అయ్యా ఎస్ లు… ఐ.పి.ఎస్.లు…
ఐఏఎస్ లు.. ఐపీఎస్ లు..ప్రభుత్వానికి..ప్రజలకు వారధిగా ఉండాల్సిన వారు..ప్రజా సంక్షేమ పధకాల రూపకర్తలు..అమలు పర్యవేక్షణ అధికారులు…ఇవన్ని పుస్తకాల్లో మాత్రమే…పాలకుల ప్రాపకానికి పాకులాడే రోజులు వచ్చాయి…కనీస విధ్యుక్త ధర్మాలను విస్మరించి సాగిలపడుతున్నారా అని అనిపిస్తోంది. ఐఎఎస్ లు అంటే అయ్యా ఎస్ అనడానికి..ఐ.పి.ఎస్.లు అంటే…పాలకులకు పి.ఎస్ లుగా వ్యవహరిస్తున్నారా అనే చర్చ తీవ్రంగా నడుస్తోంది.
Ads
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కొందరు అధికారుల వ్యవహార శైలి ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. 1990 ల్లో ఐ.ఎ.ఎస్.గా చేరిన ఆ అధికారిణి కలెక్టర్ గా ఉమ్మడి రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత పది పదిహేనేళ్ళకు ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వచ్చేసరికి చక్రం తిప్పడం ప్రారంభించి 2009 లో వెలుగు చూసిన పెద్ద కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా నిలిచి, కోర్టు మెట్లేక్కారు. తరవాత రాష్ట్ర విభజన తరవాత కీలక శాఖల్లో పనిచేసి ఏపిలో ముఖ్యనేతల కనుసన్నల్లో మెలిగారు. కావలసినంత అపప్రధ మూట కట్టుకున్నారు. ప్రజాధనం రూ. 20 లక్షలు వెచ్చించి రైల్వేలో ఒక మామూలు ఇంజనీరుగా పనిచేసి, రిటరైన తన తండ్రి విగ్రహం పెట్టించి, ఆయన పేరిట పార్క్ కట్టించెసింది. తీరా ప్రభుత్వం మారాక పోస్టింగ్ కోసం ప్రదక్షిణాలు చేసింది.
ఇంకో అధికారిదో విచిత్ర మనస్తత్వం..ఒక తెలుగు సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర నేను మోనార్క్ ని..టైపు..ప్రతి చర్య వివాదాస్పదమే..2019 నుంచి కొన్నాళ్ళు ఢిల్లీ లో కొలువు వెలగబెట్టి, ఆక్కడ రాష్ట్రానికి తెచ్చిన పేరు చూసి ప్రభుత్వమే వెనక్కి పిలిపించి, విద్యాశాఖ బాధ్యతలు అప్పగిస్తే, సార్ స్కూళ్ళ తనిఖిల పేరిట తనకు కావాల్సిన మెనూ ముందుగా పంపి, అవి లేకుంటే వాళ్ళ మీద రంకెలు వేసి నానా రచ్చ, రచ్చ చేశాడు. తీరా ప్రభుత్వం మారాక పోస్టింగ్, ముఖ్యమంత్రి దర్శనం దొరక్క, స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేశాడు. ప్రభుత్వం అది ఆమోదించకపోయేసరికి, దాన్ని వెనక్కు తీసుకోవాలని ఆరాటపడ్డాడు..
తెలంగాణలో బహిరంగ సభా వేదిక మీదే ముఖ్యమంత్రికి సాష్టాంగ నమస్కారం చేసి అందరికి ఆదర్శంగా నిలిచి, ఆ తర్వాత ప్రజాప్రతినిధిగా కోటా సంపాదించిన ఐ.ఎ.ఎస్. కధ మనకు తెల్సిందే. ఈ జాడ్యాలు గతంలోనూ ఉన్నవే..కాకపోతే ప్రభుత్వ అధినేతల కళ్ళలో పడేందుకు వారికి ఇష్టమైన కార్యక్రమాలు చేసేవారు. 2000లో అప్పటి కరీంనగర్
కలెక్టర్ కు.ని.శస్త్ర చికిత్సలను విపరీతంగా ప్రోత్సహించేవారు. ఈ టార్గెట్లు చేరేందుకు వృద్ధులను సైతం బల్ల ఎక్కించేవారు. ఇతర జిల్లాల్లొ వివిధ ప్రభుత్వ కార్యక్రమాలైన ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, వన మహొత్సవం వంటి ఎదొ ఒక ప్రజాహిత కార్యక్రమాన్ని అజెండాగా పెట్టుకుని వెళ్ళేవారు. కానీ ఇప్పుడు అలాక్కాదు. నెతల కళ్ళల్లో ఆనందం చూడాలి. మన ప్రయోజనాలు నెరవేరాలి. ఇదే లక్ష్యంగా సాగిపోతున్నారు.
