Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నమస్తే చంద్రబోసన్నా… ఇదొక్కసారి చదువు… తెలుగు నేర్చితే తప్పులేదు బ్రో…

April 16, 2023 by M S R

చంద్రబోసన్నా… నమస్తే… నమస్తే అని ఎందుకు అభివాదం చేస్తున్నానంటే… ముందుగా ఓసారి ఇది చదువు భయ్యా… నువ్వు రాసిన నాటునాటు పాటలో సాహిత్యం ఏమీలేదు… కానీ ఆస్కార్ వచ్చింది… దీన్ని సుడి అంటారు… దానికి తెలంగాణ పాట అని ముద్రవేయడానికి విఫలప్రయత్నం చేస్తున్నావు… సరే, నీ ఇష్టం, శ్రోతల ప్రాప్తం… కానీ తెలుగు కాని పదాలను కూడా తెలుగు పదాలు అని చెప్పకు ప్లీజ్… తెలుగు భాష విలపిస్తుంది…

ఆహా ఇండియన్ ఐడల్ తెలుగు షోకు వచ్చి ఏమంటివి..? ఆస్కార్ వేదిక మీద నమస్తే అనే తెలుగు పదాన్ని ఉచ్చరించావా..? 95 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో కొన్ని లక్షల ఇతర భాషా పదాలు ఉచ్చరించబడ్డాయి కానీ తొట్టతొలి తెలుగు పదం నమస్తే అన్నావు కదా… ఎట్టెట్టా నీ నాటునాటు పాటలోని మొదటి పదం పొలం అయితే, అది మన జీవన విధానమా…? ఓహో, మన జీవన విధానం ఆస్కార్ వేదిక ఎక్కబోతోందని ముందే తెలిసీ రాశావా ఆ పాటకు ఆ తెలుగు పదం..? వావ్… నువ్వు గొప్ప జ్యోతిష్కుడివి బాసూ, సారీ బోసూ…

నిజానికి నువ్వు తెలుసుకోవాల్సిన నిజం ఏమిటంటే..? నమస్తే అనే మాట తెలుగు కాదు, అది పక్కా సంస్కృతం… తెలుగు సినీగీత రచయితలకు ప్రేక్షకులందరూ ఎడ్డోళ్లుగా కనిపిస్తారనేది నిజమే, కానీ భాష గురించి తెలిసినవాళ్లు ఉంటారు భయ్యా… మరీ అంతగా భాషను కించపరిస్తే ఎలా..? అవునూ, నీ రాత భాష ప్రత్యేకంగా చంద్రబోస్ తెలుగు అనే కేటగిరీలోకి వస్తుందా..? లేకపోతే ఆస్కార్ వచ్చింది కదా, అజ్ఞానం గిజ్ఞానం అన్నీ చల్తా అనే లైట్ ధోరణా..? తప్పులేదు, ఇది చదువు ఓసారి… అవగాహన పెంచుకోవడం ఎప్పుడూ తప్పు కాదు…

Ads

తెలంగాణ తెలుగు, కోస్తా తెలుగు, రాయలసీమ తెలుగు అని ప్రధానంగా అంటున్నా… మరో నాలుగయిదు ఉప విభాగాలు కూడా ఉన్నాయని భాషాశాస్త్రవేత్తలు ఏనాడో ప్రామాణికంగా, శాస్త్రీయంగా నిరూపించారు. భద్రిరాజు కృష్ణమూర్తి, బూదరాజు రాధాకృష్ణ లాంటి ప్రఖ్యాత భాషాశాస్త్రవేత్తలు జీవితమంతా ఈ విషయాల మీదే అధ్యయనం చేశారు. అనేక మాండలిక నిఘంటువులను తయారు చేశారు. జనసామాన్య భాషలో ఉన్న అందాన్ని ఆవిష్కరించారు. “జనని సంస్కృతంబు ఎల్ల భాషలకు” అన్న భ్రమలను తొలగించి… మూల ద్రావిడ భాష నుండి తెలుగు ఎప్పుడు, ఎలా వేరు పడిందో శాసనాలు, ప్రాచీన గ్రంథాల ఆధారంగా వివరించారు. అవన్నీ ఇప్పుడు ఎవరికీ పట్టవు.

తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో తెలుగు భాషాభిమానులకు ఇప్పుడు ఆస్కార్ గేయ రచయితయిన నువ్వు చెప్పిందే తెలుగు అనుకోవాలా..? ఆస్కార్ అవార్డు ప్రకటించిన వెను వెంటనే పదిహేను ఘడియలు బిగబట్టిన ఊపిరిని నువ్వు వదిలేదాకా మాకు ఊపిరి ఆడేలా లేదు. అవార్డును రాబట్టుకోవడానికి రాజమౌళి ఏమేమి చేశాడో, ఎన్ని కోట్ల ఖర్చు, ఎంత లాబీయింగ్ జరిగిందో బహిరంగ రహస్యమే… కీరవాణి, రాజమౌళి ఉక్కిరి బిక్కిరిగా ఏమీ లేరు. అవార్డు ప్రకటించగానే ఎగిరి గంతేశారు… తరువాత హుందాగా, ప్రశాంతంగా ఉన్నారు…

నువ్వు ఒక్కడివే ఎందుకో ఆస్కార్ బొమ్మతో ప్రతిచోటకూ తిరుగుతున్నావు. అడిగినవారికి, అడగనివారికి ఆస్కార్ వేదిక మీద కీరవాణి తరువాత… చివర మిగిలిన నాలుగు సెకెన్లలో తానన్న “తెలుగు మాట నమస్తే”కు మరో ఆస్కార్ ఇచ్చి తీరాల్సిందే అన్నట్లు చిన్నపిల్లాడిలా చెప్పుకుంటున్నాడు… బోస్ బ్రో, నీకు ఎవరైనా చెబితే బాగుండు… ఎందుకులే, నేనే చెబుతా… నమస్తే” తెలుగు మాట కానే కాదని. నమః ప్లస్ తే( తే అంటే నీకు; నమః అంటే నమస్సులు) “నమస్తే” అవుతుంది…

సంస్కృతంలో సంధి సూత్రం ప్రకారం విసర్గ లోపించి… తే కాస్త స్తే అవుతుంది. నమస్తే సంస్కృతం మాటకు అచ్చ తెలుగు మాట- “మీకు మొక్కులు”. లేదా డు ము వు లు ప్రథమావిభక్తి సూత్రం ప్రకారం సంస్కృతం మాటకు చివర ఏకవచనం “ఉ”, బహువచనం “లు” కలుపుకుని తెలుగు మాటలు చేసుకునే పద్ధతి ప్రకారం చూసినా… మీకు నమస్కారాలు, మీకు నమస్సులు, మీకు దండాలు… ఇలాంటి మాటలేవో రావాలి. నూటికి నూటొక్క శాతం సంస్కృతం మాట “నమస్తే”ను తెలుగు అనడం, చివరికి ఆ నాటు పాటలో తెలంగాణావి కాని మాటలను తెలంగాణావిగా చెప్పడం మాత్రం ఎబ్బెట్టుగా ఉంది…

రెండు రాష్ట్రాల్లో తెలుగు, సంస్కృతం మాటలేవో తెలిసినవారు లేనే లేరని చంద్రబోస్ అనుకుంటున్నట్లున్నాడు. లేదా తనకు తెలిసినదే తెలుగు అనుకుంటూ అయినా ఉండాలి. “ఎదిగే కొద్దీ ఒదగమని అర్థం ఎందులో ఉందో?” చంద్రబోస్ కు ఇప్పుడు ఎవరయినా చెప్పకపోతే కొన్ని తరాలపాటు తనకు తెలిసిందే తెలుగని దబాయింపులకు తెలుగు సమాజం గురి కావాల్సి ఉంటుంది… ఇంకా చెప్పమంటావా సోదరా..?



1. Namaste (नमस्ते) in Hindi

2. Sata Sri Akal (ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ) in Punjabi

3. Nomoshkar (নমস্কার) in Bangla

4. Aadab (आदाब) in Kashmiri

5. Parnam (प्रणाम) in Magadhi

6. Namaskar (नमस्कार) in Marathi

7. Vanakkam (வணக்கம்) in Tamil

8. Namaskaram (నమస్కారం) – Telugu

9. Namaskar (ನಮಸ್ತೆ) in Kannada

10. Namaskar (नमस्कार) – Konkani

11. Radhe Radhe (राधे राधे) in BrajBhasha

12. Namaskarah (नमस्कार) in Sanskrit

13. Tashi Delek in Tibetan

14. Khurumjari in Manipuri

15. Khamma Gani in Marwadi

16. Assālam ‘alaykum (ٱلسَّلَامُ عَلَيْكُمْ) in Urdu

17. Namaskaram (నమస్కారం) in Telugu

18. Namaskara (ନମସ୍କାର) in Odia

19. Kem Chho (કેમ છો) in Gujarati

20. Chibai/Ekhai in Mizo

మరికొన్ని పిచ్చి మాటలు కూడా మాట్లాడినవ్… అమెరికాలో ఆస్కార్‌తోపాటు నీకొచ్చిన అవార్డుల బరువు కిలోగ్రాముల లెక్కల్లో చెబుతూ పోయావ్… నీ స్థాయి అంతేనా చంద్రబోసూ… జాలేస్తోంది… సారీ…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions