.
బహుశా సినిమా సెలబ్రిటీల తిక్క వ్యాఖ్యలతో స్పూర్తి పొందాడో… లేక తన గుణమే అది కావచ్చుగాక… మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలు ‘చిల్లర’ అనిపించుకోబడతాయి…
బీజేపీ నేతల నుంచి ఇలాంటి వ్యాఖ్యల్ని ఊహించలేదు… విషయం ఏమిటంటే..? కేంద్రం నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసింది కదా… దాని వెనుక అది ఆశించే రాజకీయ ప్రయోజనాలను పక్కన పెడితే…
Ads
మేం పదే పదే లేఖలు రాస్తే కేంద్రం అంగీకరించింది, సంతోషం అని తుమ్మల వ్యాఖ్యానించాడు… ఎస్, అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ఆ క్రెడిట్‌ను ఏదోరకంగా తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుంది, రాజకీయ సహజం…
కానీ కాంగ్రెస్ నాయకులెవరూ చిల్లర వ్యాఖ్యలు చేయలేదు, ఆహ్వానించారు… బీఆర్ఎస్ నేతలకు చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి సైలంట్…
ధర్మపురి అర్వింద్ ఏమంటున్నాడు..? కవిత మళ్లీ అరెస్టవుతుంది, కేటీాయార్ కూడా అరెస్టు అవుతాడు, బీఆర్ఎస్ మట్టిలో కలిసిపోతుంది… అసలు పసుపు బోర్డును స్వాగతిస్తూ కాస్త పాజిటివిటీని పెంచుకునే ప్రయత్నం చేయకుండా, బీఆర్ఎస్ మీద కూతలు ఈ సందర్భంలో అవసరం లేదు…
సరే, ఏదో అన్నాడు… కానీ తుమ్మల మీద ‘ఆ మంత్రికి వయసు పెరిగినా చిలిపి చేష్టలు పోలేదు’ అనే వ్యాఖ్యలు మాత్రం డెఫినిట్‌గా చిల్లర వ్యాఖ్యలే… పసుపు బోర్డుకూ తుమ్మల చిలిపి చేష్టలకు లింకేమిటి,..? తన వయస్సు 70 దాటింది… ఎక్కడా ఈ విషయంలో బీజేపీ వాళ్లపై కుసంస్కారపు వ్యాఖ్యలు చేయలేదు, మరి ఈ దాడి దేనికి..?
అది ధర్మపురి అర్వింద్ కుసంస్కారాన్నే సూచిస్తోంది… పైగా ఈ సారు గారికి రాష్ట్ర బీజేపీ పగ్గాలు కావాలట… రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా తుమ్మల స్పందన చాలా హుందాగా ఉంది… తను ఓ బహిరంగ లేఖ రాశాడు… ముఖ్యాంశాలు…
- పార్టీ, ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశాను.
- నా రాజకీయ ప్రస్థానం పట్ల అవగాహన రాహిత్యమో, సమాచార లోపమో తెలియదు కానీ మీ వ్యాఖ్యలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు…
- పదవుల కోసం, పార్టీ టికెట్ల కోసం ఏ నన్ను పార్టీలో చేర్చుకోండి, నాకు టికెట్ ఇవ్వండి, నాకు పదవి ఇవ్వండి అని ఈ 40 ఏళ్ల ప్రయాణంలో ఏ నాడు, ఎవరిని అడిగింది లేదు…
- మీరు పుట్టి పెరిగిన నిజామాబాద్ జిల్లాలోనే కౌలాస్ నాలా, సింగీతం కల్యాణి, లక్ష్మీ కెనాల్, శారదా సాగర్, లక్ష్మీ సాగర్, ఇందల్వాయి, గుత్ప లిఫ్ట్ ఇరిగేషన్ రూపకల్పన నుండి పూర్తి చేయడం వరకు ఉమ్మడి రాష్ట్రంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగినవే. ఆ సమయంలో మీ నాన్నగారు ఉన్నారు, మీరు ఎక్కడ, ఏ పార్టీలో ఉన్నారో కూడా నాకు తెలియదు…
- పసుపు బోర్డు ప్రకటించిన సందర్భంగా ప్రధాన మంత్రి గారికి ధన్యవాదాలు తెలిపాను. దీంట్లో మీకున్న అభ్యంతరం ఏమిటి? మీ ఆవేదన, ఆక్రోశం దేని కోసం…?
- రెండు పర్యాయాలు లోక్ సభ సభ్యుడిగా ఎన్నికైన మీరు ఇంతటి అధమ భాషను వాడటం సభ్యత అనిపించుకోదు. పరిపక్వతలేని మాటలు మాట్లాడకుండా, కొద్దిగా సహనంతో, రాజకీయ పరిజ్ఙానంతో మాట్లాడితే బాగుంటుందని హితవు పలుకుతున్నాను…
Share this Article