‘పొలిటికల్ కార్టూన్’ పరిమితులు చెప్పిన ‘పాప’! ఆధునిక చరిత్ర రచన 21వ శతాబ్దిలో ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు జవాబు కార్టూనిస్ట్ ‘పాప’ పై ఇప్పుడు పుస్తకం రావడం. ఈ వాక్యం చాలా అస్పష్టంగా ఉంది కదా? నిజమే, కొంచెం వివరిస్తాను. సమాచారం ‘టెక్నాలజీ’ రూపంలో మన జీవితాల్లోకి వచ్చేశాక, ఏదైనా ఒక అంశం లేదా వ్యక్తి చుట్టూ తిరుగుతూ… మనకు అందిన సమాచారం ‘డాట్’ అని కనుక మనం అనుకుంటే, అటువంటి వేర్వేరు ‘డాట్స్’ ను కలుపుకుంటూ వెళితే, మనకు దొరికేది సమాంతర లేదా ప్రత్యామ్నాయ చరిత్ర అవుతుంది.
ఇలా వేర్వేరు తోట పూలను ఒక మాలగా అల్లుకోడానికి మన వద్ద దారం వుంటే చాలు. అయితే మనం ఇలా చుక్కల్ని కలుపుకుంటూ, మన ‘చరిత్ర’ ఒక ముగ్గుగా మలుచుకోడానికి గాను, ముందుగా ఈ చుక్కలు పెట్టుకుంటూ వెళుతున్నది ఎవరు? ఆయా సంఘటనలతో నేరుగా భాగమైన వాళ్ళు. అవును- ‘సోషల్ మీడియా కెమెరా’ తమవైపు తిరిగినప్పుడు వాళ్ళు మనకు – ‘ఫస్ట్ హ్యాండ్’ సమాచారం ఇస్తున్నారు. కొత్తగా ప్రతిపాదిస్తున్న ఈ ఆధునిక చరిత్ర రచనా సంవిధానం ఎటువంటిదో, ‘పాప’ సంస్మరణ సందర్భంగా చూద్దాం.
‘డాట్’ – వొకటి
Ads
‘ఈనాడు’ తొలిరోజుల్లో ప్రచురణ క్రమంలో దాని బాలారిష్టాలను ‘డెస్క్’ స్థాయిలో గట్టెక్కించిన కొద్దిమందిలో ఒకరైన సీనియర్ పాత్రికేయుడు గిడుగు సూర్యనారాయణ మూర్తి ఇంటర్వ్యూ 2022లో ‘యూట్యూబ్’లో వచ్చింది. “ముఖ్యమంత్రి కావడం తన జీవిత లక్ష్యం అని, ఆయన గదిలో నేను, భాస్కర్ ఉన్నప్పుడు రామోజీరావు మాతో అన్నారు” అని చెప్పారు. “కొన్నాళ్ల తర్వాత నాకు పని చెప్పకుండా… నువ్వు వెళ్ళిపో అన్నట్టుగా ఆయన ప్రవర్తించడంతో, అక్కణ్ణించి బయటకొచ్చి ఓ ఏడాది తర్వాత, హైదరాబాద్ నుంచి మెడ్రాస్ వెళ్లి ‘ఇండియా టుడే’లో చేరాను” అని అయన చెప్పారు. భాస్కర్ ఎవరో గిడుగు చెప్పలేదు.
