Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జైళ్లలో కులకంపు… వివక్ష చూపే ప్రిజన్ మాన్యువల్స్ కొట్టేసిన సుప్రీంకోర్టు…

October 5, 2024 by M S R

జైళ్లలో కులవివక్షను వెల్లడించిన మార్క్సిస్ట్‌ టీచర్‌ జీఎన్‌ సాయిబాబా మాటలు
జైలు మాన్యువల్స్‌పై సుప్రీకోర్టు తీర్పుతోనైనా ఇప్పుడు గుర్తుకొచ్చాయా?
………………………………..

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా… ఇండియాలో కమ్యూనిస్టులే చాలా విషయాల్లో కొన్ని వర్గాలు లేదా అన్ని వర్గాల ప్రజలకు జరిగే అన్యాయాలను మొదటిసారి గుర్తించడమేగాక వాటిని బహిరంగంగా వెల్లడిస్తారు. వాటిపై ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తారు,

న్యాయపోరాటంలోనూ వారే ముందుంటారు అనేది నూరు శాతం వాస్తవం అని 2024 అక్టోబర్‌ 3న దేశ రాజధానిలో మరోసారి రుజువైంది. జైళ్లలో కులవివక్షకు ఊతమిస్తున్న ప్రిజన్‌ మాన్యువల్స్‌లోని నిబంధనలు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో కమ్యూనిస్టులు ఎందుకు ప్రజలకు మెరుగైన ప్రతినిధులో అర్ధమౌతుంది. త

Ads

నపై అన్యాయంగా బనాయించిన ఒక తప్పుడు కేసులో ఢిల్లీ, మహారాష్ట్ర కారాగారాల్లో ఎన్నో ఏళ్లు గడిపిన ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లిష్‌ అధ్యాపకుడు గోకరకొండ నాగ (జీఎన్‌) సాయిబాబా కొన్ని వారాల క్రితం జైలు నుంచి విడుదలయ్యాక హైదరాబాద్‌ వచ్చారు. అప్పుడు మీడియాతో మాట్లాడుతూ, ‘దేశంలోని జైళ్లలో ఖైదీలకు వారి కులాలను బట్టి పనులు చేయిస్తున్నారు. దేశంలోని కారాగారాల్లో కుల వివక్ష విచ్చలవిడిగా కొనసాగుతోంది,’ అని సాయిబాబా వెల్లడించారు.

అప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో అక్షరాలు చదవడం, రాయడం నేర్చిన కోట్లాది మందికి ఈ విషయం తెలియదు. నా వరకూ దీని గురించి కనీసం వినలేదు కూడా. అయితే, కోనసీమ ఓసీ కాపు కుటుంబంలో పుట్టినందువల్లనేమో గాని.. మార్క్సిస్టులుగా చెప్పుకునే వారిలో ఒక్క సాయిబాబా మాత్రమే జైళ్లలో కుల వివక్ష గురించి జనానికి మొదటిసారి వెల్లడించాల్సిన బాధ్యతను ఎంతో చక్కగా నెరవేర్చగలిగారు.

వరంగల్‌లో మూలాలున్న పూర్వ అధ్యాపకుడు, విప్లవ కవి, జంధ్యం లేని మహా మార్క్సిస్టు– లెనినిస్టు అయిన పెండ్యాల వరవరరావు గారు మూడు నాలుగు కంటే ఎక్కువసార్లే భారత జైళ్లలో విచారణలో ఉన్న ఖైదీగా కొన్నేళ్లు గడిపారు. తన జైలు జీవితం, అనుభవాలపై ఆయన కవితలు, వ్యాసాలు, పుస్తకాలు కూడా రాశారు. అయితే, ఆయన తాను నిర్బంధంలో ఉన్న కారాగారాల్లో ఖైదీలు కుల వివక్షకు గురువుతున్నారని, కులాల ఆధారంగా ఖైదీలతో వివిధ రకాల పనులు చెప్పి చేయించే నిబంధనలు ప్రిజన్‌ మాన్యువల్స్‌లో ఉన్నాయని వరవరరావు గారు ఎక్కడా ప్రస్తావించలేదనే నాకు తెలుసు.

తెలంగాణ విమోచనకు పోరాడిన కమ్యూనిస్టు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వల్లనే వరవరరావు గారికి జైళ్లలో కుల జాడ్యం పెద్ద సమస్యగా కనపడలేదా? కారాగారాల్లో ఈ దుర్మార్గ వ్యవస్థ వరవరరావు గారి కళ్లపడకపోవడానికి కారణం ఆయన సన్నిహిత బంధువులు, మిత్రులకు మాత్రమే తెలిసే అవకాశం ఉంది.

సొతంత్రం వచ్చి 75 ఏళ్లయినా దేశాన్ని కులజాడ్యం వీడలేదు: జస్టిస్‌ చంద్రచూడ్‌
……………………………………….
కులం ఆధారంగా జైళ్లలో ఖైదీలకు పనులు కేటాయించే కారాగార నిబంధనలను (ప్రిజన్‌ మాన్యువల్‌) కొట్టివేస్తూ బుధవారం భారత సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఎస్సీ, బీసీ కులాల వారికి పాయిఖానాలు శుభ్రంచేయడం వంటి పనులను, బ్రాహ్మణులు, వైశ్యులు వంటి అగ్ర కులాల ఖైదీలకు వంట చేయడం వంటి శుచీ శుభ్రతతో కూడిన బాధ్యతలు అప్పగించడం కుల వివక్ష అనే విధంగా సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పులో స్పష్టంచేసింది.

