.
కాల్పుల విరమణ వేరు, సాయుధ పోరాట విరమణ వేరు… మావోయిస్టు పార్టీ శాంతి చర్చల వైపు పౌరసమాజం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటోంది… దీనికి అనుగుణంగా తాము కాల్పుల విరమణకు సిద్ధమనీ ప్రకటించింది…
ఇక్కడ రెండు అంశాలు… అందులో మొదటిది కాల్పుల విరమణ… ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేసి, మొత్తం బలగాల కార్యకలాపాలను స్థంభింపజేయాలని షరతు… సహజమే… ఒకవైపు చర్చలు మరోవైపు యుద్ధం అసహజం… అసాధ్యం…
Ads
నిజానికి ప్రస్తుతం యుద్ధమేమీ జరగడం లేదు… మావోయిస్టుల దుర్గమస్థావరాలుగా భావించబడుతున్న ప్రదేశాల్లోకి కూడా చొచ్చుకుపోతూ ప్రభుత్వ బలగాలు, సరే, రాజ్యం బలగాలు దండయాత్ర చేస్తున్నాయి… నరమేధం…! సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, కోబ్రా, ఎస్టీఎఫ్ బలగాలదే పైచేయి ప్రస్తుతానికి…
వందలుగా మావోయిస్టులు నేలకొరుగుతున్నారు… టెక్ కకావికలం అయిపోయింది… ఇదే ఊపులో ఒక్క ఏడాదిలో మొత్తం నక్సలిజాన్ని నిర్మూలిస్తాను అంటున్నాడు హోం మంత్రి అమిత్ షా… 2026 మార్చి 31 గడువుగా ప్రకటించాడు…
కీలక నేతల సమాచారం అలా వచ్చిపడుతోంది… పాత సల్వాజుడుం తరహాలోనే డీఆర్‌జీలు (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్) చురుకుగా కదులుతున్నాయి… ఆ సభ్యులకు దండకారణ్యంపై పూర్తి అవగాహన ఉండటంతో పోలీసు బలగాలు దూకుడుగా వెళ్లడానికి ఉపకరిస్తోంది… అత్యాధునిక ఆయుధాలు… డ్రోన్లు, థర్మల్ ఇమేజెస్ ఎట్సెట్రా ఉపయోగిస్తున్నారు… ఈ స్థితిలో అఫెన్స్ మాట అటుంచి, డిఫెన్సే చెల్లాచెదురైంది…
కీలక నేతల అనారోగ్యాలు, ముదిమి, రిక్రూట్‌మెంట్ లేకపోవడం తదితర కారణాలు మావోయిస్టుల సైనిక పాటవాన్ని గణనీయంగా తగ్గించివేశాయి… ఈ స్థితిలో ఓ ఎత్తుగడగా శాంతి చర్చలను ముందుకు తీసుకొచ్చి ఉన్నారేమో బహుశా… శాంతి చర్చలు కొత్తేమీ కాదు… వైఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో కొన్నాళ్లు ఈ తంతు అందరమూ గమనించిందే…
కాల్పుల విరమణను ముందుగా ఎవరు ఉల్లంఘించారనేది పక్కన పెడితే… శాంతి చర్చలతో మావోయిస్టులకే బాగా నష్టం వాటిల్లిందనేది జనాభిప్రాయం… తరువాత మావోయిస్టు నేతల చేతుల్లోకి సెల్ ఫోన్లు వచ్చాక నష్టాల తీవ్రత ఇంకా పెరిగింది… నిజానికి శాంతి చర్చల ఎజెండా మీద ఎవరికీ ఏ నమ్మకాలు లేవు అప్పట్లో… అదే జరిగింది…
రాజ్యం ఎప్పుడూ సాయుధ తిరుగుబాటును అంగీకరించదు… తన క్రౌర్యాన్ని ప్రదర్శిస్తూ పూర్తిగా అణిచివేయడానికే ప్రయత్నిస్తుంది… తన లక్ష్యం మీద నమ్మకం ఉన్న విప్లవకారుడు ఆయుధాన్ని దింపడు… ఈ ఘర్షణ ఎవరో ఒకరిది పూర్తిగా పైచేయి అయ్యేవరకూ ఉంటుంది… కాకపోతే శాంతి చర్చలు ఈ ఘర్షణకు ఓ విరామం…
శాంతి చర్చలకు కేవలం చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ముందుకొస్తే సరిపోదు… నక్సలిజం జాతీయ స్థాయి అంశం… అక్కడ యుద్ధం చేసేది కేంద్రం… సరే, ఈ విరామ ప్రయత్నం వెనుక ఎత్తుగడకు ఇవీ కారణాలు కావచ్చు…
1. ప్రభుత్వ బలగాల దాడుల తీవ్రత నుంచి కాస్త రిలీఫ్… కాస్త ఊపిరి పీల్చుకుని, సంస్థాగతంగా సర్దుబాట్లు చేసుకుని, కాస్త బలాన్ని అదనంగా సమకూర్చుకోవడం…
2. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మీద రాజకీయ ఒత్తిడిని క్రియేట్ చేయడం, ప్రభుత్వం ఈ శాంతి చర్చల పిలుపును తృణీకరిస్తే ‘శాంతిని కోరుకోని వైఖరి’ అని ఎక్స్‌పోజ్ చేసి సామాజిక మద్దతు పొందడం…
3. ఎంతోకొంత అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం, తద్వారా శాంతి చర్చల దిశలో భారత ప్రభుత్వంపై ఒత్తిడిని క్రియేట్ చేయడం, మానవహక్కుల సంఘాల జోక్యాన్ని ఆశించడం…
… ఇలా… ఈ శాంతి చర్చల వైపు ప్రభుత్వం మీద ఒత్తిడిని తీసుకొచ్చేలా పౌరసమాజం (ప్రజాసంఘాల) భేటీలు జరుగుతున్నాయి… ఇక రెండో అంశం… కాల్పుల విరమణ కాదు, సాయుధ పోరాట విరమణ… ఈ కోరిక కూడా సోషల్ మీడియాలో కొందరు మేధావుల నుంచి అక్కడక్కడా వినిపిస్తోంది… (అవి చూశాకే ఈ కథనం)… కానీ ఈ పదాలే విప్లవకారులకు రుచించకపోవచ్చు కూడా…
సాయుధ పోరాట విరమణ కొత్తేమీ కాదు, అసహజమూ కాదు… ఉధృతంగా సాగి, ఊరూరూ కదం తొక్కిన తెలంగాణ సాయుధపోరాట విరమణ జరిగింది… అప్పటి హైదరాబాద్ రాజ్యంలో కమ్యూనిస్టు రాజ్యం ఏర్పడుతుందనే భావనతో యూనియన్ ప్రభుత్వం దమనకాండనే ప్రయోగించి సక్సెసైంది… సాయుధ కమ్యూనిస్టు బలగాలు పూర్తిగా రిట్రీటయ్యాయి… భారీగా నష్టాలను మిగుల్చుకుని…
నక్సల్బరీ ఉద్యమం యొక్క తొలి దశ (1967- 1972) కూడా ప్రభుత్వ దమనకాండ, అణిచివేతతో తాత్కాలిక విరమణకు దారితీసింది… మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని విరమిస్తారని ఆశించే పరిస్థితులు ప్రస్తుతానికి లేవు… కానీ సొసైటీలో ఓ భావన పెరుగుతోంది… మావోయిస్టుల కమిట్మెంట్, సొసైటీ పట్ల తపన, ప్రాణత్యాగాలకూ వెరవని తెగింపు ధోరణులపై ఎవరికీ చెడు అభిప్రాయాలు లేవు…
ఈమధ్య మరణించిన మావోయిస్టు కీలకనేత రేణుక అంత్యక్రియలకు ఉమ్మడి వరంగల్ జిల్లా, కడవెండిలో భారీగా జనం హాజరయ్యారు… తమ కోసం పోరాడే తమ బిడ్డలపై అన్ని ఊళ్లకూ సానుభూతి ఉంది, అభిమానం ఉంది… కానీ..?
ఎటు చూసినా అక్రమార్కులు చెలరేగిపోతున్న నేటి రోజుల్లో అన్నలు బలంగా ఉంటే బాగుండు అనుకునేవాళ్లూ ఉన్నారు… కానీ స్థూలంగా చూస్తే సొసైటీ సాయుధ పోరాటానికి పాజిటివ్‌గా లేదు… ఇవేవీ విజయవంతం అవుతాయనే నమ్మకాలూ లేవు…
భారత ప్రభుత్వం స్వరాజ్యం వచ్చాక చాలా చూసింది… అనేక తిరుగుబాట్లను అణిచివేసింది… పొరుగున శ్రీలంకలో టైగర్లు ఏమయ్యారో చూశాం, అంతెందుకు..? నేపాల్‌లో ఈ మావోయిస్టులే రాజ్యాధికారం చేజిక్కించుకున్నారు… కానీ ఏమైంది..? కకావికలు… పాలన చేతగాక… చివరకు నాటి రాజరికమే కావాలని ప్రజలు వీథుల్లోకి వస్తున్నారు…
మరేం చేయాలి..? సొసైటీని దోచుకునే అక్రమార్కులు స్వేచ్ఛగా మరింత దోచుకుంటూ తిరుగుతున్నారు… సొసైటీ మార్పు కోసం పోరాడే నక్సలైట్లేమో అడవుల్లో క్షణక్షణం భద్రతారాహిత్యంలో పడి, చివరకు నేల తల్లి ఒడికి చేరుతున్నారు…
వాళ్లే సొసైటీలోని వివిధ రంగాల్లోకి చేరితే, జనజీవన స్రవంతిలో ఇదే కమిట్మెంట్‌తో నిర్మాణాత్మక మార్పుల కోసం పోరాడితే… హింసాపథం వీడితే… ప్రజలను కూడగడితే… ఈ ఆశ నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లో వినిపిస్తోంది… వినబడాల్సిన వాళ్లకు వినిపిస్తుందో లేదో గానీ..!! ఇదొక సెక్షన్ అభిప్రాయం మాత్రమే… ఇంకా మేలైన మార్గాలేమిటో మేథోసమాజం మథించి సూచించాలి..!!
Share this Article