నిజానికి ఇది వేడి వేడి వార్తేమీ కాదు… చాలాసేపటి నుంచీ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్న వార్తే… ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్ తన కొలువుకు రాజీనామా చేశాడు… ఇదీ వార్త… వాళ్లో వీళ్లో చెప్పడం దేనికి..? తనే తన ఫేస్ బుక్ వాల్ మీద షేర్ చేసుకున్నాడు… సో, సందేహాలు అక్కర్లేదు… అయితే కొత్తగా ఆయన రాజీనామా మీద ఏం రాయగలం..? పొమ్మనబడ్డాడా..? తనే పోయాడా..? ఇదీ ఒక ప్రశ్న… ఈనాడు నుంచి వెళ్లిపోయేవాళ్లు కొందరు మాత్రమే ఉంటారు… నలభై ఏళ్లుగా తన జీవితాన్ని ఈనాడుకే అంకితం చేసిన శ్రీధర్ తనంతట తనే ఎందుకు వెళ్లిపోతాడు..? ఏదో కారణం ఉంటుంది..? ఉండదు అనుకోవడం ఓ అమాయకత్వం… అది ఏమిటి అనేది మాత్రం ఎప్పటికీ ఓ మిస్టరీ… అంతే… ఈనాడు వంటి సంస్థలో నలభై ఏళ్లు ఓ పొలిటికల్ కార్టూనిస్టుగా ఉజ్వల ప్రభను అనుభవించిన శ్రీధర్‌కు ఎందుకు ఈనాడు పొగబెట్టింది, లేదా పొమ్మంది, లేదా గేటు చూపించింది..? ఇదీ సంగతి అని చెప్పేవాళ్లు ఎవరు..? ఈనాడులో ఒకరిద్దరు పెద్దలకే తెలుసు… అదిక బయటికి రాదు… అయితే..? 23 నాడే రిజైన్ చేశాడు, అది ఈరోజు యాక్సెప్ట్ చేశారు…!
ఎందుకు పోయాడు, లేదా ఎందుకు వెళ్లగొట్టబడ్డాడు అనే ప్రశ్నల్ని వదిలేస్తే… అసలే అనేకానేక అవలక్షణాలతో కుంటుతున్న ఈనాడుకు శ్రీధర్ కూడా వెళ్లిపోవడంతో నష్టమెంత అనేది కూడా వదిలేస్తే… అసలేం జరిగింది..? 1) తన ఆరోగ్యం కొద్దిరోజులుగా బాగాలేదు, already service extention పై ఉన్నాడు, ఇంటి నుంచే వర్క్ చేస్తున్నాడు, ఇక చేయలేక మానేశాడు అనేది ఈనాడు క్యాంపు ప్రచారంలోకి పెట్టిన ఓ కారణం… బహుశా నిజం కాకపోవచ్చు… స్టిల్, ఈరోజుకూ తను యాక్టివ్‌గా ఉన్నాడు… 2) ఈమధ్య ఫేస్బుక్లో ఓ రచ్చ నడుస్తోంది… ఆ రొచ్చులోకి మనం ఇక్కడ పోవడం లేదు కానీ, ఈనాడు తన ఉద్యోగులు సోషల్ మీడియాలో యాక్టివ్ సంవాదాల్లో ఉండటాన్ని ఇష్టపడదు… పైగా ఈనాడు సూపర్ అసెట్ శ్రీధర్ రకరకాలుగా చిత్రితం కావడం ఈనాడుకు ఇష్టం లేదు… అది తనను బలిగొన్నది… ఏమో, కొంత కారణం కావచ్చు, ఎట్ లీస్ట్, పెద్దాయనను కన్విన్స్ చేయడానికి ఈ కారణం ఉపయోగపడి ఉండవచ్చు… 3) రామోజీరావు అదుపు లేదు ఇప్పుడు ఈనాడు మీద… ఆయన