.
14 ఏళ్ల అమ్మాయి… ఇంటి దగ్గర దిగబెడతామని నమ్మబలికి ఆమెను తీసుకెళ్తున్నారు… మధ్యలో ఆపేసి ఒకడు ఆమె స్థనాలు గట్టిగా పట్టుకున్నాడు… మరొకడు ఆమె పైజామా బొందు తెంపేశాడు… ఇద్దరూ కలిసి ఓ కల్వర్టు కిందకు ఆమెను లాక్కెళ్తుంటే కేకలు వేసింది, అరిచింది…
ఈలోపు పరిసరాల్లో నుంచి పలువురు రావడంతో ఈ నిందితులు కంట్రీమేడ్ తుపాకీ చూపిస్తూ పారిపోయారు… ఇదీ కేసు… అలహాబాద్ హైకోర్టు ఇది అత్యాచార ప్రయత్నంగా పరిగణించలేమనే ఓ వివాదాస్పద తీర్పు ఇచ్చింది… ఈ వార్త రెండురోజులుగా ఇంగ్లిషు, ఇతర భాషల మీడియాలో వస్తోంది…
Ads
ఒక హైకోర్టు తీర్పును తప్పుపట్టే ధైర్యం చాలామందికి ఉండదు… అధికారంలో ఉన్న వాళ్లకు కూడా… కానీ ఇది మరీ ఇన్‌సెన్సిటివ్ తీర్పు కావడంతో ఏకంగా కేంద్ర మంత్రి వసుంధరాదేవి స్పందించింది… ‘ఖచ్చితంగా ఇది తప్పు, దీన్ని పునఃపరిశీలించండి, లేకపోతే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి’ అని పేర్కొంది…
రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ ‘ఇది చాలా అనుచితంగా ఉంది… వెంటనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి…’ అని కోరింది… బీజేపీ సభ్యురాలు సిటి పల్లవి ‘అసహజ లైంగిక సంబంధం కారణంగా తన భార్య మరణానికి కారణమైన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించిన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు గుర్తుందా? ఏమిటీ తీర్పులు? ’ అని ఎక్స్‌లో పోస్టు చేసింది…
మరో ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ స్పందిస్తూ… ‘సుప్రీంకోర్టు ఇలాంటి విషయాల్లో వెంటనే స్పందించాలి’ అని పోస్ట్ చేసింది… ప్రఖ్యాత న్యాయవాది కపిల్ సిబల్ ‘ఇలాంటి జడ్జిలు కనిపిస్తున్నారు, ఇక ఈ దేశాన్ని దేవుడే కాపాడాలి’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు… పలుచోట్ల లాయర్లు నేరుగా ఎక్స్‌లో వ్యతిరేక వ్యాఖ్యలు పోస్ట్ చేస్తున్నారు…
ఇది ఒక సందర్భం… ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్నిప్రమాదం జరిగి లెక్కలేనన్ని కరెన్సీ కట్టలు బయటపడితే సుప్రీం కొలీజియం తనను సింపుల్‌గా అదే అలహాబాద్ హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్ చేసింది… దీని మీద కూడా విమర్శలు వస్తున్నాయి… కపిల్ సిబల్ ‘జుడిషియల్ సిస్టంలో అవినీతి అత్యంత ప్రమాదకరం… జడ్జిల నియామకాల్లో పారదర్శకత అవసరం’ అన్నాడు…
ఇక్కడ మరో ప్రశ్న తలెత్తుతోంది… న్యాయ వ్యవస్థ వీటన్నింటికీ అతీతమా..? కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు ప్రవేశించలేవు..? రాజకీయం, అధికార యంత్రాంగం, మీడియా ఎట్సెట్రా అన్ని వ్యవస్థలూ అవినీతిమయం అవుతున్నప్పుడు, జుడిషియల్ సిస్టం కూడా మినహాయింపు కాదనే సందర్భాలు వస్తున్నప్పుడు… సుప్రీంకోర్టు ఇంత సాఫ్ట్ ధోరణిని ఎందుకు ప్రదర్శిస్తోంది..?
అలహాబాద్ హైకోర్టు జడ్జిల మీద వస్తున్న ఈ విమర్శలపై సుప్రీంకోర్టు ఇంకెలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది…!
Share this Article