‘డాట్’ – రెండు
‘రూరల్ మీడియా’ శ్యామ్ మోహన్ ‘పాప’తో చేసిన ‘యూట్యూబ్’ ఇంటర్వ్యూలో ‘ఈనాడు’లో మీ చివరి కార్టూన్ ఏమిటి? అనే ప్రశ్నకు జవాబుగా… “బహుశా 1982 మొదట్లో దాన్ని వేశాను అనుకుంటాను. బురద మడుగులో కాంగ్రెస్ నాయకులు వాళ్ళల్లో వాళ్ళు కొట్లాడుకుంటూ వుంటారు. ఆ బురదలోకి ఎన్.టి.రామారావు దూకుతూ ఉంటాడు… ఇదీ నేను వేసిన బొమ్మ. దానికి – ‘రాజకీయాల్లోకి ఎన్టీఆర్’ క్యాప్షన్. అది వేసి నేను ‘డెస్క్’లో ఇచ్చాక, అలా బయటకు వెళుతుంటే, లిఫ్ట్ వద్ద రామోజీరావు కలిశారు. ‘ఈరోజు ఏమి వేశారు?’ ఆయన అడిగారు. నేను ఆయనకు చూపించాను. అప్పటికే అది జిల్లా ఎడిషన్లలో ప్రింట్ అవుతున్నది. మర్నాడు సిటీ ఎడిషన్ లో అది ప్రింట్ కాకుండా ఆపేశారు. విషయం నాకు అర్థమయింది. అలా నాలుగేళ్లు పైగా పనిచేసి ‘ఈనాడు’ నుంచి బయటకు వచ్చాను”.
‘డాట్’ – మూడు
అలా ‘ఈనాడు’లో ‘పాప’ ఖాళీ చేసిన కుర్చీలోకి వచ్చిన కార్టూనిస్ట్ ఆ తర్వాత నలభై ఏళ్లపాటు అక్కడ పనిచేశారు. నేపథ్యం… ‘ఈనాడు’ రామోజీరావు తనదైన రాజకీయ వ్యూహం లక్ష్యంగా ఎనభైల నాటికి కాంగ్రెస్ పార్టీని ‘కార్నర్’ చేస్తూ తనకు అవసరమైన ‘పొలిటికల్ సెట్టింగ్’ ఏర్పాటు 1976 నుంచే మొదలుపెట్టిన విషయం ‘పాప’ ఎపిసోడ్ వల్ల స్పష్టమవుతున్నది. అందుకు మనం ఓ రెండు కార్టూన్లు చూస్తే చాలు, మరీ ఎక్కువ వెతకనక్కరలేదు.
చిత్రం వొకటి
హిందీని దేశం మీద రుద్దే ప్రయత్నంలో ప్రధాని మురార్జీ దేశాయ్ (1977-79) సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం వుంది. ‘ఈనాడు’ దాన్ని ప్రజల్లో ఎండగట్టాలి. దీన్ని ‘పాప’ కార్టూన్ చేస్తూ క్లాస్ గదిలో బ్లాక్ బోర్డు మీద రాస్తున్న హిందీ మాష్టారు మురార్జీని, క్లాసు పిల్లలు చెన్నారెడ్డి (ఏ.పి.) ఎం.జి.ఆర్. (తమిళనాడు) దేవరాజ్ అర్స్ (కర్ణాటక) పుల్లలతో చేసిన కత్తులతో వెనక నుంచి ఆటపట్టిస్తుంటారు. అయితే వారితో కలిసినట్టుగా కనిపిస్తూనే, చెన్నారెడ్డి మాత్రం మిగతా ఇద్దరికీ భిన్నంగా, తన ‘కత్తి’ని తిరగేసి పట్టుకుని ఉంటాడు. మరో వేలితో- ‘ఐయాం నాట్ సీరియస్ ఇన్ ది మ్యాటర్’ అనే సంజ్ఞ పాఠకులకు ఇస్తుంటాడు! అంతే. అది ‘క్యాప్షన్’ లెస్ కార్టూన్. దాని క్రింద ‘భాషా సమస్యపై దక్షణాది ముఖ్యమంత్రులు సమావేశం అవుతారు’ అని దేవరాజ్ అర్స్ ప్రకటన న్యూస్ క్లిప్పింగ్. కాంగ్రెస్ పాలకుల భాషాభిమానం ఎటువంటిదో సున్నితంగా చెప్పిన కార్టూన్ అది.
చిత్రం రెండు
ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ (1980-84). ఇక్కడ శ్రీకాకుళంలో కొందరు ఎమ్మెల్యేలు వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారారు. అది జరిగాక, సి.ఎం. చెన్నారెడ్డి ప్రధానిని కలవడానికి ఢిల్లీ వెళుతున్నారు. అదీ అప్పటికి రాష్ట్రంలోని ‘పొలిటికల్ సెట్టింగ్.’ అంతే, ‘పాప’ బొమ్మలో చెన్నారెడ్డి ఇందిరా గాంధీ ముందు పాదాక్రాంతుడై వుంటాడు. ఆయన చేతిలోని పళ్లెంలో ‘కాంగీ’ టోపీలు పెట్టుకున్న ఆరు కోడిపిల్లలు. మెచ్చుకోలుగా చెన్నారెడ్డిని చూస్తూ… ఇందిర. ‘శ్రీకాకుళంలో కాంగ్రెస్-ఐ లో చేరికలు, కార్టూన్ లో ‘న్యూస్ క్లిప్పింగ్’. ‘ఢిల్లీకి చెన్నారెడ్డి’ వార్త. ఇది కూడా సంభాషణలు లేని కార్టూన్.
‘హిడెన్ ఎజెండా’
తొలినాళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ‘ఈనాడు’ పత్రిక పనిచేయడం తెలిసిందే. తన ‘పొలిటికల్ స్టాండ్’ పామరుడికి కూడా అర్థమయ్యేట్టుగా చెప్పడానికి గాను, ఆ పత్రికకు ‘పొలిటికల్ కార్టూనిస్ట్’ కావాలి. అలా కేంద్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న ‘పాప’ను ‘ఈనాడు’లో చేరే విధంగా ఒత్తిడి చేసి గెలిచిన రామోజీరావు.. కాంగ్రెస్ పార్టీని ‘కార్నర్’ చేయడానికి అవసరమైన ‘పొలిటికల్ సెట్టింగ్’ ఏర్పాటు 1976 నుంచే మొదలుపెట్టారు. సి.ఎం. అంజయ్య హయాంలో ‘పాప’ కార్టూన్లలో ఆ ప్రయత్నం పరాకాష్టకు చేరింది. సి.ఎం. ఆఫీస్ కు కొత్తగా హెలికాప్టర్ సౌకర్యం ఉండడానికి సంబంధించి (రామోజీరావు దృష్టిలో అది తప్పని) ఎక్కుపెట్టిన తొలి విమర్శనా భారాన్ని ‘పాప’ కార్టూన్ల వల్ల, అప్పట్లో అది అంజయ్య మోయాల్సి వచ్చింది.
అసందర్భం
అన్నీ ఒకదానికి ఒకటి పొంతన లేని విషయాలు అనిపించాయా?, నిజమే. సినిమా దృశ్యకావ్యం కావడానికి ‘ఆర్టు డైరక్టర్’ పని చాలా కీలకం. అలా ఖాళీలను పూరించే పని ‘యూట్యూబ్’ ఛానళ్లలోనే నాదెళ్ల భాస్కరరావు తన ఇంటర్వ్యూల ద్వారా పూర్తిచేశారు. ఇప్పుడు ఈ ‘డాట్స్’ అన్నీ కలిపితే, ఈ మొత్తం వ్యవహారంలో ‘పాప’ ఎలా ‘టూల్’ అయ్యారో స్పష్టం అవుతుంది. తెచ్చిన పని మధ్యలో వుండగానే కేవలం నాలుగేళ్లు మాత్రమే ‘ఈనాడు’లో పనిచేసి ‘పాప’ బయటకు వచ్చారు. ఆ తర్వాత మా వద్ద పనిచేయమని వచ్చిన ఏ ఆంగ్ల పత్రిక ‘ఆఫర్’నూ ఆయన అంగీకరించకుండా, ‘పొలిటికల్ కార్టూనిస్ట్’ ఎలా పనిచేయకూడదో ఒక అరుదైన నమూనాను తెలుగు పొలిటికల్ కార్టూన్ చరిత్రలో శాశ్వతంగా మిగిల్చి వెళ్లారు శ్రీ కొయ్య వెంకటరెడ్డి అనబడే- ‘పాప’…… – జాన్సన్ చోరగుడి (సామాజిక విశ్లేషకులు, కాలమిస్టు) (ఇది Taadi Prakash వాల్ నుంచి తీసుకోబడింది… జాన్సన్‌కు ధన్యవాదాలతో…)
Share this Article