.
కొద్దిరోజులుగా… కొన్ని వార్తలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి… జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనే ఓ ముఖ్యమంత్రిగా చెలాయించిన ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు బేలగా కనిపిస్తున్నాడు… ప్రత్యర్థిగా భావించబడే ఏబీఎన్ రాధాకృష్ణ దగ్గర కూర్చుని, పాత పాపాలకు ఏదో వివరణలు ఇచ్చుకున్న తీరు విశేషమే…
చంద్రబాబు కోపాగ్నికి గురిగాకుండా రాధాకృష్ణ ద్వారా లొంగుబాటు సంకేతాలు పంపించాడేమో అనుకున్నారు… త్వరపడి వీఆర్ఎస్ అన్నాడు, కేంద్రం తక్షణం సరేనన్నది… మళ్లీ లెంపలేసుకుని ప్లీజ్ వాపస్ తీసుకుంటాను అంటే, ఎహెఫో అని కేంద్రం తిరస్కరించింది… చంద్రబాబుతో ప్రభుత్వ భాగస్వామి కదా… పైగా ఇది చంద్రబాబు జమానా కాదు, లోకేష్ జమానా…
Ads
ఇప్పుడేమో ఏబీ వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణ కిశోర్ పట్ల తన గత వైఖరి, నిర్ణయాలు తప్పేనంటూ ఓ పశ్చాత్తాప ప్రకటన ఇస్తున్నాడు… గతంలో చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం పట్ల తన వైఖరి కూడా బాగా విమర్శలకు గురైన సంగతి తెలిసిందే… ఏదైనా కేసులో ఇరుక్కుంటానని భయపడి, ఇలా పశ్చాత్తాప ప్రకటనలు జారీ చేస్తున్నాడా..?
తనే కాదు… టీటీడీ ఈవోగా (మాజీ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్) తనే తిరుమల వెంకన్నగా మూర్ఖ భ్రమల్లో వెలిగిన అధర్మారెడ్డి ఇప్పుడు సరెండర్… నిజాలు చెబుతున్నాడట సీబీఐ సిట్ దర్యాప్తులో… వైవీ సుబ్బారెడ్డి, హైకమాండ్ చెప్పినట్టే చేశాను అంటున్నాడట…
తిరుమల లడ్డూ కేసు మరింత బలంగా తన మెడకు చుట్టుకోకుండా నేరాంగీకార ప్రకటనలు చేస్తున్నాడా..? (ప్రస్తుతం ఈయన టీడీపీ క్యాంపుకే చెందిన ఓ రాజకీయ నేత కంపెనీలో చేరినట్టు సమాచారం… సేఫ్టీ మెజర్స్…?) అనిల్ సింఘాల్ సైలెంట్…
ఆల్రెడీ ఒకరిద్దరు ఐపీఎస్ అధికారులకు బలంగానే చుట్టుకున్నాయి… ముంబై నటి కిడ్నాప్, వేధింపుల కేసు… ఏపీపీఎస్సీ మార్కుల కేసు గట్రా… ముప్పు ముందే గ్రహించి పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అర్జెంటుగా జగన్ క్యాంపు విడిచిపెట్టి టీడీపీ వైపు పరుగో పరుగు… జగన్ మీడియా వ్యవహారాలు చూసిన జీవీడీ ఈరోజుకూ పత్తాలేడు… ఫలితాలు వస్తున్న మరుక్షణం జంప్…
సాయిరెడ్డి ముందే ఇవన్నీ గ్రహించి… అసలు రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు… జగన్ బాబాయ్, వైసీపీ మరో పిల్లర్ వైవీ సుబ్బారెడ్డికి తిరుమల నెయ్యి కాక, సెగ తప్పేట్టు లేదు… తనపై ఇంకా ఏమైనా ప్రిపేర్ చేస్తున్నారా కూడా తెలియదు…
ఆల్రెడీ జగన్ క్యాంపు విధేయులపై కొన్ని కేసులు పడ్డాయి… లిక్కర్ స్కామ్ ఎట్సెట్రా… ఇంకెన్ని తవ్వుతారో… (ఏమాటకామాట, చంద్రబాబు దూకుడు రేవంత్ రెడ్డిలో కూడా కనిపించడం లేదు… కేసీయార్ పాత పాపాలన్నీ క్షమించేసే ధోరణి కనిపిస్తోంది…)
గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో పలువరు ఐఏఎస్‌లు ఎన్ని అవస్థలు పడ్డారో చూశాం కదా… కొందరికి విముక్తి కలిగింది… కానీ వాళ్ల అవస్థే తమకు ఎదురుగాకుండా జగన్ పీరియడ్‌లో ప్రాధాన్య పోస్టుల్లో పనిచేసిన వాళ్లు భయంతో ఉన్నట్టున్నారు… జగన్ మీద బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరిలో కూడా తేడా వచ్చినట్టుంది… దానికి రాజకీయ కారణాలు ఎలా ఉన్నా, ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల్లో విచారణల్ని వేగంగా ముగించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించి ఉంది…
తన కేసుల విచారణ నుంచి వ్యక్తిగత హాజరును మినహాయించాలని జగన్ పెట్టుకున్న విజ్ఞప్తి తోసిపుచ్చబడింది… అలాగే బెయిల్ నిబంధనల్ని ఉల్లంఘించాడని సీబీఐతో కోర్టుకు చెప్పిస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి…
చంద్రబాబు అటు నుంచి నరుక్కొస్తున్నాడా..? జగన్‌ను ఎటూ కదలకుండా నిర్బంధించే ఆలోచనల్లో ఉన్నాడా..? ఏమో, ఏపీ రాజకీయాల్లో ఏదో మార్పుకు సంకేతాలు, ప్రత్యేకించి జగన్ క్యాంపులో నేరాంగీకారాలు, పశ్చాత్తాప ప్రకటనలు..!!
ఒకప్పుడు వేరు… మోడీని తిట్టి, దూరం చేసుకుని, చివరకు తన అపాయింట్‌మెంట్ కూడా దొరక్క భంగపడిన చంద్రబాబు ఇప్పుడు బలవంతుడు… ఆ మోడీయే ఇప్పుడు బాబు సపోర్టు మీద ఆధారపడ్డాడు… ఇటు జగన్ తనను అరెస్టు చేసి, జైలులో వేశాడనే కోపం తనలో రగులుతూనే ఉంది… సో, ఈ మార్పులన్నీ దేనికి సంకేతాలో ఇప్పుడప్పుడే క్లారిటీ రాదు, కానీ మార్పు మాత్రం కనిపిస్తోంది..!!
Share this Article