Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మిస్టర్ బాలకృష్ణా… వారసత్వం అంటే ఆ జ్ఞాపకాల పరిరక్షణ కూడా..!!

January 28, 2025 by M S R

.

Mohammed Khadeerbabu …… మొగలాయి భానుమతి అను మెడ్రాస్‌ కబుర్లు – మహమ్మద్‌ ఖదీర్‌బాబు

లాస్ట్‌ ఇయర్‌ వెళ్లినప్పుడు పాండీ బజార్‌లో నిలుచున్నాను. ఈ సంవత్సమూ నిలబడ్డాను. అనిల్‌ అట్లూరి గారి ‘రాణి బుక్‌ సెంటర్‌’ ఆనవాలు పట్టడానికి. ఒకప్పుడు మెడ్రాస్‌లో అదే ఏకైక తెలుగు బుక్‌ సెంటర్‌ అని ఘనత. ఇప్పుడు చరిత్ర.

Ads

వచ్చిన కొత్తల్లో ఇక్కడే అరాకొరా తిన్న అక్కినేని ఆ తర్వాత హీరో అయ్యి ఇదే పాండీ బజార్‌లోని కేఫ్‌కు వెళితే ప్లేటిడ్లీ పావలా అన్నారట. ‘మరీ ఇంత రేటు పెంచుతారా అని బిల్లు కట్టాక కోపంతో టేబుల్‌ మీద పెట్టున్న చక్కెర మొత్తం బొక్కాను’ అని హైదరాబాద్‌ మీటింగ్‌లో స్వయంగా చెప్పగా విన్నాను.

ఈ పాండి బజార్‌ గురించి ఎందరివో జ్ఞాపకాలు, కబుర్లు. కనుక పాండీ బజార్‌ను, పక్కనే ఉన్న పానగల్‌ పార్క్‌ను మన స్మృతి నుంచి తుడిచిపెట్టలేము. మల్లాది రామకృష్ణ శాస్త్రి, ఘంటసాల వంటి వారు నిత్యం కాలక్షేపం చేసిన పానగల్‌ పార్క్‌ను చూడటానికి వీలు కాలేదు. మెట్రో పనుల వల్ల క్లోజ్‌ చేశారు. పార్క్‌ మొత్తం పోయినట్టే. నాగయ్య గారి విగ్రహం ఉందో లేదో.

మా కావలి కోస్తా కాదు. రాయలసీమ కాదు. నైజాము కాదు. మాది అయితే గియితే మెడ్రాస్‌. జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఏ పని కావాల్సి వచ్చినా రాత్రి రైలెక్కి మరుసటి రోజు రాత్రి రైలుకు చేరుకునేవారు. మా ఊరి ఎం.ఎల్‌.ఏ యానాది రెడ్డి గారు మా ఊళ్లో కంటే మెడ్రాస్‌లో ఎక్కువ ఉండేవారు.

మా నాన్న నల్లరంగు బ్రీఫ్‌కేస్‌లో ఒక జత బట్టలు పెట్టుకొని వారానికి ఒకసారి కరెంటు సామాన్లకు వెళ్లి వచ్చేవాడు. మా బంధువులు ఇప్పటికీ మెడ్రాస్లో ఉన్నారు. దానిని చెన్నై అనడానికి నాకు నోరు రాదు.

చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు వెళ్లినా ఎప్పుడో ఒకసారి కోడంబాకంలోని బాలూ ఇంటికి వెళ్లాను గాని సినిమా వాళ్ల వరుస చూళ్లేదు. మొన్న ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌’కు వెళ్లినప్పుడు ఉదయం రెండు గంటలు సమయం ఉంటే అలా రౌండ్‌ వేశాను.

వాహిని స్టూడియో పెద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌ అయ్యింది. విజయ గార్డెన్స్‌ సరేసరి. ఇక్కడే ఎక్కడో లోపల ‘చందమామ’ ఆఫీసు ఉండేది అని కాసేపు నోస్టాల్జిక్‌గా నిలబడ్డాను. ‘మంచే చెప్తాము… చెడు ఉన్నా చెప్పము’ అనే ‘విజయచిత్ర’ మేగజీన్‌ పాలసీని ఇక్కడే చక్రపాణి నిర్దేశించారు. ఇవాళ్టి డిజిటల్‌ మీడియా ఈ మాటను స్వీకరిస్తే ఎందరి జీవితాలో ప్రశాంతం అవుతాయి.

అంతకు దగ్గరలోనే దాసరి గారు అమ్మేసిన ఖరీదైన స్థలం ఉంది. అందులో చాలా ఖరీదైన ఆపార్ట్‌మెంట్లు ఉన్నాయి. చిరంజీవి గారి ఇల్లు చూశాను. హైదరాబాద్‌ ఇల్లు కూడా చూశాను. నిరాడంబరత మెడ్రాస్‌ స్వాభావిక లక్షణం అనిపించింది. ఎందుకంటే వంద సినిమాల్లో నటించిన విజయకాంత్‌ ఇల్లు కూడా మామూలుగానే ఉంది.

ఘనత వహించిన ఏవిఎం వారు కొంత స్థలాన్ని భారీ ఆస్పత్రికి విక్రయించినట్టున్నారు. ఆ కాంపౌండ్‌లోని సొంత టాకీసు ఆనవాలు లేదు. ఫ్లోర్లు లేవు. ఏవిఎం గార్డెన్స్‌ కొద్దోగొప్పో మిగిలింది. అయితే ఏవిఎం వారు తమ వింటెజ్‌ కార్లన్నీ మ్యూజియంగా పెట్టారు. అది మాత్రం చూడదగ్గది. ఎం.జి.ఆర్‌ కారు దగ్గర నిలబడ్డాను. అది ఎన్ని మంతనాలను విందో. ఎన్ని తంత్ర రచనలను దాచుకుందో.

ఇక కీలకఘట్టం. బజుల్లా రోడ్‌లోని ఎన్‌.టి.ఆర్‌ ఇల్లు. వెళ్లకుండా ఉంటే బాగుండేది. ఇల్లంతా బూజు పట్టి, ఇంటి మధ్యలో భారీ చెట్టు మొలిచి, చెత్త చెదారం, నల్లటి ప్లాస్టిక్‌ షీట్లు… లోపల మాసిన బట్టలు, పిల్లులు… ఎవరో అతి పేదవారిని వాచ్‌మెన్‌గా ఉంచారేమో. వారి అలికిడి కూడా లేదు.

అక్కడే తెలుగువారి ఘనమైన సినిమా చరిత్ర లిఖించబడిందే. తెలుగువారి గొప్ప నటుడు నివసించాడే. ముఖ్యమంత్రి అయ్యాడే. తెలుగు ఆత్మగౌరవం అన్నాడే. అది ఇలా. ఈ విధంగా! చూస్తే చివుక్కుమంది. ఎన్‌.టి.ఆర్‌ కుటుంబ సభ్యులు దయచేసి దానిని పూర్తిగా తొలగించాలి. లేదా అభిమానులు దర్శించదగ్గ విధంగా తీర్చిదిద్దాలి. ఇలా ఉంచడం మాత్రం సరి కాదు.

ఈ మొత్తం ట్రిప్‌లో చాలా సంతోషం కలిగించిన సంగతి– భరణి స్టూడియో. తళతళలాడుతోంది. కాంతులీనుతోంది. ఉద్యానవనంలా ప్రశాంతంగా ఉంది. చక్కగా మెయింటెయిన్‌ చేస్తున్నారు. లోపలికి వెళ్లాను. డబ్బింగ్‌ థియేటర్, కల్యాణ మండపం, నాటి ఆఫీసు బిల్డింగ్‌ బ్రహ్మాండంగా ఉన్నాయి.

చాలా పెద్ద, విలువైన స్థలం. వందల కోట్లు. కాని భానుమతి గారిది అది. భానుమతి గారు, రామకృష్ణ గారు ఎన్నో కలలు కన్న, కళాఖండాలు సృష్టించిన తావు. అలాగే మిగిలి ఉంది. వారి అబ్బాయి భరణి మెడ్రాస్‌లోనే ఉంటున్నారట. చక్కగా చూసుకుంటున్నారు. భానుమతి మొగలాయి. ఈ విధంగా కూడా తన మొగలాయితనం నిలబెట్టుకున్నారు.

ఈ తెలుగువారి పట్టణంలో తెలుగు మెల్లగా పోతోంది. తెలుగు స్కూళ్లు మూతబడ్డాయి. సరే. అయితే ఏం. ఎన్నో ఘనతలు పట్టని తెలుగు వారి ఎక్స్‌ప్రెస్‌ జెఇఇ, ఎన్‌ఐఐటిల మీదుగా అమెరికా వైపు ఎప్పటిలానే దూసుకుపోతూ ఉంది.

పి.ఎస్‌: కె.విశ్వనాథ్‌ గారి ఇంట్లో నర్సరీ స్కూలు, మ్యూజిక్‌ స్కూలు నడుస్తున్నాయి. మ్యూజిక్‌ స్కూలు నడవడం కవితా న్యాయం అనిపించింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions