చంద్రమోహన్… మరణించాడనే వార్త అయ్యో అనిపించింది గానీ ఆశ్చర్యం అనిపించలేదు… నిష్ఠురంగా ఉన్నా సరే, ఊహిస్తున్నదే… ఆమధ్య కొన్ని సైట్లు, యూట్యూబ్ గొట్టాలు ఆయన్ని చంపేశాయి కూడా… చాన్నాళ్లుగా తను అనారోగ్యంతో బాధపడుతున్నాడు… సగటు ఆయుఃప్రమాణం బాగా పెరిగిన ఈరోజుల్లో 82 ఏళ్ల వయస్సు మరీ ఎక్కువేమీ కాదు… తెలుగు సినిమాల చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని రాసుకున్న చంద్రమోహన్ గురించి ‘ఇదీ’ అని ఏమీ చెప్పలేం… ఆయన ‘అన్నీ’… ఏది కాదు అనడగాల్సిన కెరీర్…
బాగా గుర్తుంది, చంద్రమోహన్ పేరు వినగానే ఓ సంగతి గుర్తుకొస్తుంది… ఓసారి ఎవరో విలేఖరి సరదాగా అడిగాడు తనను… ‘‘హీరోయిన్లను కావిలించుకున్నప్పుడు, మాంచి రొమాన్స్ సీన్లలో నటిస్తున్నప్పుడు ఏ ఫీలింగూ కలగదా..?’ దానికి ఆయన వెంటనే స్ట్రెయిట్‌గా సమాధానం ఇచ్చాడు… ఏ హిపోక్రసీ లేదు, డిప్లమాటిక్ ఆన్సర్ అసలే కాదు… ‘‘చుట్టూ లైట్లు, కెమెరాలు, క్లాప్స్, బోలెడంత హడావుడి, ఫుల్ మేకప్పులో వాళ్లు… కావిలించుకుంటే ఫీలింగ్ ఏమొస్తుంది..? వాళ్లను కావిలించుకున్నా ఒకటే, ఆ పక్కనే ఉన్న చెట్టును కావిలించుకున్నా ఒకటే, జస్ట్ నటనే…’’
తనవి పెద్దగా ఇంటర్వ్యూలు కనిపించవు… ప్రచారం మీద యావ కూడా కనిపించలేదు… పెద్దగా వివాదాలూ ఉండవు… తన పనేదో తనది, ఇదీ అదీ అని కాదు… ఏ పాత్ర ఇచ్చినా సరే, తను చేయలేని పాత్ర లేదు… చేయని పాత్ర కూడా లేదు… క్లిష్టమైన, భిన్నమైన పాత్రలు ఎన్నో… సేమ్ కేరక్టర్లు కూడా కాదు… యువకుడి పాత్ర నుంచి తాతయ్య పాత్ర దాకా… కామెడీ, పౌరాణికం, థ్రిల్లర్, సాంఘికం, సీరియస్, కేరక్టర్, హీరో… ఏదైనా సరే… కాకపోతే నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరక్టర్లు పెద్దగా చేసినట్టు లేదు…
Ads
చంద్రమోహన్ అనగానే బాగా గుర్తొచ్చేది, ఆయన పోషించిన పాత్రల జాబితా కాదు… అవన్నీ ఇప్పుడు ఇక్కడ ఏకరువు పెట్టడం కూడా కుదరదు… దాదాపు 175 సినిమాల్లో హీరో… 900 పైచిలుకు, వెయ్యికి కాస్త తక్కువ పాత్రలు… చిన్న విషయమేమీ కాదు… సినిమా ఇండస్ట్రీలో ఇంత సుదీర్ఘ కెరీర్ అంటే మాటలు కాదు… ఆ పాత్రల వైవిధ్యం సరే, అది గొప్పతనమే… కానీ తన పేరు వినగానే గుర్తొచ్చేది తన డైలాగ్ డిక్షన్… మొహంలో ఉద్వేగ ప్రదర్శన ఎలాగూ పర్‌ఫెక్ట్… అన్నింటికీ మించి తన డైలాగ్ డెలివరీలో అన్నిరకాల ఉద్వేగాలు అంతకన్నా పర్‌ఫెక్ట్‌గా పలుకుతాయి…
చంద్రమోహన్‌ను హీరోయిన్ల లక్కీ హీరో అని పిలిచేవారు… యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు, హీరో వేషాలు వేస్తున్నప్పుడు… అంటే ఇప్పటి హీరోల్లాగా పడికట్టు కథలు, వేషాలు, ఇమేజీ బిల్డప్పులు, స్టెప్పులు, ఫైట్లు కాదు… భిన్నమైన పాత్రలు… ఒక్కసారి సిరిసిరిమువ్వ, పదహారేళ్ల వయస్సు వంటి సినిమాల్ని గుర్తుకుతెచ్చుకొండి… జయప్రద, శ్రీదేవి మాత్రమే కాదు… చాలామందికి తనే ఫస్ట్ హీరో, లక్కీ హీరో… వాళ్ల కెరీర్ ఆరంభానికి తనతోనే ఎంట్రీ… కొత్త కొత్త హీరోయిన్లకు బోణీ హీరోయే అయినా సరే, తన మీద పెద్దగా వెకిలి వివాదాలేమీ వినిపించలేదు… బయటపడనివి ఏమైనా ఉన్నాయేమో తెలియదు…
పర్టిక్యులర్‌గా కమెడియన్లు తనను చూసి నేర్చుకోవాల్సింది టైమింగ్… ఏ వంక పెట్టేందుకు చాన్సివ్వడు తను… ఎవరో నిర్మాత గతంలోనే అన్నట్టు… చంద్రమోహన్ మరో అర ఫీటు పొడుగు ఉంటే టాలీవుడ్‌ను దున్నేసేవాడు… (నిష్ఠురంగా ఉన్నా మరో నిజం ఏమిటంటే తను కమ్మ హీరో కాకపోవడం తనకు బాగా మైనస్… మన ఇండస్ట్రీకి సూటయ్యే డీఎన్ఏ కాదు అప్పట్లో… ఇప్పటి పరిస్థితి వేరనుకొండి…) నిజమే… ఐనా ఇప్పుడు తనకేం తక్కువ..? ఏ సగటు హీరోకు ఇంత వైవిధ్యమైన కెరీర్ లేదు… ఏ స్టార్ హీరోలకు తను తక్కువ కాదు… సంపూర్ణ జీవనం… వీడ్కోలు చంద్రమోహనుడా…!!
అన్నట్టు… తనకు నందులు బోలెడు వచ్చినయ్… బోలెడు ఇతరత్రా అవార్డులు కూడా వచ్చినయ్… మరి పద్మ పురస్కారం రాలేదేం..? భలేవారే… పద్మ పురస్కారాలకు మెరిట్‌కూ సంబంధం ఏముంటుంది..? అవన్నీ పైరవీల బాపతు… చంద్రమోహన్ ఎంతైనా నటించగలడు… కానీ పైరవించలేడు… అంతే… రాలేదు…!!
Share this Article