.
Mohammed Rafee ….. నా వెనకాల ఎందుకు నిలబడ్డారు? – ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు క్లాస్
“ఇది కాదు పెద్దాయన రోశయ్య గారికి నివాళులు అర్పించడం అంటే! నేను మాట్లాడుతున్నప్పుడు ఇలా నా వెనక నిలబడి మీరు ఫోటోలు దిగడం, ఆ ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీయడం, వేదిక మీద వున్న అతిధులు పక్కనున్న వారితో మాట్లాడుకోవడం, ఇదేనా మనం రోశయ్య గారిని గౌరవించుకునే విధానం అంటూ బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు సూటిగానే క్లాస్ తీసుకున్నారు.
Ads
శుక్రవారం రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రోశయ్య గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చాగంటి కోటేశ్వరరావును ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఘనంగా సత్కరించారు.
సత్కరించే సమయంలో వేదికపై వున్న అతిధులంతా కలిసి ఆయన వెనుక, పక్కన వరసగా నిలబడి నిర్వాహకులు సూచన మేరకు సత్కరించడం సంప్రదాయం! ఫొటోలో చూడొచ్చు!
అనంతరం ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా వెనుక చాలామంది నిలబడి ఫోటోలు తీసుకోవడం, వేదిక ఫై అంతమంది ఉండి ఎవరికి వారు మాట్లాడుకుంటూ ఉండటం, ఫోటోగ్రాఫర్లతో పాటు ప్రేక్షకుల్లో చాలామంది నిలబడి ఫోటోలు వీడియో తీయడం ఆయనకు నచ్చలేదు!
“దయచేసి నా వెనక నిలబడకండి, నేను మాట్లాడగలను, నాకేం భయం లేదు” అంటూ సున్నితంగా తనదైన శైలిలో చెప్పారు! ఇది కాదు రోశయ్య గారికి ఇచ్చే నివాళి అన్నారు. అందరూ వెళ్లి ప్రేక్షకుల్లో కూర్చోవాలని కోరారు.
రోశయ్య గారి గొప్పతనం గురించి ఆయన నిరాడంబరత గురించి చెబుతూనే అక్కడ నిలబడిన వారికి, ఫోటోలు దిగుతున్న వారికి చుర్రుమని చురకలు అంటించారు. దాదాపు 50 మందికి పైగా స్టేజి పైనే కనిపించారు. ఫోటోలకు పోటీపడ్డారు! (గతంలో దత్తాత్రేయ అలయ్ బలయ్‌లో గరికపాటి కూడా ఇలాగే అసహనం వ్యక్తం చేయడం గుర్తొచ్చింది)
అభిమానం ఉండాల్సిందే! ఫోటోలు తీసుకోవాలని, వాటిని మిత్రులకు షేర్ చేసుకోవాలని ఉండటం సహజమే! కానీ దేనికైనా సందర్భం సముచితం! ఏ టైమ్ లో ఏం చేయాలో అదే చేయాలి! అభిమానులు ఫోటోలు తీసుకోవడానికి ఒక టైమ్ ఉంటుంది! అప్పుడు సద్వినియోగం చేసుకోవాలి! అంతే కానీ, వేదిక ఫై ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఫొటోలే లక్ష్యంగా ఉంటే ఇలాంటి మాటలు పడక తప్పదు!
సంయమనం, సందర్భం తెలిసినోడు ఆయా రంగాల్లో రాణిస్తారు! చాగంటి కోటేశ్వరరావు కూడా అదే చెప్పారు. లోకరీతి ఎలా ఉండాలో, క్రమశిక్షణ జీవితం, సభ్యత సంస్కారం, సంస్కృతీ సంప్రదాయం ఎంత అవసరమో భక్తిలో రంగరించి చెప్పే ఆయన దగ్గరే అలా చేస్తే ఇలాగే ఉంటుంది! - డా. మహ్మద్ రఫీ
(నోట్ : చాగంటి గారిని అతిధులు సత్కరిస్తున్న ఈ ఫొటోకు నా మ్యాటర్ కు సంబంధం లేదు! ఆ ఫోటో నేను తీయలేదు)
Share this Article