Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సినిమాల ‘నరుకుడు’ రోగానికి సెన్సార్ చికిత్స..! భోగితో స్టార్ట్..?!

November 15, 2026 by M S R

.

‘భోగి’… సెన్సార్ చిక్కుల్లో..! ఇవీ వార్తలు… తప్పు కాదు, అవసరమే… సెన్సార్ అనే ఓ సిస్టం ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం… సెన్సార్ బోర్డుల్లోని సభ్యులకూ సిగ్గూశరం, విజ్ఞత, వివేచన, బాధ్యత ఉన్నాయని నిరూపించుకోవాల్సిన అవసరం… కానీ ఆ ఒక్క సినిమాకేనా..? ఇదీ చర్చ… పోనీ, ఇక్కడి నుంచి స్టార్టయినా సంతోషమే కదానే సమర్థన…

భోగి… ఓ పీరియాడికల్ సినిమా… తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని ఓ గ్రామంలో…  1960 ప్రాంతంలో… పటేల్ వ్యవస్థ, భూస్వామ్య పెత్తందారీతనానికి వ్యతిరేకంగా సాగిన పోరాటం కథ అట… (పాత నిజాం ఏరియా)… తెలంగాణ నేపథ్యం, కథ, పాట, ఆట ఇప్పుడు ట్రెండ్ కాబట్టి అది ఎంచుకున్నారేమో… రస్టిక్, రగ్గడ్ లుక్ నయా హీరోయిజం కదా, హీరో శర్వానంద్ అలాగే ఉంటాడట…

Ads

సరే, ఆ పైత్యాల్ని పక్కన పెడితే… తెలంగాణ రాకముందు తెలంగాణతనాన్ని ఓమాదిరి కామెడీ, విలనిజానికి సింబల్‌గా చూపించింది తెలుగు సినిమా… కించపరచడం..! ఇప్పుడేమో తెలంగాణ కల్చర్ అనగానే మందు, మటన్ చూపిస్తున్నారు… ఇది ఇంకోరకం దరిద్రం… దీనికితోడు విపరీతమైన హింసను చూపించడం కొత్త ట్రెండ్… ఇది మరోరకం దరిద్రం… పైగా తెలంగాణ యాసను అత్యంత కృతకంగా పలికించడం మరో పైత్యం…

ఆమధ్య మనం ‘ముచ్చట’లో చెప్పుకున్నాం… రాప్తాడు దుర్మార్గం తరువాత… రాను రాను సౌత్ సినిమాల్లో తరుముడు, తురుముడు, నరుకుడు, కోసుడు, నెత్తురు పారించుడు, అవయవాలు, శవాల గుట్టలు మనుషులు… ప్రత్యేకించి పిల్లలు హింస పట్ల సెన్సిటివిటీని కోల్పోతున్న తీరు… మాస్ అంటే నెత్తురు, మాస్ అంటే ఓ రగ్గడ్ లుక్కు అనే పిచ్చి, తిక్క భ్రమల్లోకి సోకాల్డ్ తెలుగు హీరోలు ప్రవేశించారు… నిన్నా మొన్నటి ప్యారడైజ్, రణబాలి దాకా అంతే కదా… ప్యారడైజ్ మరీ ఘోరం… ఇప్పుడు భోగి… తెలుగు కథలు, తెలుగు సినిమాలు అంతకు మించి ఎదగలేవు కదా…

bhogi

చివరకు ఈ దరిద్రం ఎంత దాకా పాకిందంటే… 4 వేల కోట్ల పౌరాణికం రామాయణం సినిమాలో కూడా… యశ్ అనే స్టార్ హీరో ఇమేజ్ కోసం శవాలను గుట్టగా పోసి, దానిపై కూర్చుంటాడు… కుబేరుడి సైన్యంపై దాడి చేసి, శత్రువుల శవాల గుట్టనే తన తొలి సింహాసనంగా మార్చుకుని కూర్చునే సన్నివేశం… బోలెడు తెలుగు సినిమాల్లోనూ తెలుగు స్టార్లు చూపించిన సీన్లే అవి… హీరో అంటే ఓ మానవాతీత శక్తి కదా… వీళ్ల బొంద కేరక్టర్లు, వీళ్ల ఎలివేషన్లు…

