మేం సినిమాల మీద ఏమైనా రాస్తాం, టార్గెట్ చేస్తాం… మాట్లాడితే రివ్యూలు అంటాం… కులం, ప్రాంతం, పార్టీ, మతం, భాష, యాస పేరిట హీరోలను, దర్శకులను ద్వేషిస్తాం, ప్రేమిస్తాం, ఆ రాగద్వేషాలన్నీ మా రాతల్లో చూపిస్తాం అంటే ఇకపై కుదరకపోవచ్చు… రివ్యూయర్లు ఏమీ చట్టాలకు అతీతులు కాదు… ఆమధ్య ఎవరో తెలుగు స్టార్ హీరో తమ కుటుంబంపై పిచ్చి రాతలు రాస్తే కేసులు పెడతాను అంటూ లీగల్ నోటీసులు కూడా పంపించాడు గుర్తుంది కదా… ఈ వార్త చదవండి…
కేరళ, ఎర్నాకుళం పోలీసులు ఏడుగురు మేజర్ మూవీ రివ్యూయర్ల మీద, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ మీద కేసులు (under section 385 (extortion) and section 120 (o) of the Kerala Police Act) పెట్టేశారు… అదీ సదరు ఫిలిమ్ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు…! తెలుగు యూట్యూబ్ చానెళ్లు, సైట్లకు… కాదు, మొత్తం మీడియాకు ఇది తప్పకుండా చదవబుల్ కేసు… కేసులు పెట్టబడినవారిలో (ది హిందూ వార్త మేరకు…) స్నేక్ ప్లాంట్ అనే సినిమా ప్రమోషన్ కంపెనీ ఓనర్ హెయిన్స్.., అనూప్‌అను6165 పేరుతో ఫేస్‌బుక్ ఖాతా ఉన్న ఓనర్.., యూట్యూబర్లు అరుణ్ తరంగ, అశ్వంత్ కోక్.., అలాగే ఎన్వీ ఫోకస్, ట్రెండ్ సెక్టార్ 24*7 యూట్యూబ్ చానెళ్లు.., సోల్‌మేట్స్55 అనే ట్రావెలింగ్ సోల్‌మేట్స్.., ఇవేకాదు, ఇతర ఫేస్‌బుక్, యూట్యూబ్ ఆపరేటర్లను బుక్ చేశారు… ఇతర ఆపరేటర్లు అంటే ఈ కేసులో ఇంకా ఎవరినైనా యాడ్ చేసే అవకాశం ఉందన్నమాట…
సరే, ఆ వ్యక్తులు, ఆ సోషల్ మీడియా ఆపరేటర్లు, ఆ చానెళ్లు మన తెలుగు ప్రేక్షకులకు, పాఠకులకు తెలియకపోవచ్చు… కానీ పుట్టగొడుగుల్లాంటి ఎన్నో చానెళ్లు, అందులో యూట్యూబ్ చానెళ్లు, సినిమా సైట్ల మీద ఇండస్ట్రీలో చాలామంది కోపం ఉంది… కానీ ఏమీ అనలేరు… వాళ్లకు ఈ కేరళ పోలీసులు పెట్టిన కేసు వార్త ఆనందాన్ని కలిగించవచ్చు కూడా…!
Ads
సినిమా పేరు చెప్పలేదు కదూ… రాహెల్ మకాన్ కోరా… మలయాళం మూవీ… దర్శకుడి పేరు ఉబైని… గతంలో కేరళ హైకోర్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు, కేంద్ర సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది… ఏమని అంటే… ఆన్ లైన్ ఫిలిమ్ క్రిటిక్స్, వ్లాగర్లకు సంబంధించి స్పష్టమైన, పారదర్శకమైన నియమనిబంధనల్ని ఫ్రేమ్ చేయాలని… తరవాత ఏమైందో తెలియదు…
మూవీ టార్గెటెడ్…
ఎఫ్ఐఆర్ ప్రకారం… ఈ కేసులో నిందితులు కావాలని ఈ సినిమాను టార్గెట్ చేశారు… ఇది అక్టోబరు 13న రిలీజైంది… ఉద్దేశపూర్వకంగా దర్శకుడికి చెడ్డపేరు రావడం కోసం నెగెటివ్ రివ్యూలతో విరుచుకుపడ్డారు… ఫేస్‌బుక్, యూట్యూబ్ వేదికలుగా దుస్సహమైన పదాలు వాడుతూ మరీ నెగెటివ్ రివ్యూలు రాశారు… దర్శకుడిని, సినిమాను టార్గెట్ చేశారు…
అరొమాలింటే అద్వాతే ప్రణయం దర్శకుడు ముబీన్ రవూఫ్ ఆమధ్య హైకోర్టుకు వెళ్లాడు… తన సినిమా విడుదలయ్యాక కనీసం వారం రోజులపాటు ఎలాంటి రివ్యూలు పబ్లిష్ చేయకుండా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై, వ్లాగార్లపై ఆంక్షలు విధించాలని కోరాడు… దీనిపై కేరళ హైకోర్టు జస్టిస్ దేవన్ రామచంద్రన్ ‘‘తెలియని వ్యక్తులు దురుద్దేశాలతో గనుక రివ్యూలు రాస్తే, బ్లాక్ మెయిల్, వసూళ్లను సంకల్పిస్తే ఐటీయాక్ట్ కింద చర్యలు తీసుకోవచ్చునని బుధవారం అన్నారు…
కోర్టు నియమించిన అమికస్ క్యూరీ శ్యామ్ పద్మన్ ఓ రిపోర్ట్ కూడా ఇచ్చాడు కోర్టుకు… ‘‘మేం సినిమాల్ని లేపగలం, పడుకోబెట్టగలం అనే భావనలతో, దురుద్దేశాలతో రివ్యూలు రాస్తున్నట్టు బోలెడు ఆధారాలున్నాయనీ, వీటిని రివ్యూ బాంబులు అనవచ్చుననీ అభిప్రాయపడ్డాడు ఆయన…
Share this Article