తెలంగాణ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి… ఆమె కాపు కాబట్టి, ఇప్పుడు ఏపీలో కేసీయార్ పార్టీకి కాపు వోట్లు కావాలి కాబట్టి, తెలంగాణలో మీ కాపు మహిళకు మంచి పోస్టు ఇచ్చాను, మీ వోట్లన్నీ నాకే అని కేసీయార్ చెప్పుకోవాలి కాబట్టి… ఆమెకు ఆ పదవి దక్కిందట..! ఎక్కడ మనల్ని నిరాశ చుట్టుముట్టేస్తుందీ అంటే… చిల్లర చిల్లర నామినేటెడ్ పదవుల లెక్కల్లోకి చివరకు చీఫ్ సెక్రెటరీ పదవిని కూడా చేర్చారా..? ఆమె చదువు, ఆమె అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్, ఆమె సీనియారిటీ, ఆమె అర్హత… ఇవేమీ అక్కర్లేదా..? ఆమె సాధించుకున్న పదవిని కూడా చివరకు క్షుద్రమైన పొలిటికల్ లెక్కల్లోకి చేర్చారా..?
డీజీపీ ఏం కులం..? సీఎస్ ఏం కులం..? మనకేం లాభం..? అని పొలిటికల్ ఫాయిదా ఈక్వేషన్స్ చూసే వరకూ దిగజారిపోయిందా సిస్టం..? కాపులకు మంచి పదవి ఇవ్వాలి కాబట్టి, గతంలో తామే సీఎంవో నుంచి తరిమేసిన ఆమెను తీసుకొచ్చి, ఆ కుర్చీలో కూర్చోబెట్టారా..? ఈ నియామకం వెనుక నిజంగానే ఏవో లెక్కలున్నాయి కాబట్టే, ఆమె సీఎస్ కాగానే వెంటనే కాపు నేతలు వచ్చి సీఎంకు థాంక్స్ చెబుతున్నారా..? ఏపీబీఆర్ఎస్ కాపు నేతలు అందుకే సీఎంను కలిశారా..? ఇప్పుడు వీళ్లు వెళ్లి ఏపీలో కాపు జనానికి ‘మంచోడు కేసీయార్, మన మహిళలకు మస్తు ప్రాధాన్యం ఇచ్చాడు’ అని చెప్పుకోవాలా..? తెలంగాణలో కూడా బీసీల్లో అధిక జనాభా ఉండే కులం కాబట్టి ఇక్కడ కూడా ఈ పొలిటికల్ ఫాయిదా కోసం కెసిఆర్ ట్రై చేస్తున్నాడా..?
Ads
మరిమొన్నమొన్నటిదాకా సీఎస్‌గా తెలంగాణను మస్తు ఉద్దరించిన ధరణి సోమేష్‌కుమార్ ఏ లెక్కల్లోకి వస్తాడు..? మన ఊరు కాదు, మన పేరు కాదు… ఎక్కడో బీహార్… తన కులం ఏమిటో కూడా ఎవరికీ తెలియదు… నిజానికి ఉన్నత స్థానాల్లో ఉండే అధికార్ల కులాల పేర్లు వాళ్ల ఇంటర్నల్ సర్కిళ్లలో తప్ప ఎప్పుడూ పెద్దగా జనంలోకి చర్చకు రావు, తెలియవు… అవసరం లేదు… ఇప్పుడు చివరకు సీఎస్ రేంజ్ అధికార్ల కులాల్ని కూడా రచ్చకు తీసుకొచ్చి, పొలిటికల్ ప్రచారానికి వాడుకుంటున్నారు… నిజంగానే సీరియస్ క్వశ్చన్… సీఎస్ పోస్టు ఏమైనా నామినేటెడ్ పోస్టా…?
ఇకపై ఎవరిని డీజీపీగా చేసినా, ఎవరిని సీఎస్‌గా చేసినా… ఇక ఈ కులాల సమీకరణాల్లో చూడాలా..? ‘‘ఏదో ఫలానా కులం కాబట్టి, కేసీయార్‌కు ఆ కులం వోట్లు కావాలి కాబట్టి ఆమెకు ఈ పోస్టు దక్కింది, లేకపోతే ఆమె సీఎస్ నియామకపు లెక్కల్లోకే రాకుండా పోయేది’’ వంటి విశ్లేషణలు ఒకరకంగా ఆమెను అవమానించినట్టు… ఆ కులపు మహిళ కాబట్టే ఈ పోస్టు అనే సమీక్షలు ఆమె చదువు, ఆమె సీనియారిటీ, ఆమె ఎబిలిటీ, ఆమె అర్హతలను కించపరిచినట్టే..!
Share this Article