నిజానికి దశాబ్దాలుగా… ఆకర్షణ, కామం, మోహాన్ని ప్రేమగా భ్రమింపచేసే నిర్వాకం చూపించేది సినిమా… రాను రాను ఆ తలతిక్కతనం ముదిరి, చిన్న వయస్సుల్లోనే సంభోగాలు, అబార్షన్ల దాకా ‘ఎదిగింది’ సమాజం… ఒక అమ్మాయి వెంట పడటం, ఆమె నిరాకరించినా వదలకపోవడం, ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను పట్టించుకోకపోవడం.. వీటన్నింటినీ ప్రేమ పేరుతో సమర్థించే క్షుద్ర కథనాలు చాలానే వచ్చాయి… వెంటపడటం, వేధించడం, కాదంటే నరికి పోగులు పెట్టడం… సొసైటీలో ఈ ధోరణికి కారణం సినిమాలే…

ఇప్పుడిక హింస వంతు… అబ్బే, సినిమాలు చూసి సొసైటీ ప్రభావితం కాదు, సొసైటీలో ఉన్నవే సినిమాల్లో చూపిస్తాం అని ఓ ఆర్జీవీ, ఓ యానిమల్ వంగా వంటి దర్శకులు నీతులతో సమర్థనకు దిగుతారు…

ఒకప్పుడు సినిమాల్లో విలన్ క్రూరత్వాన్ని చూపించడానికి హింస ఉండేది. ఇప్పుడు విలన్ కంటే హీరోనే ఎక్కువ క్రూరంగా కనిపిస్తున్నాడు. విలన్‌ను చంపడమే కాదు, ఎంత భయంకరంగా చంపాడన్నది కూడా హీరో ఇమేజ్‌లో భాగమైపోయింది. దర్శకుడి సృజనాత్మకత, హీరో సామర్థ్యం, కెమెరా పనితనం అన్నీ చివరకు ఎన్ని తలలు నరికారు, ఎంత రక్తం పారింది అనే లెక్కల్లోకి దిగజారిపోతున్నాయి.

bhogi

సో, ఎక్కడో ఓ చోట ‘నరుకుడు రోగానికి’ చికిత్స అవసరం… తమదైన మూర్ఖ భావజాలంలో మునిగి, సొసైటీని కూడా పొల్యూట్ చేసే హీరోలు- దర్శకుల తెలివితక్కువతనానికి తెరపడాలి… అవును, అది కనీసం భోగితోనైనా మొదలు కావాలి… రాప్తాడు సంఘటన తరువాత జనం, ప్రత్యేకించి సోషల్ మీడియా సినిమాల్లోని హింసను ‘అడ్డంగా నరికింది’… సెన్సార్ అంధత్వాన్ని దునుమాడింది…

దాంతో కాస్త సిగ్గు తెచ్చుకున్నట్టుంది… సర్టిఫికెట్ ఇవ్వకుండా రివైజ్ కమిటీకి పంపించినట్టుంది… ఇప్పటిదాకా అనుమతించిను హింస, నరుకుడు సీన్లే అంత ఓవర్, అంత అతిగా ఉంటున్నాయి కదా.., అదీ రిజెక్ట్ చేస్తోంది అంటే, ఇక భోగి యాక్షన్ సీన్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతూనే ఉంది… పాపం శర్వానంద్ నిన్నమొన్నటి దాకా కాస్త చూడబుల్ సినిమాలే చేశాడు, హఠాత్తుగా ఈ నరుకుడురోగం ఎందుకొచ్చిందో మరి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సినిమాల ‘నరుకుడు’ రోగానికి సెన్సార్ చికిత్స..! భోగితో స్టార్ట్..?!
  • ‘కుర్చీ’ విలువ – అధికారాంతమున చూడవలె అయ్యవారి అవస్థలు!
  • Never Lose Your Core Engineering Team… మనిషిని మించిన యంత్రం ఇంకా రాలేదు! 
  • మణిరత్నం ఏమైనా తక్కువా..? ఆ ‘రావణన్’ సినిమా మాటేమిటి మరి..!?
  • శత్రుచర్ల కన్నుమూత… మేరంగి జమీందారీ చరిత్రకు ఓ ముగింపు..?!
  • మైక్రోసాఫ్ట్‌కు ఏఐ షాక్… అతిగా ఆధారపడితే అంతే- జోహోకు జాక్‌పాట్!
  • ‘దొంగ నా కొడుకు’ నవ్వించలేదు… కానీ హీరోగా నిలబడ్డాడు!
  • షేక్ హసీనాను అప్పగిస్తాం సరే… కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి
  • గుమ్మడిని అపార్థం చేసుకున్న ఎస్వీ రంగారావు… ఎందుకో మరి..!
  • స్తంభించిన అమెరికా.. ఆకాశంలో విమానాలు, నేలపై గందరగోళం!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions