………. By……. Taadi Prakash………… మోహన్ ప్రసాద్ అనే కవి ఉండడం మన అదృష్టం
Celebrating agony of being alive: Tripura
————————————————————–
1975 నుంచీ తెలిసిన, సభల్లో, రాత్రి పార్టీల్లో కలిసిన, భుజాలమీద చేతులేసుకు నడిచిన… లాంటి ఆ పెద్ద కవికి నేను ఏమివ్వగలను? ఇచ్చే అవకాశం రానే వచ్చింది… బాహాటంగా, రహస్తంత్రి రూపంలో. విజయవాడలో సభ. కవులూ రచయితలూ, పుస్తకావిష్కరణ సభ అంటే కకావికలు ఐపోతూ ఉంటారు. “పుస్తకం రానీ, మతిపోతుంది ఒక్కొక్క నా కొడుక్కి” అనుకుంటూ ఉంటారు. రహస్తంత్రి అనే అక్షరాలు ఆర్టిస్ట్ మోహన్ రాశాడు. “మీ అన్నయ్య ఏంటో పెనిస్‌ని బ్లేడ్ తో చెక్కినట్టు రాస్తాడు అక్షరాలు” అన్నారు మో నాతో. ఆయన అలాగే అంటారుగా మరి.
Ads
కవులు అఫ్సర్, ప్రసేన్, కలేకూరి ప్రసాద్… ఇలా చాలా బాగా రాయగలిగే వాళ్ళు ‘ఆంధ్ర భూమి’ editorial section లో ఉన్నా.., మోహన్ ప్రసాద్ గారికో ‘కానుక’ ఇవ్వాలి, ఆయన్ని impress చెయ్యాలి… అనే single minded aim తో నేనే సభకి వెళ్లి పెద్ద item రాశాను. ఒక కవిత్వ సభ గురించి, పెద్ద ఫోటో వేసి దాదాపు పావు పేజీ వార్త రాసినందుకు ఆంధ్రభూమి యాజమాన్యం నాకు మెమో ఇచ్చి మందలించింది. ఒక డైలీ పేపర్ లో ఇలా చెయ్యకూడదు అని, misuse అని నాకు తెలుసు. మో కోసం ఆ మాత్రం చెయ్యకపోతే స్నేహం ఎలా అవుతుంది? అభిమానం absurd గా, ప్రేమ surreal గానే ఉంటాయి కదా.
*** *** ***
“నేను ఏ అపరాధమూ చేయలేదు. ఎవరినీ అవమానించలేదు. (అసలు) నేనేమీ చేయలేదు. అలాంటి అమాయకుణ్ణి విశాఖపట్టణం నుంచి మోహన్ ప్రసాద్ ఇంటికి లాక్కొచ్చి, ప్రీ ఎమ్టివ్ గా అతని ఇన్విటేషన్ కార్డు మీద నన్ను దారుణంగా ఇరికించారు. అయామ్ టోటల్లీ ఎల్లర్జిక్ టు అనాలిసిస్” అని కవి త్రిపుర ‘మో’ రహస్తంత్రి కవితా పరిచయ సభలో ఖచ్చితంగా త్రిపుర లాగే ఉపన్యాసం ప్రారంభించారు.
