.
ఒకప్పటి సాగునీటి మంత్రి, కాళేశ్వరం అక్రమాలు, వైఫల్యాలకు సూత్రధారి, పాత్రధారి… బనకచర్ల మీద మాట్లాడుతున్న మాటలు వింటే ఆశ్చర్యం కలుగుతోంది… కేటీయార్, కేసీయార్ అంటే వోకే, కానీ చివరకు హరీష్ రావు కూడా అంతగా దిగజారాలా..?
ప్రత్యేకించి బనకచర్ల మీద…! ఎంతసేపూ పొలిటికల్ కూతలు తప్ప… తెలంగాణకు అక్కరకొచ్చే మాటలు కావు… చేతలు కావు… అసలే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మామాఅల్లుళ్ల నిర్వాకం అంతా ఇంతా కాదు… నమ్మిన తెలంగాణ జనాన్ని నిలువునా ముంచారు…
Ads
ఇప్పుడేమో… బనకచర్లపై రేవంత్ సంతకాలు పెట్టాడు అంటాడు… ఫాఫం, కవిత దాడులతో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉన్నట్టుంది…
నిజానికి రేవంత్ రెడ్డికి బనకచర్ల ఓ అగ్నిపరీక్ష… అదెలా డీల్ చేస్తాడో చూడాలి… తనేమీ ఎక్కడా సంతకాలు చేయలేదు… అంగీకరించలేదు ఆ పిచ్చి ఏటీఎం ప్రాజెక్టుకు… ఐతే తన మీద చంద్రబాబు శిష్యుడు అనే ముద్ర ఉంది కదా… దాన్ని బ్రేక్ చేసుకోవాలిప్పుడు… ఎందుకంటే..? చంద్రబాబు ప్రతి రక్తకణం నిండా తెలంగాణ వ్యతిరేకత కాబట్టి…
రేవంత్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా పోతే రాజకీయంగా ఉండడు కాబట్టి… చంద్రబాబుకు సహకరిస్తే తనకు తానే ఆత్మహత్య చేసుకున్నట్టు కాబట్టి… అసలు చంద్రబాబు మాత్రమే కాదు… (ఇప్పుడు అర్జెంటుగా మళ్లీ టీటీడీపీ పునరుద్ధరించి, తెలంగాణను ఉద్దరిస్తాడట సోకాల్డ్ ఆంధ్రాబాబు…) రేవంత్ రెడ్డి ఫరమ్‌గా నిలబడాల్సిన సిట్యుయేషన్ ఇది…
ఏమాత్రం బనకచర్ల మీద పట్టు సడలినా… అది తనకుమాలిన ధర్మం అవుతుంది… ఎస్, బనకచర్ల అనే కుట్ర మీద తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ రకరకాల కోణాల్లో చిక్కుముళ్లు వేసి పెట్టింది చంద్రబాబు కమీషన్ల ప్రాజెక్టు మీద… ఆ చిత్తశుద్ధి మీద సందేహం లేదు ఎవరికీ…, కానీ..?
ఆ ఆంధ్రాబాబు ఊరుకోడు… కాళేశ్వరం పేరిట కేసీయార్ ఎంత ఘోరంగా దండుకున్నాడో అదుగో అలాంటి మరో కాళేశ్వరం కావాాలి తనకు…. (సారీ, తన వయస్సు, కెరీర్ గట్రా ఇక్కడ చెప్పకండి… చంద్రబాబు పక్కా మార్వాడీ బ్యాచ్, వంద రెట్లు ఎక్కువే…)
తెలంగాణలో పురుగు మెసులుతుంది అనే ఓ విశేషవాక్యం ఉంది… అంటే చచ్చిపోయింది అనుకున్న పురుగు మళ్లీ కదులుతోంది అని… ఎస్, బనకచర్ల మీద చంద్రబాబు కక్కుర్తి, సంపాదన ఆశలు చచ్చిపోలేదు… ఎస్, కేంద్ర సాగునీటి సంస్థలు, చివరకు తన కోటరీ వ్యతిరేకిస్తున్నా సరే… బనకచర్ల డీపీఆర్ కోసం రీసెంటుగా 9 కోట్ల ఖర్చుకు టెండర్లు పిలిచాడు…
ఒకవైపు తనే ఈనాడు, ఆంధ్రజ్యోతి అనబడే తన సొంత పత్రికల్లో పిచ్చి కథనాలు రాయిస్తాడు… అదుగో, బనకచర్లను బొందపెట్టినట్టే… లేదు, లేదు, మరో ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నాడు అని…. చేసేది మాత్రం తెలంగాణ ప్రయోజనాలను బొందపెట్టడం..!
అరె, అవి వ్యర్థ జలాలు అంటాడు చంద్రబాబు… అతి తెలివి… వ్యర్థ జలాలు అనే పదమే సాగునీటి పరిభాషలో లేదు… ప్రపంచంలో ఈ వ్యర్థ పదాలు, ఈ వ్యర్థ ఆలోచనలు, ఈ వ్యర్థ ప్రతిపాదనలతో ఇప్పటివరకూ 60 – 80 వేల కోట్ల ప్రాజెక్టు చేపట్టిన మూర్ఖనేత మరొకడు లేడు… (అది ఇంకెంత మేరకు పెరిగి, ఇప్పటికే పీకల్తోతు అప్పుల్లో కూరుకున్న ఏపీ ఖజానాను ఇంకెంత దివాలా తీసి, ఇంకెంత హెరిటేజ్‌ను పెంచుతుందో అంచనా వేయడం కష్టం…)
ఎస్, తెలంగాణ వ్యతిరేకతలో జగన్ తాత… చంద్రబాబు ముత్తాత… బీజేపీ తన అవసరం కోసం చంద్రబాబుకు ఊడిగం చేయవచ్చుగాక… రేవంత్ రెడ్డి తన పట్టు సడలించకూడదు… ఆల్రెడీ కేంద్ర జలమంత్రి ఓ పిచ్చి లేఖ రాశాడు రేవంత్ రెడ్డికి…
బనకచర్లపై ప్రిలిమినరీ ఫీజిబులిటీ రిపోర్ట్ ఇచ్చాడు చంద్రబాబు… బేసిన్‌లోని అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటాం, తెలంగాణ ఆల్రెడీ వ్యక్తం చేసిన అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాం అని… అబ్సర్డ్…
మోడీ ప్రభుత్వం ఈ జలమంత్రి పట్ల సిగ్గుపడాలి… వ్యర్థజలాల మీద ఆధారపడిన ఓ కమీషన్ల ప్రాజెక్టు మీద ఇతర రాష్ట్రాలకు లేఖ రాయడమా..? ఆల్రెడీ కేంద్ర జలసంస్థలు కొట్టిపారేసిన ప్రాజెక్టు మీద పరిశీలనా..? ఎవడో సీఆర్ పాటిల్ అట…
నిజానికి బనకచర్ల పురుగు మెసులుతున్నది చంద్రబాబు బుర్రలో… మోడీ మీద ప్రెజర్ పెంచుతున్నాడు… అదీ ఈ పైత్యానికి కారణం… ఇక్కడే, ఇప్పుడే రేవంత్ రెడ్డి నిజమైన తెలంగాణ పాలకుడిగా విజ్ఞతను, పరిణతిని ప్రదర్శించాల్సింది… ఇప్పటివరకూ వేస్తున్న అడుగులు గుడ్… అస్సలు ఈల్డ్ కావద్దు, అయితే తన పొలిటికల్ కెరీర్‌కే ప్రమాదం… ఎందుకంటే..?
ఇది గోదావరికి సంబంధించిన అంశం మాత్రమే కాదు… అసలే కృష్ణా జలాల మీద ఆధారపడిన తెలంగాణ ఆర్థిక, జీవన వ్యవస్థకు గొడ్డలిపెట్టు… చంద్రబాబుదేం పోయింది..? బనకచర్ల అంటాడు, పోలవరం అంటాడు… కృష్ణా కింద ఆంధ్రా ఆయకట్టును రక్షించుకుంటాడు… దెబ్బ తినేది తెలంగాణ రైతు… ఆంధ్రాబాబు స్వార్థం తెలంగాణ రైతు మెడకు ఉరి…
ఎందుకంటే..? ఎప్పుడైతే గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు లింక్ చేస్తామో, ఎంత నీరు వాడుకుంటే… ఆమేరకు ఎగువ రాష్ట్రాలకు కృష్టాలో వాటాలు ఇవ్వాలి… చంద్రబాబు తెలంగాణ వ్యతిరేక బనకచర్లకు గనుక మోడీ తన పిచ్చి సమీకరణాలతో గ్రీన్ సిగ్నల్ గనుక ఇస్తే… తెలంగాణలో బీజేపీ పొలిటికల్‌గా మటాష్… పైగా మహారాష్ట్రకు, కర్నాటకకు కృష్ణాల జలాల్లో ఇంకా 112 ప్లస్ 72 టీఎంసీలు వదులుకోవాలి…
అసలే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఫలితంగా ఆలమట్టి ఎత్తు పెరుగుతోంది… దీనికితోడు 184 టీఎంసీల నీటిని ఎగువ రాష్ట్రాలకు అప్పగించే దుస్థితే వస్తే…. తెలంగాణ ఖచ్చితంగా ఎడారే… బీజేపీ నేతలకు ఎలాగూ సోయి లేదు, సబ్జెక్టు లేదు… ఏపీలో ఏ పునాదీ లేకపోయినా, కాస్తో కూస్తో పునాది ఉన్న తెలంగాణలోనూ సూసైడల్ నిర్లిప్తతను ప్రదర్శిస్తోంది…
బీఆర్ఎస్… తెలంగాణకు చేయాల్సిన ద్రోహమంతా చేసి… ఇప్పుడు ప్రతి అంశాన్ని రేవంత్ రెడ్డి మెడకు చుట్టాలనే ఓ విఫల పొలిటికల్ విమర్శలు… హరీష్ రావు దగ్గరకు వద్దాం… తను ఒకప్పుడు సాగునీటి మంత్రి ఫాఫం… తను చేయాల్సినంత ద్రోహం ఆల్రెడీ కన్నతల్లి వంటి తెలంగాణకు చేసేశాడు… ఇంకా ఇప్పుడు…
రేవంత్ రెడ్డి బనకచర్లకు సహకరిస్తున్నాడు అనే కూతలకు దిగాడు… తనను తాను ఎందుకు దిగజార్చుకుంటున్నాడో ఫాఫం… ఎస్, రేవంత్ ప్రభుత్వం బనకచర్ల మీద గానీ, ఆలమట్టి మీద గానీ పోరాడుతూనే ఉంది…
ఇదే హరీష్ రావులాగా…. జగన్ రాయలసీమ లిఫ్ట్ కడుతున్నా, పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు చేస్తున్నా… చేపల పులుసు తిని కేసీయార్ రోజాకు హామీ ఇచ్చినందుకు గాను కళ్లప్పగించి చూస్తూ కూర్చోలేదు కదా… కేంద్ర జలమంత్రి తన మీద చంద్రబాబు చేస్తున్న దుర్మార్గపు ఒత్తిడికి తలవంచి ఏవో లేఖలు రాస్తున్నాడు… పురుగు మెసులుతున్నట్టు చంద్రబాబు ఆ బనకచర్లను ముందుకు తీసుకొస్తూనే ఉన్నాడు…
హరీష్ రావుకు ఏమాత్రం తెలంగాణ ప్రయోజనాల మీద సోయి ఉన్నా సరే…. మరీ కేసీయార్, కేటీయార్‌లాగా గాకుండా… నిర్మాణాత్మకంగా ఉండాలి… అది చేతకావడం లేదు తనకు… ‘‘రేవంత్ రెడ్డీ, నీకు కాంట్రాక్టుల్లో వాటా ఉందా? నీకేమైనా కమీషన్లు వస్తున్నాయా? ఎందుకు మౌనంగా ఉంటున్నావు…?’’ అనడుగుతున్నాడు… ప్రతిదీ కాళేశ్వరం బాపతు అడ్డగోలు కమీషన్ల భండారమే అనుకుంటున్నట్టున్నాడు ఇంకా…
అవును, నిజమే… 2, సెప్టెంబర్ 17, 2025 నాడు కర్ణాటక ప్రభుత్వం కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది… 80, 100, 243 మొత్తంగా 423 టీఎంసీలు ఏపీ తీసుకువెళ్తే మేం 112 టీఎంసీల నీళ్లు కృష్ణాలో ఆపుకుంటాం అని రాసింది…
బనకచర్ల తదితర ఆంధ్రాబాబు కుటిల ప్రాజెక్టులు గనుక కార్యరూపం దాలిస్తే… 423 టీఎంసీల గోదావరి జలాలు ఏపీ అర్పణం, 112 టీఎంసీల కృష్ణా జలాలు కర్ణాటకకు అర్పణం… కృష్ణాలో 74 టీఎంసీలు మా వాటా నీళ్లు ఆపుకుంటం, వరద ప్రాజెక్టులు కడుతం, విదర్భకు నీళ్లు తీసుకుపోతం అంటున్నది మహారాష్ట్ర…
అంటే, నడుమ తెలంగాణ రైతాంగం తీవ్రంగా దెబ్బతింటుంది… రేవంత్ రెడ్డికి ఫైట్ తప్ప మరో మార్గం లేదు… ఆంధ్రాబాబు గురువా, దోస్తా జానేదేవ్… పోరాడాల్సిందే.,. తెలంగాణ బీజేపీకి వెన్నెముక లేదు… బీఆర్ఎస్‌కు ఎంతసేపూ కుటిల, కుత్సిత విమర్శలు తప్ప మరో సోయి లేదు… సో, తెలంగాణ ఒంటరిపోరాటం చేయాల్సిందే…
బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ కోసం 9 కోట్లకు టెండర్లు పిలిచిన చంద్రబాబు … పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా 23 వేల క్యూసెక్కులు మళ్లించేలా రూపకల్పన చేస్తున్నాడు… నిజానికి11,500 క్యూసెక్కులు మాత్రమే దాని కెపాసిటీ… ఇప్పుడు డబుల్ కెపాసిటీతో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ తవ్వుతాడట… అటు పోతిరెడ్డిపాడు, ఇటు పోలవరం కాల్వలు… తెలంగాణ మీద ఆంధ్రాబాబు, జగన్ దొందూ దొందే… మోస్ట్ డేంజరస్…
హరీష్ రావు చెప్పింది నిజమే అయితే… నిజంగానే తెలంగాణ ప్రయోజనాల కోసం ఆంధ్రాబాబు దుర్మార్గాల మీద సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ గనుక ఆలోచిస్తుంటే… ఆహ్వానిద్దాం… కానీ ఆ మాటల్లో నిజాయితీ లేదు, ఎంతసేపూ రేవంత్ రెడ్డి మీద నిందారోపణలు తప్ప..!!
Share this Article