అబ్రకదబ్ర, అబ్రకదబ్ర అన్నట్టుగా… చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలు ఇలా కూర్చోగానే అలా సమస్యలు పరిష్కృతం కావు…. అవి విభజన సమస్యలు… అంత త్వరగా తెగేవీ కావు… కేసీయార్, చంద్రబాబులు సీఎంలుగా ఉన్నప్పుడు ఉప్పూనిప్పూ వ్యవహారమే కాబట్టి అసలు భేటీ అనేదే లేదు… తరువాత జగన్, కేసీయార్ జాన్ జిగ్రీలు అయినా సరే, కీలక అంశాలపై అడుగు కదిలిందీ లేదు… నిష్కర్షగా అనిపించినా సరే, చంద్రబాబు- రేవంత్ భేటీతో అర్జెంటుగా పరిష్కారాలు కనిపించవు… అది రియాలిటీ…
ఈలోపు బీఆర్ఎస్ ఈ సీఎంల భేటీ మీద విషం కక్కడం స్టార్ట్ చేసింది… తెలంగాణను ఏపీకి రాసిచ్చేస్తున్నంత ఆక్రోశం వ్యక్తం చేస్తోంది… ఎవరి ప్రయోజనాల పట్ల ఎవరూ రాజీపడరు… పడితే స్వరాష్ట్రంలో తీవ్రమైన విమర్శల్ని ఎదుర్కోవాలి… అందుకే అంత తేలికగా తెగవు… ఏవో కొన్ని భవనాలు, ఉద్యోగులు, చిన్న చిన్న ఆస్తులు వంటివి నిజానికి ప్రధాన కార్యదర్శుల స్థాయి చర్చలతోనే పరిష్కారం కావాలి… సీఎంల దాకా వెళ్లాల్సిన పనిలేదు, కానీ జరగలేదు అంటే అవి చిక్కుముళ్లుగా బిగుసుకుపోయాయని అర్థం… కాకపోతే ఈ భేటీ రెండు రాష్ట్రాల నడుమ ఓ సుహృద్భావ సంబంధాలకు ఉపయోగకరం…
ఉదాహరణకు… కరెంటు బకాయిలు… తెలంగాణ నుంచి మాకు రావాలంటుంది ఏపీ… నో, మీరే ఇవ్వాలి, అవి ఇచ్చేస్తే మీకు రావల్సినవి ఇచ్చేస్తాం అంటుంది తెలంగాణ… పదేళ్లుగా తెగని బకాయిల పంచాయితీ అది… అన్నింటికన్నా ముఖ్యంగా పోలవరం ముంపు మండలాలు… మా మండలాలు మాకు ఇవ్వాలంటుంది తెలంగాణ… అది తెగేదేనా..? మోడీ ప్రభుత్వం పదేళ్ల క్రితం మొదటి బిల్లు ఇదే…
Ads
అది జరగనిదే నేను సీఎంగా ప్రమాణస్వీకారం చేయను అన్నాడట చంద్రబాబు… (అంతా ఉత్తదే అని విమర్శలు సరే…) మరి అలాంటిది ఆ ఏడు మండలాలను అదే చంద్రబాబు ఇచ్చేస్తాడా..? నిజానికి పోలవరం ఒరిజినల్ ప్లాన్ మేరకు కడితే ఆ మండలాల్లో ముంపు తప్పదు, కానీ పునరావాసం, పునర్నిర్మాణం తడిసి మోపెడవుతోంది… దాంతో మొదటి దశను పూర్తి చేస్తాం అంటున్నారు… అంటే తక్కువ ఎత్తు, తక్కువ ముంపు… ఐనా సరే, ఏపీ ఆ మండలాలను తెలంగాణకు ఇవ్వడం దాదాపు అసాధ్యం… (రాబోయే రోజుల్లో ఈ మొదటి దశ, తాడిపూడి, పుష్కరం, పట్టిసీమ లిఫ్టులతోనే సరిపోవచ్చునేమో ఇక…)
ఇలాంటివే చాలా ఇష్యూస్… అవి సరిపోవని కొత్తగా అసాధ్యమైన డిమాండ్లు వస్తున్నాయి ఇప్పుడు… తిరుపతిలో భాగం, కీలకమైన పోర్టుల్లో వాటా, సుదీర్ఘమైన తీరప్రాంతంలో తెలంగాణకూ భాగం వంటివి… అవి విభజనకు ముందు చేయాల్సిన డిమాండ్లు… ఐనా అసాధ్యాలు… ఏపీలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే…
ఇదే రీతిలో, మాకు హైదరాబాద్ రెవిన్యూ లో వాటా కావాలని ఏపీ అడిగితే..? కృష్ణా పరీవాహక ప్రాంతాన్ని బట్టి నీటి వాటాల పంపకం అనేది స్థూలంగా మంచి డిమాండే అయినా… అది ట్రబ్యునల్ తేల్చాల్సిన అంశం… ఇద్దరు సీఎంలు కాదు… మరోవైపు ఏపీ నాయకులు విభజన చట్టం గడువు పెంచాలనే కొత్త డిమాండ్ తెరపైకి తెస్తున్నారు… అది ఒడిశిన ముచ్చట… జరగదు… ఐనా ఈ డిమాండ్ ఆగదు, దానికి రేవంత్ అంగీకరించే ప్రసక్తే రాదు, పైగా అది కేంద్ర పరిధిలోని అంశం…
ఇచ్చిపుచ్చుకోవడం అనేది చెప్పుకోవడానికి పైకి బాగానే ఉంటుంది… కానీ ఎవరు ఉదారంగా ఉన్నా సరే, వాళ్లకు స్వరాష్ట్రంలో రాజకీయంగా చిక్కులు వస్తాయి.,. రేవంత్ రెడ్డి, చంద్రబాబుల నడుమ వ్యక్తిగత సంబంధాలు బాగానే ఉన్నా సరే, ముఖ్యమంత్రులుగా వాళ్లకు చాలా పరిమితులున్నాయి… ఉంటాయి… వాటిని దాటేసి వాళ్లిద్దరూ పోలేరు… అది అసలు రియాలిటీ..!!
Share this Article