భారతదేశ చరిత్రలో మౌర్య సామ్రాజ్యానికి చాలా ప్రాశస్త్యం ఉంది . ముఖ్యంగా చంద్రగుప్తుడు , అశోకుడు . యన్టీఆరుకు ఈ రెండు పాత్రల మీద చాలా మక్కువ ఉందని అప్పట్లో చెపుతుండేవారు . రెండు పాత్రలూ ఆయనే వేసారు , తీసారు . చంద్రగుప్తుని చరిత్రలో కీలక పాత్రధారి చాణక్యుడు . నందులు ఆయన్ని అవమానించి ఉండకపోతే , చంద్రగుప్తుడు రంగంలోకి వచ్చేవాడే కాదేమో ! అలా చాణక్యుడే ముఖ్యుడు . అప్పట్లో గుమ్మడి పేరు , ముక్కామల పేరు అనుకుంటూ ఉండేవారు .
కూడికలు , తీసివేతలు తర్వాత ఆ పాత్ర అక్కినేనిని వరించింది . 1977 లో వచ్చిన ఈ చాణక్య చంద్రగుప్త సినిమాలో మరో ప్రధాన పాత్ర అలెగ్జాండర్ . శివాజీ గణేశన్ ఎంపిక సెన్సేషనల్ . ముగ్గురు ఉధ్ధండులు నటించిన సినిమా . చంద్రగుప్తుని చరిత్ర 2300 సంవత్సరాల కిందది . చాలా చాలా కధలు ప్రచారంలో ఉన్నాయి . (ఈ సినిమాలో చాణుక్యుడిగా అక్కినేని నటన ఎక్కువ ఆకట్టుకుంటుంది… ఎన్టీయార్, శివాజీ గణేశన్ సరేసరి…)
ఈ సినిమా రిలీజ్ సమయంలో అలెగ్జాండర్ చంద్రగుప్తుని కాలం కాదని , వారిద్దరు అసలు తారసపడలేదని , యుధ్ధం జరగలేదని చర్చోపచర్చలు జరిగాయి . అయితే చాణక్యుని అవమానం , ముర , రాక్షస మంత్రి , చంద్రగుప్తుడిని చాణక్యుడు మగధ సింహాసనం మీద కూర్చోపెట్టడం వరకు భిన్నమైన చరిత్రలు లేవు . ఆర్ఆర్ఆర్‌లో అల్లూరి, కొమురం భీమ్ కలయిక మీద, ఆ కథ మీద… సైరా క్లైమాక్స్… అల్లూరి ఆహార్యం… అనేక అంశాలకు సంబంధించి ఇలా తెలుగు సినిమాల్లో అసలు కథల్ని పక్కదోవ పట్టించడం ఆనాటి నుంచీ ఉన్నదే…
Ads
తను ప్రేమించిన కన్య విషబాణమని చాణుక్యుడు చెప్పడం, ప్రేమమత్తులో ఉన్న చంద్రగుప్తుడు సహించక చాణుక్యుడిని తూలనాడటం, చివరకు చాణుక్యుడు విషబాణమని నిరూపించిన సీన్ బాగా పండింది… (ఈ కథకు క్రియేటివ్ ఫ్రీడం బాగా తీసుకున్నట్టుంది…)
ముగ్గురు ఉధ్ధండుల స్థాయిలో రికార్డులు బ్రేక్ కాలేదు . గొప్ప హిస్టారికల్ సినిమా . పింగళి కాకుండా ఏ మోదుకురి జాన్సన్ వంటి వాడయితే బాగుండేదేమో ! పెండ్యాల సంగీత దర్శకత్వంలో పాటలు బాగుంటాయి . పాటలను అన్నీ సి నారాయణరెడ్డే వ్రాసారు . చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో , ఎవరో ఆ చంద్రుడెవరో ఆ వీర చంద్రుడు ఎవరో , ఇదే తొలిరేయి పాటలు శ్రావ్యంగా ఉంటాయి .
ఇతర పాత్రలలో సత్యనారాయణ , ప్రభాకరరెడ్డి , ముక్కామల , రాజనాల , రాజబాబు , పద్మనాభం , జయప్రద , మంజుల , యస్ వరలక్ష్మి , జయమాలిని , హలం ప్రభృతులు నటించారు . మా గుంటూరులో నాజ్ థియేటర్లో చూసా . సినిమా యూట్యూబులో ఉంది . చూడనివారు చూడవచ్చు .
ఈ సందర్భంగా మిత్రులకు ఓ చిన్న సమాచారం . సామ్రాట్ అశోక్ అనే ఓ సీరియల్ ప్రతి ఆదివారం సాయంత్రం ఈ టివిలో వస్తుంది . చాలా బాగుంటుంది . చాణక్యుడు ఎలా అయితే చంద్రగుప్తుడిని సింహాసనం ఎక్కిస్తాడో , అలాగే అశోకుడిని కూడా సింహాసనం మీద కూర్చోబెట్టే ప్రయత్నం ఉంటుంది ఈ సీరియల్లో . చూస్తుండకపోతే వచ్చే ఆదివారం మొదలుపెట్టండి . సాయంత్రం అయిదు గంటలకు వస్తుంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)
ఈ పోస్టు కామెంట్లలో ఇది ఇంట్రస్టింగ్ అనిపించింది… చిరునవ్వులతో తొలకరిలో” పాట ఈ చిత్రానికి ముందే హిందీలో వచ్చిన ధర్మాత్మ చిత్రంలోని “క్యా ఖూబ్ లగతీ హో” పాటకు కాపీ. నవనందులని బఫూన్స్ లాగా చూపించడం పెద్ద కధనలోపం. ఆ తప్పు షూటింగ్ సమయంలోనే ఏయన్ఆర్ ఎత్తి చూపినా ఎన్‌టీఆర్ సరిదిద్దుకోలేదట…. నిజమే, ఎన్టీయార్ చాణక్య వేషం వేసి, ఇంకెవరినైనా చంద్రగుప్తుడిగా తీసుకుంటే… కథనం ఇంకాస్త గ్రిప్పింగుగా ఉండి ఉంటే సినిమా ఓ రేంజులో హిట్టయ్యేది…
Share this Article