ఎప్పట్లాగే మౌన గంభీరంగా, తెలుపూ నలుపూ గడ్డంతో, టీ షర్ట్ తో డిస్టర్బ్ డ్ గా, గడ్డం పెంచిన నాటి శ్రీశ్రీలా వున్న త్రిపుర, “నేను అభిమానించే కవులెవరన్నా వున్నారూ అంటే, అందులో మొదటి పేరు మోహన్ ప్రసాద్” అని డిక్లేర్ చేశారు. ‘మో’ కవిత్వాన్ని విశ్లేషించమన్నారని విశాఖ ‘ హైకూ ‘ యిలా వయొలెంట్ గా రియాక్ట్ అయింది. “రెండూ, రెండూ నాలుగు గని చెప్పగలను గానీ, దాన్ని, భాగించి హెచ్చరించే పని నే చేయలేను. అంత అమాయకుణ్ణి. నిరపరాధిని. నన్నిలా ఇరికించారు, నాకా పుస్తకం కూడా ఇవ్వకుండా. ‘ మో ‘ గురించి నా అసహనం చెబుతాను. ఇంప్రెషన్స్ ఇవ్వగలను. ఏది చదివినా నాకు ఇంప్రెషన్సే వస్తాయి. విశ్లేషణ చేయడం ఇష్టం లేదు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లిటరరీ రెజిమెంట్” అని కోప్పడ్డారు త్రిపుర.
చీకటి గదుల్నించి బయటకు వచ్చిన ‘త్రిపుర ‘ అందమైన స్పందనతో, కెరటాలు కెరటాల లాంటి ఇంగ్లీషు వాక్యాలతో మోహన్ ప్రసాద్ ను ప్రేమించారు. “ఇంప్రెషన్సే ఇవ్వగలను. మై ఓన్ స్కిజోఫ్రెనిక్ పెర్సనాలిటీకి సంబంధించినవి కనుక అవి వేలిడ్ అని చెప్పలేను. ఏడెనిమిదేళ్ల క్రితం మోహన్ ప్రసాద్ అనే కవి ఉన్నాడనీ, కవిత్వం రాస్తాడనీ అత్తలూరి నరసింహారావు చెప్పాడు. ‘మో’ నాకు పుస్తకం పంపాడు. తెలుగు కవిత్వం, తెలుగు సాహిత్యం నేను ఎక్కువ చదవలేదు. ‘ చితి చింత ‘ మొదటి సారి చదివినపుడు ఇట్ వాజ్ సచ్ ఎ త్రిల్లింగ్. రివలేషన్ టు మీ. ఐ బికేమ్ మేడ్. అప్పట్లో ఆయన లైన్లు కోట్ చేస్తూ, నా రియాక్షన్స్ తో ఆయనకి పదేపదే ఉత్తరాలు రాశాను. ‘మో’ కవిత్వం… ఇటీస్ ద ఎగొనీ ఆఫ్ బీయింగ్ ఎలైవ్… ‘మో’ సెలబ్రేట్స్ ద ఎగొనీ ఆఫ్ బీయింగ్ ఎలైవ్… అది బతికి ఉండటంలో బాధ… యూ కెనాట్ ఎండ్యూర్ ఇట్… బేర్ ఇట్, ది ఎగొనీ ఆఫ్ బీయింగ్ ఎలైవ్! బాల్యం బాధామయం. ఇన్ఫినిట్ శాడ్ నెస్ ఆఫ్ బీయింగ్ ఎ చైల్డ్ గా ఉండడం ఎంత బాధో – ఆ వయసులో చాలామంది సంతోషంగా ఉండొచ్చు – ఇదంతా సబ్జెక్టివ్! మోహన్ ప్రసాద్ పొయిట్రీ ఎంటర్డ్ ఇన్టూ మై బ్లడ్ స్ట్రీమ్. ఒక్కోసారి ఇలా ఉంటుంది ఇంప్రెషన్ : సముద్రపొడ్డున ఒక వాలుకుర్చీలో కూర్చుని, కెరటాలు ఒడ్డుకొస్తున్న చోట… ఆకాశం వైపు చూస్తూండటం అదేంటో చెప్పలేను.
దీన్ని ఎనలైజ్ చేయడానికి ఇష్టపడను. ఐ యాక్సెప్ట్ సచ్ ఇమేజెస్ ఇన్ దైర్ టోటాలిటీ. (స్పష్టంగా లేదని) మోహన్ ప్రసాద్ ని ఏం రాశామని అనడం, అడగడం, ఐ థింక్ ఇట్స్ ఏ క్రిమినల్ యాక్ట్.
“చితి చింత”లో ‘ ప్రవాసం ‘ కవిత అంటే నాకు ఎంతో ఇష్టం. దాన్ని మోహన్ ప్రసాద్ తో చదివిద్దామని ఎంతో ప్రయత్నించా. సాధ్యం కాలేదు.
ఐ డోంట్ బిలీవ్ ఇన్ మేజిక్.
బట్, ఇట్స్ ఏ షియర్ మేజిక్.
ఐ డోంట్ బిలీవ్ ఇన్ డివైనిటీ.
బట్ ఇట్స్ డివైన్ –
ఇక్ స్టసీ (మహదానందం) అనేదేమన్నావుంటే చదివాక నాకు అది కలిగింది. తర్వాత చాలాకాలానికి మోహన్ ప్రసాద్ ని కలిశాను. ఆయన కవితలు ఎంత పరమానందాన్ని ఇచ్చాయో, ఆయన కలయిక అంతకంటే ఎక్కువ ఆనందాన్నిచ్చింది. మోహన్ ప్రసాద్ అనే కవి ఉండడం మన అదృష్టం. మోహన్ ప్రసాద్ అనే కవి తెలియడం నాకు మహా అదృష్టం. అతని కవిత్వం చదివి నేను ఆనందించానని చెప్పుకోవడం కంటే ఆనందం నాకు మరోటి లేదు” అని త్రిపుర ఉద్వేగంగా ప్రసంగం ముగించారు. “తమలపాకులిచ్చేశాను…” అన్నట్టుగా తాపీగా వెళ్లి కూర్చున్నారు త్రిపుర. సభంతా చప్పట్లు.
“విశ్లేషణ సామాన్యుల కోసం. కొందరు అలాంటివి లేకుండా కూడా మోహన్ ప్రసాద్ కవిత్వాన్ని అనుభవించగలరు. అదే త్రిపుర చేసింది” అని అధ్యక్షత వహించిన ‘చేరా’ కామెంట్ చేశారు. ఆదివారం సాయంత్రం విజయవాడ అభిలాష హోటల్ లో ‘మో’ కొత్త పుస్తకం ‘ రహస్తంత్రి ‘ పరిచయ సభ అద్భుతంగా జరిగింది. ఆవిష్కరణ తంతు లేనే లేదు. దండలూ, దొంగవినయాలూ, పుష్పగుచ్ఛాల లాంఛనాల నాన్సెన్స్ లేదు. ఆర్టిస్ట్ మమత హాయయిన చల్లని నవ్వుతో అందర్నీ ఆహ్వానించింది. కుర్రకుంక నీహార్, ‘ మోహన్ ప్రసాద్ మావయ్యా…’ అంటూ కవిత్వం చదివాడు.
భాషా శాస్త్రవేత్త ‘చేరా’ లేవడంతోనే సంచిలోంచి తూకంరాళ్ళు తీసి సభికుల జేబుల్లో వేశారు. “చితి చింత” తర్వాత ఇరవయ్యేళ్ళకి మోహన్ ప్రసాద్ పుస్తకం బయటకి తీసుకువస్తున్న సభ ఇది” అని ‘చేరా’ దీని ప్రాధాన్యాన్ని ముందే చెప్పారు.
“అస్పష్టతా, అర్థంకావూ అనేవాటికి మోహన్ ప్రసాద్ ఎప్పుడూ సంజాయిషీ చెప్పడు. నవ్వేస్తాడు. సంజాయిషీ చెప్పినామాత్రం అర్థం అవుతుందా అని కావచ్చు” అని చిన్నారి చురక వేశారు ‘చేరా’. ‘మో’ కవిత్వం గురించి రెండు విషయాలున్నాయి. ఆయన సమాజాన్ని గురించి పట్టించుకోడనీ, ఆయన కవిత్వం మనకి అర్థం కావల్సినంతగా అర్థం కాలేదనీ… ఇవి రెండూ అర్థసత్యాలే. విజయవాడలో కల్పన ఆత్మహత్యపై ‘మో’ కవిత, పౌరహక్కుల సభల్లో ‘మో’ తీవ్రంగా నిరసన తెలియజేయడం ఆయనేంటో చెబుతాయి. దేశాన్ని ఊపేసిన తెలంగాణా పోరాటం విషయంలో శ్రీశ్రీ అజ్ఞాతంగా ఎందుకుండిపోయాడు? సమాధానం లేదు. ఏమైనా, కవిత్వంలో నాది మావోయిజం. వెయ్యి పూలు వికసించనీ… కవులందరూ ఒకే విషయం రాసినా బాగోదు. మోహన్ ప్రసాద్ కవిత్వం సమాజానికి గొప్ప ప్రయోజనకారి కాకపోవచ్చు. కానీ, అపకారం చేసే అసంబద్ధమైన అభిప్రాయాలు ఆయన ఎక్కడా వెలిబుచ్చలేదు” అన్నారు ‘చేరా’. “అర్థం కాకుండా రాస్తే నష్టం కవికే. అంచేత అదొక సాంఘిక నేరం అనుకోకూడదు. నిజానికి కవిత్వం చదవడంలో మనం ఒక అలసభావానికి అలవాటుపడ్డాం. కాస్త శ్రమపడి, కొంచెం అభ్యాసం చేసి, ఆలోచించాలి” అన్నారు చేరా మాస్టారు. ‘మో’ వాడే ప్రతీకలు చాలా వ్యక్తిగతమైనవి. వాటిని డిటెక్టివ్ లా ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకోలేం. కావాలని సింటాక్స్ ని విరగ్గొడతాడు. వ్యాకరణ సూత్రాన్ని అతిక్రమిస్తేనే కవిత్వం. సింటాక్టివ్ డీవియేషన్ వుంది. ‘మో’ది సింటాక్టివ్ డిస్ట్రక్షన్” అన్నారాయన. త్రిపురని ‘బతికిన క్షణాలు’ గురించి రాయమంటే ఆయన ‘మరో బతికిన క్షణాలు’ రాశారని జోకేశారు.
విమర్శకులు పన్నాల సుబ్రహ్మణ్య భట్టు మాట్లాడుతూ, “తెలుగుదేశంలో ఆధునిక కవిత్వానికి కొత్త పడికట్టు రాళ్లు ఉండాలని చాలా ఏళ్ళ క్రితం అనుకున్నాను. సృజనాత్మక లిట్మస్ పేపర్ లాంటిదాన్ని సృష్టిస్తే తప్ప ఏది బావుంది? ఏది బాగోలేదు? అని చెప్పడం కష్టం. ఆధునిక కవిత్వానికి కొన్ని స్ఫురణకు అందే మౌలిక విద్యుత్ వేగాలు ఉంటాయని నా అనుభవం. శాబ్దిక మూలకాల్ని తయారుచేయడంలో మోహన్ ప్రసాద్ ప్రసిద్ధి చెందారు” అని చెప్పారు. ఆయన ‘మో’ని ఉల్లేఖిస్తూ, “దీపస్తంభానికి సాగదీసి అంటించిన నాలిక-”
“చివరి మూత్రపు స్పటికం -”
“కిరసనాయిలు సూదులు కాల్తున్న కట్టెల్లా వెల్తురు -”
“నరాల సూదుల వాన”… లాంటివి రాయగలగడం కొద్దిమందికే సాధ్యం అన్నారు.
“సంకీర్ణ భావాల టెక్సరల్ కాంప్లెక్సిటీలో, కేవలం విజువల్ ఇంపాక్ట్ మాత్రమేకాక, ‘విజన్ మిక్స్’ ని ‘మో’ సాధించారు. పేర్లు చెప్పగూడదుగానీ అంటూనే, ఇది ఆరుద్రకీ, శ్రీశ్రీకీ చెల్లలేదు” అన్నారు భట్టు. ఆధునిక తెలుగు కవిత్వంలో ఫుల్లీ మెంటల్లీ ప్రిపేర్డ్ కవి ‘మో’. ఒక్క భావ తీవ్రతకు ఒక అక్షర శిఖరాన్ని ఏర్పరచిన కవిగా మోహన్ ప్రసాద్ నిలిచిపోతారు” అని పన్నాల అన్నారు.
ఈ నిండైన సాహిత్య సభలో కొత్త గొంతు కవి సీతారాంది. “ఆ మూల కూర్చున్న ముగ్గురు కుర్రాళ్ళనీ బైటకి వెళ్లిపొమ్మంటున్నాను, హెరాల్డ్ బ్లూమ్ దగ్గరికి… అంటూ ‘అసంబద్ధంగా’ ఉపన్యాసం ప్రారంభించి, సభ కాళ్ళూ, చేతులూ కట్టిపడేశాడు. ఎక్కడ కవిత్వం నిత్యావసర వస్తువు అవుతుందో, అక్కడ కవిత్వం అర్థం కాకపోవటం ఉండదని సీతారాం ప్రకటించాడు. “మోహన్ ప్రసాద్ కవిత్వం ఆరుకాళ్ల పద్యం. ఆయన భాషని తిరగరాస్తున్నారు. భాషకి మూగతనాన్ని ఇచ్చే క్రమంలో ఆయన మాట ‘సైకోబాబిల్’ అయింది. సైకోబాబిల్ అంటే, తెగ మాట్లాడటం, నాన్సెన్స్ స్పీకింగ్” అని చెప్పాడు. అక్షరం నిరక్షరం కావాలి, కావడమే కవిత్వం అని చెప్పిన మోహన్ ప్రసాద్ కొన్నిచోట్ల పాపం శబ్దలౌల్యంలో పడ్డాడు అని చిరాకుపడ్డాడు సీతారాం.
తెలుగు కవిత్వం ఒక కొత్త జిప్సీ భాష నేర్చుకోవాలి అని గౌస్ పుస్తకానికి ముందుమాటలో ‘మో’ అన్నదాన్ని ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన చెందాడు. తెలుగు కవిత్వంలో భాషని బతికించే ప్రయత్నం చేస్తున్నాడు ‘మో’ అని చెప్పాడు. “మో కవిత్వం తక్కువ చదవండి. అందులో దుమ్మలగొండులున్నాయి. హృదయాన్ని కుమ్మేస్తాయి. జాగ్రత్త. తక్కువ చదవండి” అని సీతారాం హెచ్చరించాడు.
కవిత్వాన్ని ‘మో’ బతికించే ప్రయత్నం చేస్తున్నాడూ అంటే కవిత్వం చచ్చిపోయిందన్న భావం వస్తోందని చేరా పాయింట్ పట్టుకున్నారు. (ఆయన అధ్యక్షతన కవిత్వం చనిపోడం చాలా బాగోదు కదా! కనక) అది మెటఫర్ మాత్రమే అని అన్నారు. “మెటఫర్ సత్యం చెప్పడానికి కాదు, సత్యాన్ని కప్పెట్టడానికే” అని చెప్పి చేరా జాగ్రత్తపడ్డారు.
