తమన్నాపై రిలయెన్స్ అంబానీ కేసు… ఈ హెడింగ్ వినగానే అందరి దృష్టీ పడుతుంది కదా… పైగా తమన్నా మాత్రమే కాదు, సంజయ్ దత్, జాక్వెలిన్, బాద్‌షా ఎట్సెట్రా 20 మంది ఇన్‌ఫ్లుయన్సర్స్ ఉన్నారట… వాళ్లందరి పేర్లూ బయటపడాల్సి ఉంది…
ఒకరిద్దరు తారలు ఐపీఎల్ జట్లనే మెయింటెయిన్ చేస్తుంటే… ఫాఫం ఈమె మరీ ఏదో యాప్‌కు ప్రచారం చేసి చిల్లర కేసులో ఇరుక్కుందేమిటి అంటారా..? నిజమే… కానీ సెలబ్రిటీలు ఏది పడితే అది ప్రచారం చేయకూడదు, కేసులపాలవుతారు అని చెప్పుకోవడానికి ఇది మరో తాజా ఉదాహరణ…
పైకి చెబుతున్నది మాత్రం తమన్నాను ఓ సాక్షిగానే విచారణకు పిలుస్తున్నారు అని… కానీ అది మాత్రమే కాదు, ముఖేష్ అంబానీ సంస్థ వయాకామ్‌కు భారీ నష్టం కలగజేసిన ఐపీఎల్ అనధికారిక స్ట్రీమింగ్ యాప్‌కూ తమన్నాకు లింకులేమిటో తేల్చడానికి కూడా…!
Ads
అసలు కేసు ఏమిటంటే..? ఫెయిర్ ప్లే అని ఓ యాప్ ఉంది… అది ప్రధానంగా బెట్టింగ్ యాప్… మరి క్రికెట్ అంటేనే బెట్టింగ్ దందా కదా… వాళ్లే సొంతంగా ఐపీఎల్ మ్యాచుల్ని ప్రసారం చేయడం మొదలుపెట్టారు… బాల్ బాల్‌కూ బెట్టింగులు జరిగే రోజులు కదా, ఎవరి మీదో ఆధారపడటం దేనికి..? మన సొంత యాప్‌లోనే ప్రసారం చేస్తుంటే బెట్టింగ్ వీరులకూ కన్వీనియెంట్ అనుకున్నారేమో…
ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కుల్ని అంబానీ కంపెనీ చాన్నాళ్లయింది తీసుకుని… భారీ మొత్తానికి పాడుకుని మరీ తీసుకుంది… ఇప్పుడు ఈ ఫెయిర్ ప్లే ‘అన్ ఫెయిర్’ ప్రసారం వల్ల మాకు 100 కోట్ల నష్టం వచ్చిందని వయాకామ్ అంటోంది… ఇక్కడ సమస్య ఎంత నష్టమని కాదు… ఈ దందాలో సెలబ్రిటీల పాత్ర ఏమిటనేది..?
ఈ ఫెయిర్ ప్లే యాప్ మహాదేవ్ ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌కు సబ్సిడరీ… క్రికెట్ మాత్రమే కాదు, పలు ఆటలకు సంబంధించిన బెట్టింగ్ నిర్వహిస్తూ ఉంటుంది… గత వారంలోనే సంజయ్ దత్‌ను విచారణకు పిలిచింది మహారాష్ట్ర సైబర్ సెల్… నాకు టైట్ షెడ్యూల్ ఉంది, పైగా ఆ తేదీల్లో ఇండియాలో ఉండను, తరువాత వస్తాను లెండి, ఇంకో తేదీ చెప్పండి అన్నాట్ట…
బయటికి మీడియాకు చెబుతున్నది మాత్రం, తమన్నా తదితరులు ఈ యాప్‌కు ప్రచారం చేశారు, ఒక బెట్టింగ్ యాప్, అదీ ఐపీఎల్‌ను (2023) అనధికారికంగా ప్రసారం చేసే యాప్‌కు ఇంతమంది పెద్ద పెద్ద తారలు ఎలా, ఎందుకు ప్రచారం చేశారు అనేదే కేసు అని…
ఈ కేసు కూడా పాతదే… 2023 సెప్టెంబరులోనే ఎఫ్ఐఆర్ నమోదైంది… వయాకామ్18 ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉల్లంఘన పేరిట కేసు పెట్టింది… డిసెంబరులోనే ఈ విచారణలు జరగాల్సింది… ఎందుకో ఆలస్యమైంది… సదరు యాప్‌కు ఎంప్లాయీ ఒకరిని ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేశారు… కథ ఇంకా చాలా ఉంది… సినీ సెలబ్రిటీలున్నందున మీడియా అటెన్షన్ పడింది దీనిపై..!!
Share this Article