ఒక సినిమా… దానికి ఓ హీరోయిన్… అనగా లీడ్ రోల్… ఓ పాపులర్ నటిని మాట్లాడుకున్నారు… కథ నచ్చింది… నటించింది… ఆ నటనకు గాను డబ్బు తీసుకుంది… అయిపోయింది… అది చీదేసినా తనకు నష్టం లేదు… హిట్టయితే అదనంగా ఏమీ డబ్బివ్వరు… కానీ ఆ సినిమా కథకు, లాభనష్టాలకు, చిక్కులకు, హక్కులకు అన్నింటికీ సోల్ ప్రొప్రయిటర్ ఆ సినిమా నిర్మాత… కొన్ని అంశాల్లో దర్శకుడు… అంతే కదా… మరి ఆ సినిమాకు సంబంధించి ఏమైనా వివాదం తలెత్తితే… ఆ హీరోయిన్‌పై కేసు వేస్తే..? ఆమెను కోర్టుకు లాగితే..? దాన్నేమనాలి..? అసలు అవన్నీ ముందే చూసుకుని మరీ హీరోయిన్ ఆ పాత్ర అంగీకరించాలా..? తనే బాధ్యురాలా..?
ఇదే ఇప్పుడు సమస్య… స్టార్ హీరోలు, హీరోయిన్ల సినిమాలకు ఇవే చిక్కులు… ఎవరో నాదీ ఈ కథ అంటారు, ఇంకెవరో నా స్క్రిప్టు కాపీ కొట్టారు అంటారు… ఏకంగా హీరో, హీరోయిన్లపై కేసులు పెడతారు… దానివల్ల ‘‘పంచ్’’ బలంగా పడుతుంది అనే భావనా..? వాళ్లను లాగితే తప్ప… నిర్మాత, దర్శకులు దిగిరారు… ఎంతోకొంతకు రాజీకి రాకపోరు అనే ఆశా..?
Ads
ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తాజా చిక్కు ఇదే… నో డౌట్… మంచి నటి… కొన్ని విభిన్నమైన పాత్రలు కావాలని ప్రయత్నిస్తూ ఉంటుంది… కష్టపడుతుంది కూడా… ఆమె అప్పట్లో సంతకం చేసిన సినిమా గంగూభాయ్ కథవాడి… అసలు ఏమిటీ పాత్ర..?
అప్పట్లో… అంటే చాలా ఏళ్ల క్రితం… గంగూభాయ్ బలవంతంగా వ్యభిచారంలోకి దింపబడిన మహిళ… ముంబైలో కొన్ని వేల మంది వ్యభిచారులు… మగ అవసరాలు అలాంటివి మరి… కష్టాలు పడీ పడీ మెల్లిమెల్లిగా ఆమే ఓ గ్యాంగు తయారు చేసుకుంటుంది… సప్లయ్స్ సొంతంగా చేయడం మొదలు పెడుతుంది… పెరిగీ పెరిగీ గ్యాంగ్‌స్టర్‌గా మారుతుంది… ముంబైలో బాగా పాపులర్, పవర్ఫుల్ లేడీ గ్యాంగ్స్టర్స్ పేర్లు తీస్తే, ఈమే టాప్…
‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ అంటూ హుస్సేన్ జైది ఓ పుస్తకం రాశాడు… అందులో ఇలాంటి లేడీ గ్యాంగ్స్టర్ల కథలన్నీ పొందుపరిచాడు… అందులోని గంగూభాయ్ కథను తీసుకుని, సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమా తీస్తున్నాడు… అప్పట్లో, అంటే జనవరిలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు… జూన్‌లో ఓ కాన్సెప్ట్ టీజర్ కూడా విడుదలైంది… తరువాత కరోనా వచ్చేసింది…
ఇప్పుడు మళ్లీ అన్నీ సినిమాల షూటింగులు మొదలవుతున్నయ్ కదా… ఇదీ స్టార్టయింది… ఈలోపు గంగూభాయ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ సినిమా మీద ఓ సివిల్ కేసు దాఖలు చేశారు… అసలు ఆ కథే తప్పు, మా ఇజ్జత్ పోతది అంటారు వాళ్లు… నిర్మాత, దర్శకుడితోపాటు ఆ కథ అందించిన రచయితనూ లాగారు… సరే, వాళ్లంతా బాధ్యులే అనుకుందాం… ఆలియా భట్‌ను కూడా లాగారు…
రాంగోపాలవర్మలాగా పేర్లు మార్చేసి, అబ్బే, ఇది కేవలం కల్పితం అనడానికి లేదిక్కడ… గంగూభాయ్ కథే అని ప్రకటించారు… సినిమా పేరు కూడా అదే… పాత్రలూ అవే.,. కాకపోతే ‘కొన్ని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో’ అని టీజర్లో చెప్పుకున్నారు… కానీ తప్పించుకోలేరు కదా… ఇరుక్కుపోయారు… అసలే సివిల్ కేసు… ఎప్పుడు తేలాలో… హేమిటో… ఆలియా… అసలు భన్సాలీ సినిమా అంటేనే ఏదో ఓ వివాదం… సరే, ఇది తెమిలేలోపు ఇంకో సినిమా లాగించెయ్ ఆలియా…!!
Share this Article