నిజానికి ఇందులో విక్కీ, కత్రినాల తప్పేమీ లేదు… మస్తు డబ్బుంది, కీర్తి ఉంది, సాధన సంపత్తి ఉంది, చిటికేస్తే చాలు సకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి… అదేదో సినిమాలో శ్రీదేవితో వెంకటేష్ అంటాడు కదా… కో అంటే కోతి, దొర్లుకుంటూ వస్తుంది కొండమీది కోతి… వాళ్లిద్దరూ కో అన్నారు… ఇంకేముంది..? వాళ్ల పెళ్లికి వేదికగా మారిన సిక్స్ సెన్సెస్ బర్వారా ఫోర్ట్ హోటల్ ఓవరాక్షన్‌కు దిగింది… ఇక ప్రపంచంలో ఎవరికీ పెళ్లే కానట్టు, ఇంతకుమించిన ఘనమైన పెళ్లి నభూతోనభవిష్యతి అన్న తరహాలో వ్యవహరించడం మొదలుపెట్టింది… చివరకు దేవుడినీ పట్టించుకోలేదు… దేవుడి మార్గాన్ని కూడా బ్లాక్ చేసిపారేసింది… రోజులతరబడీ పురుగు కూడా ఆ రోడ్డులోకి రావొద్దని ఆంక్షలు పెట్టేసింది… మరి డబ్బుంటే అధికారులు కూడా దాసోహమే కదా… ఎవడూ పట్టించుకోలేదు… దాంతో చిర్రెత్తిన ఓ లాయర్ కేసు వేశాడు… ఈ హోటల్ తాటతీయాలి సార్ అంటున్నాడు…
వివరాల్లోకి వెళ్దాం… వీళ్ల పెళ్లి హిందూ పద్ధతిలో సవాయ్ మధోపూర్‌లో జరుగుతోంది… వేదిక హోటల్ సిక్స్ సెన్సెస్ బర్వారా ఫోర్ట్… నిన్న సంగీత్ అయిపోయింది, ఈరోజు మెహందీ… ఈ ప్రి-వెడ్డింగ్ సహా మొత్తం పెళ్లి తంతులన్నీ పూర్తయ్యేదాకా ఆ రోడ్డులో అన్యులెవరికీ ప్రవేశం లేదని ఆంక్షలు పెట్టింది ఆ హోటల్… దాంతో అక్కడికి సమీపంలో ఉన్న ఛవుత్ మాత గుడికి కూడా రోడ్డు బ్లాక్ అయిపోయింది… భక్తులకు ఇబ్బందులు… అక్కడ రోజూ ఆరతి ఇస్తుంటారు… రోజూ దర్శించుకునే భక్తులున్నారు… మొత్తం డిస్టర్బయింది… ఆ హోటల్ వాడి ఓవరాక్షన్ పాడుగాను… 6 నుంచి 12 వరకు ఆంక్షలేనట…
Ads
ఈ వ్యవహారం అంతా చూసి చిర్రెత్తిన నేత్రబింద్ సింగ్ జడౌన్ అనే లాయర్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఫిర్యాదు చేశాడు… ఇంకా వారిలో కదలిక లేదు… అసలే సెలబ్రిటీ పెళ్లి, స్టార్ హోటల్‌తో యవ్వారం, చాలామంది పెద్దల బ్యాకింగ్ ఉంటుందని సందేహిస్తున్నారేమో… కానీ సదరు లాయర్ ఫిర్యాదులో న్యాయం ఉంది… పెళ్లి ఖర్చు 100 కోట్లని అంచనా వేస్తున్నారు… మరి ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడం కూడా ప్రధానమే కదా… ఐనా హోటల్‌లోకి ఎంట్రీ బంద్ పెడితే వోకే… ఆ హోటల్ మొత్తాన్ని వారం రోజులు వాడుకుంటే వోకే… కానీ రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేయడం ఏమిటి..? వస్తారు, పెళ్లికి పెద్ద తలకాయలు, బాలీవుడ్ ప్రముఖులు వస్తారు, సో వాట్..? జస్ట్, 120 మంది అతిథుల కోసం ఇంత హంగామా ఏమిటి..? ఆ 120 మందికీ రూల్స్ పెట్టారట… అందరూ వేక్సిన్ తీసుకుని ఉండాలి, లేదా ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిజల్ట్ ప్రూఫ్ ఉండాలి… సెక్యూరిటీ ప్లాన్స్ వేరే ఉన్నాయట… గెస్టులకు కూడా కోడ్ నేమ్స్ ఇస్తారట, అక్కడ ఉన్నంతసేపూ ఫోన్లు వాడొద్దు, ఫోటోలు తీయొద్దు, సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు, బయట ఎవరితోనూ మాట్లాడొద్దు, ఆ ఫోటోలు, వీడియోలను కూడా వెడ్డింగ్ ప్లానర్సే తరువాత ఎప్పుడో రిలీజ్ చేస్తారుట… ఏదో సైటుకు అమ్మేస్తారేమో లెండి… కానీ ఇంత ‘‘అతి’’ అవసరమా..? మరి ఈ 120 మంది గెస్టులను ఎంచక్కా ఓ ప్రత్యేక విమానంలో ఏ డెస్టినేషన్ మ్యారేజీ సైటుకో తీసుకెళ్లి, ఇష్టారాజ్యంగా పెళ్లి చేసుకోవచ్చు కదా..!! ఏ డిస్ట్రబెన్సూ ఉండదు, ఎవరికీ ఇబ్బంది కూడా ఉండదు..!!
Share this Article