.
Subramanyam Dogiparthi …….. విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ ద్విపాత్రాభినయంతో వచ్చింది ఈ చట్టానికి వేయి కళ్ళు సినిమా . ఆ లెవెల్లో ఆడలేదు . కృష్ణ కాబట్టి ఓ మాదిరిగా ఆడింది . అన్నదమ్ముల్లో ఒకరు పోలీసు కమీషనర్ , మరొకరు పోలీసు ఇనస్పెక్టర్ . ఇద్దరూ చట్టం విషయంలో రాజీ పడని నిఖార్సయిన ఆఫీసర్లు .
అన్న గారు ట్రైనింగుకు వెళ్ళే ముందు ప్రేమించిన యువతి తాను తిరిగి వచ్చేటప్పటికి పెళ్ళికి నిరాకరిస్తుంది . కొద్ది కాలానికి నాట్యగత్తెగా కనిపించడంతో అసలేం జరిగిందని నిలదీస్తాడు . తమ ఇంట్లో ఉంటూ తన తండ్రి చనిపోయాక తనను మానభంగం చేసి లొంగదీసుకున్నాడని చెపుతుంది . ఇంతలో అక్కడకు వచ్చిన ఆమె భర్తకు మాజీ ప్రియుడు పోలీస్ కమీషనరుకి జరిగిన తోపులాటలో కిందపడి ఆమె భర్త చనిపోతాడు .
Ads
తన మాజీ ప్రియురాలితో అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాడు కమీషనర్ . తమ్ముడు ఇనస్పెక్టర్ ఆ కేసుని వెంటపడి ఛేదిస్తాడు . ఈలోపు విధి నిర్వహణలో అన్న కమీషనర్ ప్రాణాలను వదులుతాడు . ఇదీ కధ . కధను , స్క్రీన్ ప్లేని చాలా బలహీనంగా తయారుచేసుకున్నారు . పెద్ద పెద్ద నటులు ఉన్నా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు .
అన్నదమ్ములుగా కృష్ణ బాగా నటించారు . ముఖ్యంగా అన్న పాత్రలో చాలా హుందాగా నటించారు . హుందా పాత్రలలోనే కృష్ణ బాగా నటిస్తారు . అన్న కృష్ణ ప్రేయసిగా జయసుధ బాగా నటించింది . ఆమె అభిమానులు ఆమె కోసం చూడవచ్చు .
తమ్ముడు కృష్ణ ప్రియురాలిగా , ఓ పేపర్ రిపోర్టరుగా మాధవి హుషారుగా , చలాకీగా నటించింది . ఇతర ప్రధాన పాత్రలలో రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య , గిరిబాబు , నూతన్ ప్రసాద్ , జయలలిత , జ్యోతిలక్ష్మి , నిర్మలమ్మ , కాంతారావు , రాజనాల , ప్రభృతులు నటించారు .
పరుచూరి బ్రదర్స్ డైలాగులను వ్రాసారని టైటిల్సులో వేసారు . వాళ్ళే వ్రాసారా అనే అనుమానం వస్తుంది . వాళ్ళ మార్క్ డైలాగ్ ఒకటి ఉంటుంది . సంచలన వార్త అని కృష్ణ అనగానే చెల్లెలు మళ్ళా ముఖ్యమంత్రి మారాడా అనే డైలాగ్ .
(ఈ సినిమా 1982 లో ప్రారంభమయి 1983 లో విడుదలయింది . 1978-1983 పీరియడ్లో కాంగ్రెస్ నలుగురు ముఖ్యమంత్రులను నియమించింది . విసిగిపోయిన జనం యన్టీఆరుకు పట్టం కట్టారు)
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి . రెండు ఖవాలీ పాటలు ఉంటాయి . ఒకటి జయసుధ మీద . నా జిలుగు పైట జారె అంటూ సాగే పాటలో జయసుధ చాలా బాగా నటించింది . మరో ఖవాలీ కృష్ణ , జ్యోతిలక్ష్మి గ్రూపుల మీద . కౌగిలిస్తే కానుకలిస్తా అంటూ సాగుతుంది . ఈ పాటలో కృష్ణ హుషారుగా నటించారు .
జయసుధతో ఒకటి మాధవితో ఒకటి డ్యూయెట్లు ఉంటాయి . రెండూ హుషారు హుషారుగానే ఉంటాయి . ఎన్నో పొద్దుల్లో కొండల్లో , బుజ్జిబాబుకు అంతలోనే పాటలు డ్యూయెట్లు . కోటి ఆశల కొత్త ఊపిరి అనే హేపీ న్యూ ఇయర్ పాట హుషారుగా సాగుతుంది కృష్ణ , మాదవి , జయమాలినిల మీద .
రంజిత్ ఆర్ట్స్ బేనరుపై నిర్మించబడిన ఈ సినిమాకు నిర్మాత కానూరి రంజిత్ కుమార్ . సినిమా యూట్యూబులో ఉంది . కృష్ణ , జయసుధ అభిమానులు చూడవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article