ముంబైకి చెందిన సుకన్యా శాంతా అనే ప్రసిద్ధ జర్నలిస్టు (ద వయర్‌) వేసిన పిటిషన్‌పై సీజేఐ ధనుంజయ్‌ వై చంద్రచూడ్, జడ్జీలు జంషెడ్‌ బీ పార్దీవాలా, మనోజ్‌ మిశ్రాలతో కూడిన బెంచీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ సహా 10 రాష్ట్రాల జైలు మాన్యువల్స్‌లోని నిబంధనలు చెల్లవని తీర్పు చెప్పింది. ఈ బెంచీలోని ముగ్గురు జడ్జీల్లో ఇద్దరు.. జస్టిస్‌ చంద్రచూడ్, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా సుదీర్ఘ న్యాయవాద నేపథ్యం ఉన్న బ్రాహ్మణ కుటుంబాల్లో జన్మించారు. జైలు మాన్యువల్‌లో కులం పేరు చెప్పాలనే కాలమ్‌ అవసరం లేదని ఈ ముగ్గురు జడ్జీల బెంచీ తెలిపింది.

చావు సర్టిఫికెట్‌ ఎంక్వైరీలో నేను సాక్షి సంతకం పెట్టినందుకు నా కులం చెప్పాల్సి వచ్చింది!
………………………………………
అయితే, పోలీసు స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌ దగ్గర నుంచి క్రిమినల్‌ కేసులకు సంబంధించిన అనేక అధికార పత్రాల్లో కులం వివరాలు రాస్తారనే విషయం సుప్రీం కోర్టుకు తెలియదనుకోవాలేమో. బెజవాడ దగ్గరలోని ఏపీ రాజధాని ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం కార్యాలయంపై రెండేళ్ల క్రితం వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల దాడి కేసుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్‌ పేరును నిందితునిగా పేర్కొనే పోలీసు డాక్యుమెంటులో జోగి రమేష్, సన్‌ ఆఫ్‌: మోహనరావు, కాస్ట్‌: గౌడ..అని రాసి ఉన్న విషయం నాకు కొన్ని వారాల క్రితం ఒక తెలుగు టీవీ చానల్‌ చూస్తుంటే తెలిసింది.

అలాగే మా ఇంటి దగ్గరలో నివసించే నా సన్నిహిత ఆత్మీయ మిత్రుడు గంగిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి అనే గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ సీనియర్‌ లెక్చరర్‌ ఇటీవల నాకు ఫోన్‌ చేసి… ‘ మా అమ్మ డెత్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడానికి సంబంధించి విచారణకు రెవిన్యూ ఉద్యోగి మా ఇంటికి వస్తున్నాడు. మీరు ఒక్కసారి ఇంటికొచ్చి అతనిచ్చే కాగితంపై సంతకం చేసి వెళ్లండి, ప్లీజ్,’’ అని కోరారు. మా ఇంటికి రెండు ఇళ్ల అవతల ఉన్న రెడ్డిగారి ఇంటికి వెళ్లి ఆ రెవిన్యూ ఉద్యోగి ఇచ్చిన ఫారం మీద నా పేరు రాసి, పక్కనే సంతకం పెట్టాను.

పని అయిపోయిందని నేను లేచి నిలబడగానే.. ఆ ఉద్యోగి ‘ మీ కాస్ట్‌ ఏంటో చెప్పండి సర్, నేనే రాసుకుంటాను. కులం ఏమిటో చెప్పాల్సిన పనిలేదు. మీరు బీసీ లేదా ఎస్సీ అయితే చెప్పండి,’ అనగానే నేను, ‘యాదవ–ఓబీసీ’ అని అన్నాను. వెంటనే నా సంతకం పక్కన ఉన్న కాస్ట్‌ కాలమ్‌లో బీసీ అని అతను రాసుకున్నాడు. మరి, ఫలానా మనిషి చనిపోయిందని సాక్ష్యం చెప్పినట్టు నేను ఊరూ పేరూ రాసి సంతకం పెట్టాక కూడా నా కులం పేరు.. అదే, సామాజికవర్గం (బీసీ) అడగడం చూస్తే వింతగా కనిపించింది.

సాక్షి సంతకం చేసిన వ్యక్తి కులం, సామాజికవర్గం (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ) ఆధారంగా ఆ సాక్ష్యానికి విలువ ఇస్తారనుకోవాలి, మరి. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా కుల జాడ్యం దేశాన్ని పీడిస్తోందని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ ఆవేదన వ్యక్తం చేశారని పత్రికలు చెబుతున్నాయి. బ్రిటిషోళ్లు భారతీయులను విభజించి, పాలించారని అంటూ ఇప్పుడు మనం పాటించే దురాచారాలు అన్నింటికీ ఇంగ్లిషోళ్లదే పాపమని నిందించడం ఒక్కటే గత ఏడున్నర దశాబ్దాలుగా కాస్త ఎక్కువగా చేస్తూ వస్తున్నాం…. (మెరుగుమాల నాంచారయ్య)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నడిరాతిరి వేళా నీ పిలుపు… ఇలాంటి ఓ హిందీ పాటే ఓ ఉత్సవం…
  • ఈ తూరుపు, ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ…!
  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions