుంటారట… హత్యాప్రయత్నం కేసు పెట్టారా..? తెలియదు…!!
ప్రభుత్వాలు నడిపే శిశుసంరక్షణ కేంద్రాలు నరకాలకు నకళ్లు… అందరికీ తెలుసు… చివరకు ఆ గంగ బతుకు అక్కడికి చేరింది… నో, నో, చట్టం చట్టమే అంటారా..? అంతేలెండి…! గుడ్డిలో మెల్ల… ఈ వార్త ఏదో పత్రికలో పడింది… యోగికి తెలిసింది…
ఆ పాపను తమ ప్రభుత్వం దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించాడు… ఆ బోటు యజమానిని ప్రశంసించాడు… మెచ్చుకోలుగా ఏవో ప్రభుత్వ పథకాలనూ వర్తింపజేస్తామన్నాడు… నోటి మాటో, ట్వీటో కాదు… యోగికి నిజంగానే ఆ పాప మీద జాలి, ప్రేమ కుదిరితే… ఆ సకల దరిద్రాల శిశుసంరక్షణ కేంద్రం నుంచి బయటికి తీసుకురావాలి…
ప్రభుత్వ సిబ్బంది నుంచి ఆమెను ఇప్పుడు కాపాడాలి… ఉద్యోగులు ఎలా ఉంటారో లోకం మొత్తానికి తెలుసు… కాబట్టి, వీలైతే తన గోరఖ్‌పూర్ ఆశ్రమంలో ఉంచి సాకాలి… పెంచాలి… ఓ శకుంతలకు కణ్వుడు కావాలి… ఆశ్రమానికి మరింత పుణ్యం…
https://twitter.com/myogiadityanath/status/1405152901484273676
2018లో ఓ సర్వే… ఆడపిల్ల పుట్టిందని, పేదరికంతో పెంచుకోలేమనీ ఏటా లక్ష మంది పిల్లలను తల్లులు వదిలేసుకుంటున్నారట… సరే, ఈ గంగను నిజంగా ప్రభుత్వం ఎలా పెంచుతోంది..? యోగీ తన మాట నిలుపుకున్నాడా..?
ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడుంది..? ఈ వివరాల కోసం గ్రోక్, డీప్‌సీక్, చాట్‌జీపీటీ ఎట్సెట్రా ప్లాట్‌ఫారాల్ని జల్లెడ పట్టినా వివరాలు దొరకలేదు… ఎంటైర్ యూపీ మీడియా కూడా ఆ పిల్లను వదిలేసింది ఏ ఫాలో అప్ లేకుండా..!!
Share this Article