ఒక విఫల ప్రయత్నం… నిన్నటి గుంటూరు తొక్కిసలాటలో ముగ్గురు మహిళల మృతికి అసలు కారకుడు చంద్రబాబును, ఆ పాతకం నుంచి బయటపడేయటానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఓ విఫల ప్రయత్నం చేశాడు… అబ్బే, చంద్రబాబుకు అస్సలు సంబంధం లేదు, అసలు అది టీడీపీ కార్యక్రమమే కాదు, అదంతా ఉయ్యూరు ఫౌండేషన్ చేపట్టిన జనోద్ధరణ మాత్రమే, వాళ్ల నిర్వాకం కారణంగానే ఆ ముగ్గురూ మృతిచెందారు… అని కవరింగు ఇవ్వడానికి నానాపాట్లూ పడింది…
మొన్నటి కందుకూరు దుర్ఘటనలో సంభవించిన మరణాలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చంద్రబాబుపై విమర్శలకు కారణమయ్యాయి… ఇప్పుడు మరో ముగ్గురు మరణించడం మరో విషాదం… ఈ వయస్సులో కూడా కష్టపడి, జనంలో తిరుగుతున్నందుకు పాజిటివ్ మైలేజీ రావడానికి బదులు చంద్రబాబు మీద వ్యతిరేకత పెరుగుతోంది… పార్టీ శ్రేణుల మనోస్థైర్యం దిగజారకుండా ఏదో కష్టపడుతున్నాడు, సరే.., కానీ ఇలాంటివి జరిగినప్పుడు… పోలీసుల వైఫల్యం, బందోబస్తులో నిర్లక్ష్యం వంటి సాకులతో మాకు ఏ పాపమూ అంటలేదు అని చెప్పుకోవడానికి ప్రయత్నించడమే అసలు దరిద్రం… (సందు దొరికింది కదాని పిచ్చి తర్కాలతో ఈ దుర్ఘటనల్ని రాజకీయంగా వాడుకునే వైసీపీ దుశ్చేష్టల్ని కాసేపు పక్కన పెడదాం… అది మరింత దరిద్రం…)
మరణించినవాళ్లలో ఏ కులానికి సంబంధించిన వారు ఎందరున్నారో లెక్కతీసి, చూశారా, ఆ వర్గాల్లో మన పార్టీకి బలముంది అని సూత్రీకరణకు చంద్రబాబు దిగడం మరింత దివాలాకోరుతనం… తమకు సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం మరింత బాధ్యతారాహిత్యం… ఇదంతా ఉయ్యూరు ఫౌండేషన్ వైఫల్యం అంటున్నారు సరే… ఆ ఎన్ఆర్ఐ ఎవరు..? చంద్రన్న పేరిటే ఎందుకు ఇప్పుడు సంక్రాంతి కానుకలు ఇస్తున్నాడు..? ఆ చంద్రన్ననే ఎందుకు పిలిచాడు ఆ కార్యక్రమానికి..? అక్కడికి వచ్చింది చంద్రన్న కార్యకర్తలే, మీటింగ్ ఆర్గనైజ్ చేసిందీ చంద్రన్న మనుషులే… మరి చంద్రన్నకు ఏ పాపమూ అంటలేదంటే ఎలా..?
Ads
సరే, వాదన కోసం… సదరు ఉయ్యూరు ఫౌండేషన్‌కు అర్జెంటుగా కిలో పప్పు, కిలో నూనె, ఓ జనతా చీర ఇచ్చేసి, వేలాదిమందిని ఉద్దరించాలనే సంకల్పం ఎందుకొచ్చింది..? ప్యూర్ సేవా కార్యక్రమం అయితే ఈ రాజకీయ వాసనలు దేనికి..? నిజంగా ప్రజలకు ఏమైనా మంచి చేయాలనే సత్సంకల్పమే ఉంటే, దాన్ని ఓ రాజకీయ కార్యక్రమంలా ఆర్గనైజ్ చేయడం దేనికి..? ఎవరి ప్రయోజనం కోసం..? ఎవరి ప్రచారం కోసం..?
పోలీసుల బందోబస్తు వైఫల్యం కాదా, కావాలనే ప్రతిపక్ష కార్యక్రమాల్ని ఫెయిల్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది ఓ ప్రత్యేక కథనంలో… 2000 మంది ఉండాల్సి ఉండగా 200 మంది కూడా లేరట, ఉద్దేశపూర్వకంగానే బందోబస్తును తగ్గిస్తున్నాం అని పోలీస్ అధికారులే ఆంధ్రజ్యోతికి ఉప్పందించారట… అంటే, కావాలనే చంద్రబాబు మీటింగుల్లో తొక్కిసలాటలకు జగన్ ప్లాన్ చేస్తున్నాడు, తద్వారా ప్రతిపక్షాలు బదనాం కావాలనేది జగన్ ఆలోచన అన్నట్టుగా రాసిపారేశారు… అదే నిజమైతే వేరే మీటింగులు సజావుగానే ఎలా సాగాయి..?
జనసేన కార్యకర్తలు ఎలా ఉంటారో తెలుసు కదా, మరి పవన్ కల్యాణ్ మీటింగులు కూడా సజావుగానే సాగుతున్నాయి కదా… అప్పుడప్పుడూ వాటిని నిర్వహిస్తున్నా సరే…! ఏదో ముష్టిసాయం చేస్తామని ప్రకటనలు చేయడం, ప్రచారం చేసుకోవడం, జనాన్ని మభ్యపెట్టి, ఆ చిల్లర ప్రలోభాలతో మీటింగులకు రప్పించడం… ఏదైనా విషాదం జరిగితే ఎవరి మీదకో తోసేసి, పాపం కడుక్కోవడం కాదు బాబూ… కాస్త బాధ్యతగా, హుందాగా కూడా ప్రవర్తించొచ్చు… ఈ వయస్సులో ఇంకా ఎంత పాపం మూటగట్టుకోవాలి..?!
Share this Article