ఇంకో అధికారిణి ప్రభుత్వంలో తానే సర్వం అయి, హేలికాప్టర్లో తిరిగి పనులు చక్కబెట్టిన విషయం మరపురానిది. కర్ణాటకలో కూడా తాను ఉండే బంగ్లా రూపురేఖలను ప్రజాధనంతో సమూలంగా మార్చిన ఘనత కూడా ఓ ఐ.ఎ.ఎస్.దే. అక్కడే ఇద్దరు అధికారులు పరస్పరం అహంకారాలకు పోయి పొలీసు, కోర్టు కేసుల వరకు వెళ్ళిన సంగతిని మర్చిపోలేము.
ఇంకా శిక్షణలో ఉండగానే పూజా ఖేద్కర్ వైభోగం రచ్చకెక్కి యుపీఎస్సి చైర్మన్ రాజీనామాకు దారి తీసిన విషయం తెలిసిందే. చివరకు కేంద్రం ఆమె అభ్యర్ధిత్వాన్నే రద్దు చేసింది. ఎందరో ఐఏఎస్ లు సేవ చేసిన తితిదే లో ఐదేళ్ళు అప్రతిహతంగా చక్రం తిప్పిన అధర్ముడు కనీసం ఐఎఎస్ కూడా కాకపోవడం శ్రీనివాసుడి భక్తులు చేసుకున్న దురదృష్టం.
ఇక ఐపిఎస్ ల విషయం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బాగుంటుంది. అధికారంలో ఉన్న వారికి పి.ఎస్.లుగా మారిపోతున్నారనేది కాదనలేని వాస్తవం.
ఆంధ్రలో జూన్ నుంచి దాదాపు 16 మంది ఐపీఎస్ లు పోస్టింగ్ లు లేకుండా ఉన్నారు. వీరిలో ఒక నటి కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న ముగ్గురిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతకుముందు వీరందర్నీ డిజిపి కార్యాలయంలో రోజు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. వారు ఆ పని చేయకపోవడంతో మళ్ళీ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు డిజిపి కార్యాలయంలో ఉండాలని స్పష్టం చేసింది. ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే వీరందరికీ ఇంతకాలం పూర్తి జీతాలుగా ప్రజా ధనం చెల్లించాల్సిందే కదా.
తెలంగాణలో ఇటీవల పోస్టింగ్ లు పొందిన ఐ.పి.ఎస్.లు సొంత దుకాణాలు తెరవడం, ప్రతి పనికి ఒక రేట్ పెట్టడం, కొందరు విల్లాలు, మరికొందరు కార్లు ఇలా కానుకలు రూపంలో కోరడం తెల్సిందే. ఉన్నతాధికారులు కొందిరికి ఛార్జి మెమోలు ఇచ్చారు, సరే. చివరకు ముఖ్యమంత్రులు సైతం వీరి పనితీరు పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా అధికార వ్యవస్థలో మార్పులు రావడం లేదు.
కానీ ఇలా ఎంతకాలం…ఇంతటి బాధ్యతాయుతమైన కొలువుల్లో ఉన్నవారు తప్పులు చేస్తే, గీత దాటితే కఠిన చర్యలకు సరైన వ్యవస్థలే లేవా. ఉన్నవి చేష్టలు ఉడిగి దిక్కులు చూస్తున్నాయా. పరిపాలనలో సంస్కరణలు తేలేమా…… (వునికిలి హరగోపాలరాజు)
Share this Article