ఏది చరిత్ర..? పాలకస్థానంలో ఉన్నవాడికి నచ్చిందే చరిత్ర… నాటి రాజుల నుంచి నేటి వరకూ అదే కథ… అదే అసలు పాఠం… పాఠ్యపుస్తకాల్లో చేరే చరిత్ర కూడా అంతే..! నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్- ఎన్‌సీఈఆర్టీ తాజా నిర్ణయాలు, పాఠాల్లో మార్పులు కూడా ఇంతే… ప్రైవేటు స్కూళ్లు, ఆయా రాష్ట్రాల సిలబసులు రకరకాలుగా ఉన్నా సరే, ఎన్సీఈఆర్టీ సిలబస్ స్థూలంగా ఓ గైడ్…
చరిత్రను కాషాయీకరిస్తున్నారు, పిల్లల పాఠాల్ని కమలీకరిస్తున్నారు అనే ఆందోళన అప్పుడప్పుడూ వినిపిస్తూ ఉంటుంది, నో, నెవ్వర్, తప్పుల్ని సరిదిద్దుతున్నాం అంటుంది కాషాయ శిబిరం… తాజాగా ఏం జరిగిందంటే..? బాబ్రీ కట్టడం కూల్చివేత, గుజరాత్ అల్లర్లు, ఆర్టికల్ 370, హిందుత్వ రాజకీయాలు వంటి పదాలు, ప్రస్తావనల్లో మార్పులు జరిగాయి… ఎన్నికలవేళ ఏమిటీ మార్పులు అని ఎవరైనా అభ్యంతరపెట్టినా సరే, జరిగేది అలా జరిగిపోతూ ఉంటుంది…
గత చరిత్రలోని వాస్తవాలను భవిష్యత్ తరాలకు తెలియజేయకుండా బీజేపీ అడ్డుకుంటోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి, సహజంగానే మండిపడతాయి కదా… కానీ ఏది నిజమైన చరిత్ర అనేదే పెద్ద ప్రశ్న కదా మరి..! గుజరాత్ అల్లర్లు అనగానే గోద్రా రైలు దుర్ఘటన మాటేమిటి అంటారు… బాబ్రీ మసీదు అంటే, నో, అది రామజన్మభూమి అంటారు… ఇలా పరస్పర విరుద్ధ ప్రకటనలు, భావజాలాలు ఉంటున్నాయి కదా…
Ads
స్వాతంత్య్రం తరువాత భారత దేశ రాజకీయాలు పేరుతో పొలిటికల్ సైన్స్ ఎనిమిదో అధ్యాయం ఉందట సిలబస్‌లో… 2006-07లో దీన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చారట… అదుగో అందులో మార్పులు చేశారు ఇప్పుడు… బాబ్రీ మసీదు అనకుండా రామమందిర ఉద్యమం, సుప్రీం తీర్పుకు ప్రాతిపదికల్ని బోధిస్తారు ఇకపై…
హిందుత్వ రాజకీయాలు అనే పదాలు ఇక కనిపించవు… గతంలో 11వ తరగతి పాఠ్యపుస్తకంలో చాప్టర్ 8లో సెక్యులరిజం గురించి ప్రస్తావిస్తూ… 2002లో గుజరాత్‌లోని గోద్రా అల్లర్ల అనంతరం 1000 మందికి పైగా చనిపోయారని… ముఖ్యంగా ముస్లింలను ఊచకోత కోశారు అని ఉండేది… ప్రస్తుతం దాన్ని కొద్దిగా మార్చేశారు… 2002లో గుజరాత్‌లోని గోద్రా అల్లర్ల తర్వాత 1000 మందికిపైగా చనిపోయారు అని మార్చారు… ముస్లింలు, ఊచకోత పదాలు ఉండవన్నమాట…
జమ్మూ కాశ్మీర్‌కి సంబంధించి కొన్ని అంశాలను కూడా మార్చారు… గతంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను పాకిస్తాన్ ఆజాద్ పాకిస్తాన్ గా అభివర్ణిస్తుంది అని ఉండేది… దీన్ని మారుస్తూ ఇది పాకిస్తాన్ అక్రమ ఆక్రమణలో ఉన్న భారత భూభాగం, దీనిని పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అని పిలుస్తారని మార్పులు చేసింది. ఇక భారత్‌లో మణిపుర్ విలీనానికి సంబంధించిన సూచనలను కూడా మార్పు చేశారు… ఈ మార్పులు ఇతర తరగతులతో పాటు 11, 12వ తరగతులకు సంబంధించిన రాజనీతి శాస్త్రం పాఠ్యాంశాల్లో కూడా చేర్చారు…
ఈ మార్పులతో కూడిన సిలబస్ 2024-25 నుంచి అమల్లోకి వస్తుంది… దేశంలో 30 వేల వరకూ ఉన్న సీబీఎస్ఈ స్కూళ్లలో ఈ సిలబసే ఉంటుంది… ఎన్ని స్కూళ్లలో ఎందరికి దీన్ని బోధిస్తున్నారని కాదు… దీనికి భిన్నంగా ఏదైనా స్కూల్ సిలబస్‌లో ఉంటే చర్యలు తప్పవనే సంకేతాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి… అదీ సంగతి..!!
Share this Article