చెప్పింది పాత పద్ధతి, రిజిస్ట్రేషన్లు చేసేది మాత్రం కొత్త పద్ధతిలో..!
మొరాయిస్తున్న సర్వర్లు.రోజుకు ఒక్కటి మాత్రమే స్లాట్ బుకింగ్…
అయోమయంలో అమ్మకం దారులు. కొనుగోలుదారులు…
రోడ్డున పడనున్న రైటర్ లు,స్టాంప్ వెండర్స్…
ఇప్పుడు రిజిస్ట్రేషన్లకు స్టాంప్స్ అవసరం లేదు…
తెల్ల పేపర్ మీదనే రిజిస్ట్రేషన్…
LRS లేని ప్లాట్స్ రిజిస్ట్రేషన్ కావు…
Vacant లాండ్ టాక్స్ కడితేనే రిజిస్ట్రేషన్…
రిజిస్ట్రేషన్ డాక్సుమెంట్లో పొడవు వెడల్పు కొలతలకు అవకాశం లేదు…
సేల్ డీడ్ క్యాన్సిల్ చేసుకోవడం కుదరదు…
Ratification చేసుకోవడానికి అవకాశం లేదు…ప్రాపర్టీ తమ పేరున ఉన్నవారు మరణిస్తే వారి లీగల్ హెయిర్ పేర్లు రాసు కోవడానికి అవకాశం లేదు…
ఇంతకు ముందు రోజుకు 100 నుండి 150 రిజిస్ట్రేషన్లు అయ్యేవి.ఇప్పుడు అంత సీన్ లేదు…
స్లాట్ లేకున్నా నార్మల్ పద్ధతిలో అయ్యేవి ఇప్పుడు కావు…
కొన్నవారు ఇష్టం వచ్చినట్లుగా డాక్సుమెంట్ రాసుకోవడానికి కుదరదు…
సాక్షుల పేర్లు ముందే రాయాలి…
రిజిష్టర్ అయ్యే రోజు అదే సాక్షి రాకపోతే రిజిష్టర్ కాదు…
ఇంకా అనేక సమస్యలు…
SPA,GPA, మార్టిగేజ్, గిఫ్ట్ డీడ్ కావడం లేదు…
ఇవ్వన్నీ పరిష్కారం కావాలంటే ….. కొన్ని సంవత్సరాలు పడుతుంది…
LRS అప్లై చేసుకున్న వారు 29 లక్షల మంది ఉన్నారు. వారు ఫుల్ గా LRS కట్టవలసిందే…
Ads
LRS పేర లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల భారం ప్రజల పైన వేసిన ప్రభుత్వం…
ప్రతి సంవత్సరం “ఓపెన్ ప్లాట్” కు టాక్స్ కట్టాలి ఇంటి పన్ను కట్టినట్లుగా…
……… ఇవీ ఒక చానెల్ వార్తలోని ముఖ్యాంశాలు… అంటే… ఏ అంశమైతే కేసీయార్‌కు బాగా వ్యతిరేకం అయిపోయిందో, ఏది బాగా ప్రజావ్యతిరేకమో…. ఆ అంశంలో కేసీయార్ కూడా ఏమీ చేయలేని ఊబిలో కూరుకుపోయాడు అన్నమాట… ఫీల్డ్ సమాచారం కూడా అలాగే ఉంది… అంటే ప్రభుత్వ ఉద్దేశం ప్రజలను పిండి పిండి వదిలేయడమే అనే లక్ష్యం సగటు మనిషికి కూడా అర్థమైపోతోంది…
మొత్తం తెలంగాణ సమాజం చీదరించుకుంటున్న ఎల్ఆర్ఎస్ అంశంపై చివరకు కేసీయార్‌కు కూడా ఏమీ దిక్కుతోచడం లేదు… తను ఏమనుకున్నాడో, ఏం చేయాలనుకున్నాడో, ఏం చేస్తున్నాడో తనకు కూడా అంతుపట్టని దురవస్థ… చివరకు ఓ సబ్ కమిటీ వేశాడు, అందరికీ తెలుసు… ఏ కమిటీల రిపోర్టులనైనా కేసీయార్ ఖాతరు చేయడు… ఇదో కంటితుడుపు…
రేప్పొద్దున సాగర్ ఉపఎన్నిక, వరంగల్-ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు, రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు, వస్తే గిస్తే వేములవాడ ఉపఎన్నిక… ప్రతిదీ పరీక్షే… ఈ స్థితిలో నిజంగా తనను బదనాం చేస్తున్న ఉన్నతాధికారులు ఎవరో… దీన్ని ఓ పెద్ద ఊబిలా మార్చేసిన వాళ్లు ఎవరో, వాళ్ల ఉద్దేశాలు ఏమిటో కేసీయార్ అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాడా అసలు..? జనాన్ని ప్రేమించలేని బ్యూరోక్రాట్స్ ఎంతటి ప్రభువునైనా ముంచేస్తారు… అది తెలియకపోతే ఎంతటి ప్రభువైనా మునిగిపోతాడు…
పై స్థాయిలో ఎవరు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో సగటు భూవిక్రయ, క్రయ వినియోగదారుకు అవసరం లేదు… మొత్తం కేసీయారే ఈ అవ్యవస్థకు కారకుడు అనే అనుకుంటాడు… దాన్ని ఎలా చక్కదిద్దాలో కూడా తెలియని దురవస్థలోకి కేసీయార్ కూరుకుపోవడం తనకే రాబోయే కాలంలో ఇంకా సమస్యలు తీసుకురాబోతోంది…
తనకు చెబుతున్నట్టుగా గాకుండా కేసీయార్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరును హైకోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా లేదా వదిలేయండి… కానీ ప్రజలకు అర్థమైంది ఒకే విషయం… వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై కేసీయార్ ప్రభుత్వం పక్కా ప్రజావ్యతిరేకంగా వ్యవహరిస్తోంది అని…
ఇప్పటికిప్పుడు తమ అవసరాల కోసం బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటి అవుతాయేమో…. అలాంటప్పుడు ఈ బండి సంజయ్‌ను, కేటీయార్ మాటల్ని ప్రజలు విశ్వసించరు… ఎంత విషాదం అంటే… ఈ స్థితిని వాడుకోవాల్సిన కాంగ్రెస్… పరమ దరిద్రమైన స్థితిలో పడిపోవడం… పీసీసీ అధ్యక్షుడి మార్పుకి ఇంకా కాలం పడుతుందని ఆయనెవరో మాణిక్యం అట చెబుతున్నాడు… 2023 ఎన్నికలయ్యేదాకా ఆగండి, మొత్తం జీరో స్థాయికి పడిపోయాక మార్పులు చేయండి అని అప్పుడే నెటిజనం విసుర్లు… అఫ్కోర్స్, అవన్నీ పట్టించుకుంటే కాంగ్రెస్ ఎప్పుడో బాగుపడేది…
ఏతావాతా తేలేది ఏమిటంటే..? పాలకుడికి మంచి టీం అవసరం… పాలకుడినే ముంచేసేలా…. ఒక్కసారి ఊబిలోకి నెట్టేసి, నీ ఖర్మ అని వెక్కిరించే ఉన్నతాధికారులు ఉంటే కేసీయార్ ఈ చిక్కుముళ్లను విప్పుకోలేడా..? ఆ స్థితిలో లేడా..? తనకే అంతుపట్టని స్థితిలోకి కూరుకుపోయాడా..? తనకు నష్టం చేకూర్చే అధికారులను వదిలించుకుని, ప్రజలు మెచ్చే ప్రభుత్వంగా పేరు తెచ్చుకోలేడా..? మరీ కేసీయార్ ఈ దయనీయ స్థితిలో చిక్కుకుపోయాడా..? జాలేయడం కాదు, కేసీయార్ పరిస్థితి చూస్తే ఫాఫం అనిపిస్తోంది…!!
Share this Article