నమ్మకస్తులైన వాళ్లు పొగ ఎదుర్కుంటున్నారు… ఇప్పుడు శ్రీధర్ వంతు, తను అనుభవిస్తున్న ఓరకం సుప్రిమసీని ఇష్టపడని పెద్దలు ఆయన మీద వేటు వేయించారు… ఏమో, నిజమే కావచ్చు కూడా… 4) ఇక నేను ఈ వర్క్ చేయలేను అని శ్రీధరే స్వచ్చందంగా కొలువు వదిలేశాడు అనేది మరో కారణం… ఈనాడు కోసం జీవితాన్నే అంకితం చేసినవాడు ఇలా తనంతట తనే వదిలేస్తాడా..? బహుశా ఇదీ కారణం కాకపోవచ్చు… 5) ఈమధ్య ఇండివిడ్యుయల్ ఎక్స్పోజర్ కోసం తాపత్రయపడుతున్నాడు, అది ఈనాడుకు ఇష్టం ఉండదనేది మరో కారణం…. ఇదీ పెద్ద కారణం కాకపోవచ్చు… కానీ ఇన్నేళ్ల కెరీర్ ఈనాడులో ఓ రికార్డు… ఓ లక్ష కార్టూన్లు, బొమ్మలు గీసి ఉంటాడేమో… వావ్… నువ్వు గ్రేట్ మాస్టారూ..,.
Ads
సరే, కొలువు వదిలేయడానికి కారణాల్ని వదిలేద్దాం… శ్రీధర్ నిష్క్రమణ ఖచ్చితంగా ఈనాడుకు నష్టమే… ఎందుకంటే..? శ్రీధర్ తెలుగు పొలిటికల్ కార్టూన్‌కు ఓ ఐకన్… మాటల్లో సుదీర్ఘంగా విశ్లేషించలేం, వివరించలేం… ఒక్క ముక్కలో చెప్పాలంటే… శ్రీధర్ అంటే శ్రీధరే… అంతే… మనకు తన కార్టూన్ల మీద ఎన్ని భేదాభిప్రాయాలైనా ఉండవచ్చుగాక… కానీ తెలుగు పాత్రికేయం మీద తన ముద్రను తేలికగా కొట్టిపారేయలేం… అసలు తనకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటారు ఇతర కార్టూనిస్టులు… ప్రఖ్యాత కార్టూనిస్ట్ మోహన్ ఆమధ్య ఓ వ్యాసంలో చెప్పిన వివరాలు కొన్ని చూద్దాం…
- 50వ దశకంలో ఆంధ్రపత్రికలో ‘ఉమెన్’ అనే కేరళ కార్టూ నిస్టు రాజకీయ కార్టూన్లు వేసేవారు. కేరళ నుండి పోస్టు బాక్సులో వేయగా, ఆ తోకలేని పిట్ట తాపీగా తొంభై ఊళ్లు తిరిగి పేపర్ ఆఫీస్‌కి చేరి ప్రింటయి ఊళ్లోని పాఠకులకు చేరేసరికి వారం, పదిరోజులు దాటేది. ఆరోజుకి తెలుగులో రాజకీయ కార్టూనిస్టు ఇంకా పుట్టలేదు.
- ఈ కార్టూన్ల ప్రపంచంలోకి 1955 తుపానొచ్చింది. తెలుగునాడంతా ఎర్రబారింది. కమ్యూనిస్టులు అధికారంలోకొచ్చే ప్రమాదం అటు కమ్యూనిస్టు వ్యతిరేకులకూ ఇటు కమ్యూనిస్టు లకూ కూడా స్పష్టంగా కనిపించింది. వాసు అనే కార్టూనిస్టుతో నార్ల వెంకటేశ్వరరావుగారు ప్రతిరోజూ ‘ఆంధ్రప్రభ’లో కార్టూన్లు వేయించేవారు. వాటికి సమాధానంగా మర్నాడు ‘విశాలాంధ్ర’లో రాంభట్ల కృష్ణమూర్తిగారు కార్టూన్ గీసేవారు.