రచయిత చందు సుబ్బారావు మాట్లాడుతూ, “1970లో అరసం రిజువనేట్ అవుతున్న సమయంలో విశాలాంధ్ర మేడ మీద, వేగుంట ఈజ్ ఎ సెలబ్రేటెడ్ నాన్సెన్స్. వేగుంటని ఏ గుంటలోకో తోసేస్తాం, పాతేస్తాం అని ఆయన్ని డెనిగ్రేడ్ చేసిన వాళ్ళం. కమ్యూనిస్టు సామ్రాజ్యాలు కూలిపోయాక, కళ్ళకి కమ్మిన పొరలు తొలగిపోయాక వేగుంటని ఇపుడు వెతుక్కుంటూ వచ్చానని చెప్పారు. నిజాయితీగా, నిర్భీతిగా, పశ్చాత్తాపంతో ఆయన వేగుంట కవిత్వాన్ని ఎత్తుకుని, ముద్దు పెట్టుకున్నారు. కవి నేను అంటే మేము అని, రాజకీయ నాయకుడు మేము అంటే నేను అని చందు చమత్కారం చేశారు. “తెలుగు కవిత్వం అంతా ఒక దారిన పోతున్నా, సోల్ వాయిస్ ‘మో’ది. సోల్ సోల్జర్ గా నిలిచాడు. మనలోని సునిశితత్వాన్ని మళ్లీ మనకిచ్చాడు. వర్తమాన వచన కవుల అగ్రజుడు మోహన్ ప్రసాద్” అని చందు సుబ్బారావు ఆనందంగా అంగీకరించారు.
కవయిత్రి జయప్రభ ఇలా అన్నారు. “ఫెమినిస్టు గా నా అభిప్రాయం అడిగారు. ‘మో’ కవిత్వం ద్రాక్షపాకం కాదు. తినాలనిపించింది తినలేనపుడు ఒక అసహనం ఉంటుంది. తెలీని బాధ మనసు మూలల్లో మెలితిప్పుతుంది. సహించి ఊరుకోడం కన్నా, తెగించి తేల్చుకోడంలో సరదాగా ఎక్కువ నాకు. బాధ ఆనందంగా వేదాల్లో ఉంటుందేమోగానీ, జీవితంలో వుండదు. ఇవ్వాళ ఎవరి నేపథ్యమూ బాధల్నించి అతీతం కాదు. మోహన్ ప్రసాద్ బాధల సందర్భాలు సామాజికమైనవే అంటూ, ‘రొట్టెముక్క’ కవిత చదివి వినిపించారు. ‘మో’ కవితల్ని మరింతగా ఆంగ్లీకరించకపోతే, మరింత మార్మికతతో నింపకపోతే ఆయన మరింతమందికి చేరువవుతారని జయప్రభ అన్నారు.
సభ జరుగుతుండగా వేదిక మీదున్న త్రిపురకీ, జయప్రభకీ గ్లాసులతో మంచినీళ్లు అందించిన సాదాసీదా మానవుడు మోహన్ ప్రసాద్.
సభ చిట్టచివరిన “ఒక్కటంటే ఒక్క మాట, అందరికీ కృతజ్ఞతలు” అని మాత్రం చెప్పారు. తెల్లని నవ్వు మమత కృతజ్ఞతలతో సభ ముగిసింది.
ఈమధ్య విజయవాడ నగరంలో ఇంతమంది ప్రముఖులు వచ్చిన, ఇంత మంచి, సీరియస్ సాహిత్య సభ జరగలేదు. ఇంత అనుభూతినీ, ఒకింత బాధనీ, ఆవేశాన్ని ఇచ్చిన ఈ సభ తెలుగు కవితా ప్రస్థానంలో ఓ వెల్తురు మలుపు. ఇది అతిశయోక్తి, వట్టి అంటారా? సరే… అలా అని పెద్ద బాధాలేదు.
1991, March 11
… మర్నాడు పొద్దున్నే మో ఫోన్ చేశారు. వెంటనే ఇంటికి రమ్మన్నారు. వెళ్ళాను. సంతోషంతో వెలిగిపోతున్నారాయన. తెగ మెచ్చుకున్నారు. “నీది photographic memory” అన్నారు. ఉపన్యాసాలు రికార్డ్ చేసుకునే సౌకర్యం లేని రోజులవి. కొన్ని పాయింట్లు మాత్రం గబగబా నోట్ చేసుకొని రిపోర్ట్ రాశాను…… (Taadi Prakash 97045 41559)
Share this Article