.
ప్రింట్ మీడియాలో వాణిజ్య ప్రకటనలకు ఏబీసీ సర్క్యులేషన్ ఫిగర్స్ ప్రామాణికం కదా… పత్రికలు నడిచేవే ఆ రెవిన్యూ మీద… కాకపోతే ఏబీసీలో తప్పుడు ఫిగర్లకు అవకాశం ఉండదు కదా, పైగా డబ్బు కట్టాలి దానికి… అందుకని కొన్ని పత్రికలు ఏబీసీ నుంచి బయటికి వచ్చి… సీఏ రిపోర్ట్స్ పేరిట అడ్డగోలు ఫిగర్స్ చూపించి, వాటి ఆధారంగా మరింత అడ్డగోలు టారిఫ్ ఫిక్స్ చేయించుకుని, వందల కోట్లను ప్రభుత్వం నుంచి పొందుతాయి…
ఇది తెలుగులోనే ఎక్కువ… అఫ్‌కోర్స్, ఇదేదో బాగుందని మిగతా భాషల పత్రికలూ ఇదే తొవ్వ తొక్కుతున్నాయి… మనం దేన్నయినా అలవాటు చేయగలం కదా ఎవరికైనా… కొందరు రీడర్ షిప్ సర్వే అనే ఓ లోపభూయిష్టమైన పద్ధతిలో ఫిగర్స్‌ను ప్రకటనకర్తలకు చూపించి, ఏదో అలా అలా కథ నడిపిస్తారు… సరే, మరి టీవీలు..?
Ads
టీవీల్లో ప్రకటనల ఆదాయం ఏటేటా బాగా పెరుగుతోంది… ఇప్పటిదాకా బార్క్ సంస్థ ఇచ్చే రేటింగ్సే ప్రామాణికం… ఆ రేటింగ్స్ అడ్డదిడ్డం… ఒక్క విషయం చెబితే చాలు, అదెంత అశాస్త్రీయమో అర్థమవుతుంది…
కేంద్ర ప్రభుత్వమే చెబుతోంది… దేశంలో ప్రస్తుతం దాదాపు 23 కోట్ల టెలివిజన్ గృహాలు ఉన్నాయి… అయితే, ప్రస్తుతం వీక్షకుల డేటాను సేకరించడానికి (అంటే ఏ ప్రోగ్రామ్, ఏ చానెల్ ఎంత మంది చూస్తున్నారనే డేటా) దాదాపు 58,000 మీటర్లు మాత్రమే ఉపయోగించబడుతున్నాయి.., ఇది మొత్తం టీవీ గృహాలలో కేవలం 0.025% మాత్రమే…
అంతేకాదు, ఏయే ఇళ్లల్లో మీటర్లున్నాయో కనిపెట్టి, ఆ ఇంటివాళ్లకు డబ్బులిచ్చి, తాము చెప్పిన ప్రోగ్రామ్స్ రన్ అయ్యేలా చూడటం ఓ దందా… లేదంటే వేరే టీవీలు పెట్టి, అందులో 24 గంటలూ తమ చానెల్ ప్రోగ్రామ్సే రన్ అయ్యేలా చేసి, రేటింగ్స్ పెంచుకోవడం మరో పద్ధతి… పలు చానెళ్ల మీద కేసులు కూడా అయ్యాయి… చివరకు కొండలు తవ్వి చచ్చిపోయిన ఎలుకల్ని కూడా పట్టలేదు పోలీసులు…
యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్‌లాగే ఇప్పుడు టీఆర్పీ సిస్టమ్ మార్చేయబోతోంది ప్రభుత్వం… ఓ ముసాయిదా తయారు చేసి, ఫీడ్ బ్యాక్, సూచనల కోసం నెట్‌లో పెట్టారు… 30 రోజుల తరువాత ఫైనల్ బిల్లు తీసుకొస్తారు… అది మొత్తం వర్తమాన టీఆర్పీ పద్ధతుల్లో సమూల మార్పులు తీసుకొస్తుందని, నిజమైన రేటింగ్స్ జనానికి, ప్రకటనకర్తలకు తెలుస్తాయని ఈ ప్రయత్నం…
ఒక్క బార్క్ మాత్రమే కాదు, బహుళ ఏజెన్సీలు ఇప్పుడిక ఈ డేటా సేకరణలోకి ప్రవేశిస్తాయి… ఓ ఆరోగ్యకరమైన పోటీకి ఇది దారితీస్తుంది… అంతేకాదు, కొత్త టెక్నాలజీలో వ్యూయర్‌షిప్ లెక్కిస్తారు… ప్రస్తుతం జియోస్టార్ వంటివి క్రికెట్ మ్యాచులు జరుగుతున్నప్పుడు రియల్ టైమ్ వ్యూయర్స్ సంఖ్యను వేస్తుంటారు కదా… దానికి వాళ్లు అవలంబించేవి నవీన పద్ధతులు, నవీన టెక్నాలజీ…
అదుగో అది రావాలనేది ప్రస్తుత టీఆర్పీ విధానంలోని మార్పుల ఉద్దేశం… సత్సంకల్పమే… ఇన్నాళ్లూ కేవలం టీవీల్లో వచ్చే ప్రసారాలనే టీఆర్పీల లెక్కలకు తీసుకుంటున్నారు… చాలామంది మొబైల్స్, ప్యాడ్స్, కంప్యూటర్లలో, ప్రొజెక్టర్లతో కూడా… అంటే యాప్స్, ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారాల ద్వారా కూడా ప్రసారాలు చూస్తున్నారు… అసలు అవే ఇప్పుడు ముఖ్యం… కానీ అవేవీ టీఆర్పీల లెక్కకు రావడం లేదు… సో, కొత్త టెక్నాలజీ తప్పనిసరి ఇప్పుడు సరైన డేటా సేకరణకు..!
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ టెలివిజన్ రేటింగ్ ఏజెన్సీల కోసం విధాన మార్గదర్శకాలకు సవరణలను ప్రతిపాదించింది.., ఇది మొదట 2014లో జారీ చేయబడింది… ప్రభుత్వంలో ఏ మార్పులైనా ఎంత ఆలస్యమో తెలిసిందే కదా… ఇప్పుడు ఎట్టకేలకు జూలై 2, 2025న ప్రతిపాదిత ముసాయిదా రిలీజ్ చేశారు…
వేల కోట్ల రూపాయల ఆదాయానికి సంబంధించిన రేటింగ్ సిస్టం కదా.,. తప్పనిసరిగా శాస్త్రీయ విధానం అవసరం… ఇప్పటికే ఆలస్యమైంది… ఇప్పటిదాకా టీవీ రెవిన్యూలో భారీగా వాటా పొందుతున్న పెద్ద ప్లేయర్లు అడ్డుపడ్డారనే విమర్శలు కూడా ఉన్నాయి… ఇకనైనా మారితే సంతోషమే..!! ఈ చొరవ ఓటీటీ కంటెంటు సెన్సారింగు మీద ఎందుకు కనిపించడం లేదనేది మరో సబ్జెక్టు, తరువాత చెప్పుకుందాం…
Share this Article