మొన్న జగన్..చంద్రబాబు ల ఎన్నికల యాత్రల మీద నా పరిశీలనలో భాగంగా జగన్ గురించి రాశాను కదా . ఇప్పుడు చంద్రబాబు గురించి చెప్పుకుందాం 
చంద్రబాబు సభలకు కూడా జనం పోటెత్తుతున్నారు 
సాక్షిలో చంద్రబాబు సభలకు జనం వెలవెల 
ఏబీఎన్ ఛానెల్లో జగన్ సభలకు జనం వెలవెల అనే ప్రసారాలు ఎంత అబద్ధమో ఇద్దరి సభలకు జనం బానే వస్తున్నారనేది అంత నిజం 
అయితే జగన్ సభల్లోలా చంద్రబాబు సభల్లో రాంప్ వాక్ లేదు 
డయాస్ మీద స్టాండ్ మైక్ ముందు మాట్లాడే విధానం కాకుండా చంద్రబాబు వైర్లెస్ స్పీకర్ల ద్వారా మాట్లాడుతూ వినూత్న విధానాన్ని ఎంచుకున్నారు !
బహుశా తెలుగు రాష్ట్రాల్లో వైర్లెస్ మైక్ ద్వారా పబ్లిక్ స్పీచ్ లు ఇస్తున్న మొదటి వ్యక్తి చంద్రబాబే అయ్యుంటారు !
సాధారణంగా కార్పొరేట్ ఈవెంట్స్ లో యాంకర్లు ఈ విధానం పాటిస్తారు 
దీనివల్ల ఒకేచోట నిలబడి మాట్లాడే పద్ధతి కాకుండా వేదిక మొత్తం కలియతిరుగుతూ మాట్లాడొచ్చు 
అందువల్ల వేదిక కింద వింటున్న జనాల్ని దగ్గరగా అడ్రస్ చేస్తున్న భావన ఉంటుంది 
అయితే స్టాండ్ మైక్ తో పోలిస్తే వైర్లెస్ మైక్ వల్ల వాయిస్ క్లారిటీలో కొద్దిగా సృష్టత లోపిస్తుంది 
అందుకు ఓపెన్ ఏరియా కావటం ఒక కారణం 
ఇక చంద్రబాబు తన ప్రసంగంలో జగన్ ను విమర్శించటానికి సమయం తీసుకుంటూనే మధ్య మధ్యలో తమను గెలిపిస్తే ఏం చేస్తామో చెప్తున్నారు 
అయితే జగన్ తో పోలిస్తే చంద్రబాబు సభల్లో గంభీరంగా కనిపిస్తారు . అంటే నవ్వటం చాలా అరుదన్నమాట 
 జనాల్ని కలవడంలో జగన్  కొద్దిగా ఎన్టీఆర్ స్టైల్ ను అనుసరిస్తే చంద్రబాబు మాత్రం సెక్యూరిటీ కారణమో మరోటో తెలీదు కానీ సభలు సమావేశాలతోనే ముగిస్తున్నారు 
వైసీపీ లో జగన్ తన చుట్టూ టీమ్ పెట్టుకుని ఎన్నికల వ్యూహాల్ని నడిపిస్తే టీడీపీలో మాత్రం సర్వం చంద్రబాబే ఆర్గనైజ్ చేయటం కనిపిస్తుంది 
జగన్  సజ్జల..విజయ సాయి రెడ్డి..వైవీ సుబ్బారెడ్డి.. లాంటి వాళ్ళను ఎన్నికల వ్యూహకర్తలుగా వాడుకుంటున్న సంగతి తెలిసిందే 
రాబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపు లిస్టులను సజ్జల…బొత్స..ల చేత రిలీజ్ చేయించారు 
ఫైనల్ లిస్ట్ ను వెనుకబడిన వర్గాలకు చెందిన ధర్మాన ప్రసాదరావు చేతనూ..నందిగం సురేష్ చేతనూ రిలీజ్ చేయించారు
పార్టీలో నంబర్ 2 స్థానం ఎవరికీ ఇవ్వకుండానే జగన్ టీమ్ వర్క్ చేయించుకున్నారు 
ఉపయోగించుకోవాలే కానీ చంద్రబాబు కు కూడా చక్కటి టీమ్ ఉంది 
చంద్రబాబు కు కూడా అశోక గజపతిరాజు.. యనమల రామకృష్ణుడు..వంటి సీనియర్ నాయకులు ఉన్నారు 
కానీ టీడీపీలో చంద్రబాబు టీమ్ వర్క్ తక్కువగా కనిపిస్తుంది 
పార్టీలో ప్రతి చిన్న విషయానికి పూర్తి నిర్ణయాలు చంద్రబాబు మాత్రమే సొంతంగా తీసుకుంటారనే పేరుంది 
పార్టీలో లోకేష్ మినహా మిగిలిన సీనియర్ నాయకులకు కార్యాచరణ విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం తక్కువగా ఉంటాయ్  
 
ఢిల్లీలో కేంద్రమంత్రులతో సైతం చనువుగా మాట్లాడగలిగే తాను టీడీపీలో అటువంటి స్వేచ్ఛ లేదనే పార్టీ బయటికి వచ్చానని ఎంపీ కేశినేని నాని చెప్పారంటే పరిస్థితి అర్థం అవుతుంది !
చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ద్వితీయ శ్రేణి నాయకత్వ లోటు సృష్టంగా కనిపించింది 
ఇక జగన్ కన్నా ఈ ఎన్నికలు వయసు దృష్ట్యా చంద్రబాబు కు ప్రతిష్టాత్మకమైనవి !
జగన్ కు ఈ ఎన్నికలు పోయినా తర్వాతి ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసుకోగలడు . కానీ చంద్రబాబు పరిస్థితి అలా కాదు 
అందుచేతనే చంద్రబాబు ఏపీ ఎన్నికల్లో ఓటు చీలకుండా పవన్ కళ్యాణ్ ను..బీజేపీని ఒకే తాటి మీదకు తీసుకురావడం మీద ఎఫర్ట్ చేసి సఫలం అయ్యారు !
ఇక ఏపీలో వైసీపీ కి వలంటీర్ల వ్యవస్థ బలమైన పునాది అనటంలో సందేహం లేదు 
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా  ఇంటిదగ్గరకే పెన్షన్ తీసుకొచ్చి ఇస్తుంటే ఏ లబ్ధిదారుడికి మాత్రం హాయిగా ఉండదు 
అటువంటి వలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ మాటల వల్ల టీడీపీ కూడా గందరగోళం లో పడింది 
చంద్రబాబు కు విషయ అవగాహన ఉంది కాబట్టి తమ ప్రభుత్వం వస్తే వలంటీర్ల గౌరవ వేతనం పది వేలు చేస్తామని వాగ్దానం చేసి వాళ్ళని కూడా తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు  ! 
వయసును..ఎండలను లెక్కచేయకుండా ఎన్నికల సభల్లో కష్టపడుతున్న చంద్రబాబు ను చూస్తే ఎలాగైనా అధికారంలోకి రావాలన్న తపన కనిపిస్తుంది 
ఇప్పుడు రాసినదంతా ఎన్నికల్లో ఇరువురు నాయకులు అనుసరిస్తున్న పంథా వరకు మాత్రమే !
ఇంకా రాయాల్సినవి ఉన్నాయ్ కానీ పోస్ట్ లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడితో ముగిస్తున్నా 
*              *               *
కొసమెరుపు : ఈరోజు తణుకు సభలో చంద్రబాబు మాట్లాడుతూ తమ ప్రభుత్వం వస్తే తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ మీదే పెడతానని..జగన్ ప్రభుత్వంలో మీకు ఉద్యోగాలు వచ్చాయా ? అని  ప్రజలను అడిగితే కొంతమంది ప్రజలు లేదు..లేదు.. అంటూ చేతులు అడ్డంగా ఊపారు 
*             *                  *
పిడుగురాళ్ల సభలో జగన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చాక రెండున్నర లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని..మరి చంద్రబాబు హయాంలో మీకు ఉద్యోగాలు ఇచ్చాడా ? అనడిగితే కొంతమంది జనాలు లేదు..లేదు.. అంటూ చేతులు అడ్డంగా ఊపారు 
ఇంకో కొసమెరుపు 
ఈరోజు తణుకులో చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఎన్నికల సభ..పిడుగురాళ్లలో జగన్ ఎన్నికల సభ ఒకే సమయంలో జరిగాయి 
చంద్రబాబు సభను టీవీ 5..ఏబీఎన్..ఈటీవీ ఛానెల్స్ లైవ్ ఇస్తే , జగన్ సభను సాక్షి.. టీవీ9…ఎన్టీవీ ఛానెల్స్ లైవ్ ప్రసారం చేశాయ్ !…… By… పరేష్ తుర్లపాటి
Share this Article