.
అనేక కార్పొరేషన్లు… కులాలవారీగా కార్పొరేషన్లు… నిజం చెప్పాలంటే అజాగళ స్తనాలు… వాటితో ఏమీ ఉపయోగం ఉండదు… సరే, రాజకీయ అవసరాల కోసం ఉపయోగపడతాయి… చూశారా, మీ కులానికి న్యాయం చేశాను అని చెప్పడానికి…
నాడు జగన్ చేసిందే నేడు చంద్రబాబూ చేస్తున్నాడు… వోకే, ఆ చర్చలోకి ఇప్పుడెందుకులే గానీ… ఒక పదవికి ఎంపిక కాస్త ఇంట్రస్టింగ్ అనిపించింది… రాష్ట్ర నైతిక విలువలు, ప్రమాణాల సలహాదారుగా కేబినెట్ ర్యాంకులో చాగంటి కోటేశ్వరరావును నియమించింది చంద్రబాబు ప్రభుత్వం…
Ads
ఒకకోణంలో తను సాగిస్తున్న ధర్మవ్యాప్తి, ప్రవచనాలకు ఓ గుర్తింపు… అక్కడి వరకూ సంతోషం… కానీ వర్తమాన ప్రభుత్వ వ్యవస్థల్లో సలహాదారులు చేసేదేమీ ఉండదు… పైగా అధికారిక బంధనాలు, పరిమితులు ఉంటాయి… కావచ్చు, ప్రోటోకాల్, జీతభత్యాలు ఎట్సెట్రా సమకూరతాయి…
కానీ, నాకు తెలిసి అలాంటి హంగుల నుంచి చాగంటి ఎప్పుడో దూరమయ్యాడు… తనెప్పుడూ అవి కోరుకోలేదు… అసలు పనంటూ లేని ఆ సలహాల పనిలో చేరి జీతం తీసుకుంటాడనీ అనుకోలేం… ఇలా అనుకోవడానికి ఓ ప్రాతిపదిక కూడా ఉంది…
అదేమిటంటే..? ఇదే చంద్రబాబు ఇదే చాగంటిని 2016లో ఇదే కేబినెట్ హోదాతో ఇదే సలహాదారుడు పోస్టును ఇచ్చింది… కాదు, ప్రకటించింది… ఆయన తీసుకోలేదు, వినమ్రంగానే వద్దన్నాడు… అది తన పరిణతి… చెప్పుకున్నాం కదా, ఇలాంటి వాటికి ఆయన అతీతం అయిపోయాడు…
ప్రవచనాలకు, ధర్మ ప్రసంగాలకు ఆయనకు వచ్చేది ఆయనకు చాలు… నిరాడంబరుడే కాబట్టి పటాటోపాలు, ఆడంబరాలు, అట్టహాసాలు, మందీమార్బలం గట్రా ఆయన ఆశించడు… అందుకే ఆ పోస్టు వద్దన్నాడు… చేరలేదు…
తరువాత 2023లో అప్పటి సీఎం జగన్ తనను తిరుమల తిరుపతి దేవస్థానం సలహాదారుడిగా ప్రకటించాడు… నిజానికి తను చేస్తున్న పనికి అది సరైన పోస్టే… అస్తవ్యస్తం, అరాచకానికి మారుపేరుగా మారిన తిరుమల పాలనలో తను చేయగలిగేది ఏమీ ఉండదు, తన మాటకు చెలామణీ కూడా ఉండదు… బహుశా ఆ భావనే కావచ్చు, ఇంకేదైనా కారణం కావచ్చు… దాన్ని కూడా ఆయన తీసుకోలేదు…
ఏ మకిలీ అంటకుండా తన స్వచ్ఛతను తాను కాపాడుకున్నాడు… ఆ పోస్టుల తిరస్కరణతో తన విలువను మరింత పెంచుకున్నాడు తను… ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ సలహాదారు పదవి దరిచేరింది… తీసుకుంటాడని అనుకోలేం… ఏమో, మనసు మార్చుకుని తను ఆ పదవిని తీసుకుంటేనే ఆశ్చర్యం… తను రాజకీయ నాయకుడు కాదు, ఏ పార్టీకి సానుభూతిపరుడు కూడా కాదు… సో, తనకు రాజకీయ పునరావాసాలూ, కిరీటాలూ, ఆర్భాటాలూ, అధికారిక అలంకరణలూ అక్కర్లేదు…
నిజానికి తను ఏ రాజకీయ రంగును, ఏ వాసననూ తనకు అంటకుండా చూసుకోవడమే తనకు మేలు… గతంలో టీడీపీ, వైసీపీ రంగులు అంటకుండా జాగ్రత్తపడిన విజ్ఞత తనది… ఐనా నైతిక ప్రమాణాలు, విలువ ప్రచారానికి తనకు ప్రభుత్వ పోస్టులు కావాలా ఏం..? తన ప్రవచనాలు చాలవా…? చేస్తున్న పనీ అదే కదా..!!
అవునూ… గరికపాటికి ఇస్తే తీసుకుంటాడా..? ఇది ఊహాజనితమైన ప్రశ్న… వ్యక్తులు వేరు, ఇష్టాయిష్టాలు వేరు… తత్వాలు వేరు… ఊహించడం కష్టం..!!
Share this Article