- అరవయ్యో దశకంలో ‘విశాలాంధ్ర’ వారు ‘శంకర్స్ వీక్లీ’తో ఒప్పందంతో తెలుగులో ఆ కార్టూన్లు రోజూ వేసేవారు. అది గొప్ప వెరైటీ. 1962లో ‘ఆంధ్రజ్యోతి’ వచ్చింది. అందులో ఇ. వెంకట రమణ (ఇ.వి.ఆర్.)తో నార్ల వెంకటేశ్వరరావుగారు కార్టూన్లు వేయించేవారు. అదే సంవత్సరం ‘విశాలాంధ్ర’లో టి. వెంకట్రావు (టీవీ)గారు చేరారు.
(శ్రీధర్ తొలి కార్టూన్)…
- 1974లో ‘ఆంధ్ర’ అనే టాగ్ ముందూ వెనకా లేని ‘నాడు’ వచ్చింది. మొదట విశాఖలో చిన్నగా మొదలైనపుడు ‘బాలి’ (ఎం. శంకర్రావు) కార్టూన్లు వేశారు. తర్వాత ఈనాడు హైదరాబాద్, విశాఖ, తిరుపతికి శాఖోపశాఖలై విస్తరించింది. ముఖ్యమంత్రి అంజయ్య మీద ‘పాపా’ కార్టూన్లు పేలేవి. తర్వాత ‘శ్రీధర్’ అనే యువ కార్టూనిస్టు వచ్చి చేరి, ఈనాటికీ వేస్తున్నాడు. (రేపటి నుంచి ఆ గీతలు కనిపించవు) (పాపా అంటే కొయ్య శివరామిరెడ్డి, 1975లో ఈనాడులో చేరాడు, శ్రీధర్‌ను 1981 నుంచి ఎంకరేజ్ చేసే తీరుతో బయటికి వచ్చేశాడు…)
- 1981 నాటికి ప్రభకి కొత్తగా ఎ.వి.కె. ప్రసాద్ ఎడిటర్ అయారు. మోహన్ అనే నన్ను కార్టూనిస్టుగా తీసుకున్నారు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఎడిటర్ జి.ఎస్. భార్గవ గారు కూడా ముచ్చటపడినందున ఎక్స్‌ప్రెస్‌లో పాకెట్ కార్టూన్ కూడా వేసేవాణ్ణి. రెండు మూడేళ్లయ్యాక దాసరి నారాయణ రావుగారి పత్రిక ‘ఉదయం’ వచ్చింది. ఎబికె ఎడిటర్. నేను (మోహన్) కార్టూనిస్టుని.
సో, శ్రీధర్ కార్టూన్‌కి ఓ చరిత్ర ఉంది… తెలుగు పాత్రికేయ చరిత్రలో ఓ పేజీ ఉంది… తన గీతకు ఓ ప్రాశస్త్యం ఉంది… కాకపోతే ఈనాడు భావజాలంలో ఇరుక్కున్న ఆ గీత మీద చాలామందికి అయిష్టత… అది శ్రీధర్ మీద వ్యక్తిగత ఆగ్రహం కాదు… అది ఈనాడు పోకడ మీద… మరి ఇప్పుడు ఏమిటి..? ఏముంది..? కళతప్పిన ఈనాడుకు మరింత నష్టం… వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం అని ఈనాడు ఎన్ని పొంఖణాల కబుర్లు చెప్పవచ్చుగాక… శ్రీధర్ వెలితిని, ఆ నష్టాన్ని పూడ్చలేదు… అది ఖాయం… పోతేపోనీ, ఎవరు శాశ్వతం అంటారా..? అంతేలెండి… ఈనాడు కాకపోతే మరొకటి…!!!
Share this Article