.
చెన్నమనేని రమేశ్ పౌరసత్వం కథ ఇంకా ముగియలేదు… 15 ఏళ్లుగా నడుస్తున్న కేసులకు ఇంకా తెరపడలేదు…
నువ్వు జర్మనీ పౌరుడివే, కానీ దాచిపెట్టావు, కోర్టుకు కూడా తప్పుడుపత్రాలు సమర్పించావు, 15 ఏళ్ల కోర్టు సమయాన్ని వృథా చేశావు… నీ అసలు పౌరసత్వాన్ని దాచి 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నావు… 30 లక్షల జరిమానా కట్టు, నీ పౌరసత్వంపై పోరాడుతున్న ఆది శ్రీనివాస్‌కు 25 లక్షలు, న్యాయసేవాసంస్థకు 5 లక్షలు…. హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు చదివాక కాస్త ఆశ్చర్యం, కాస్త వైరాగ్యం…
Ads
గతంలోనే ఓసారి ఆయన ఎన్నిక కోర్టులో కొట్టివేయబడింది… సాక్షాత్తూ కేంద్రమే భారత ప్రభుత్వాన్ని మోసగించి పౌరసత్వం పొందినట్టు ప్రకటించింది… ఐనాసరే… ఇంతగా వివాదం రగులుతున్నా సరే కేసీయార్ పార్టీ తనకు అవకాశాలిస్తూనే పోయింది చాన్నాళ్లపాటు…
హైకోర్టు తీర్పు నిరాశ కలిగించిందట, అప్పీల్ వెళ్లే అవకాశాల్ని అన్వేషిస్తాడట… తన పౌరసత్వ వివాదం ఓ రాజకీయ కుట్ర అట… హైకోర్టు తీర్పు హేతుబద్ధం కాదట… ఓ ప్రకటన విడుదల చేశాడు అలా… అంటే ఇంకా ఈ వ్యాజ్యాన్ని కొనసాగించే ఆలోచన అన్నమాట… అంతేకాదు, రమేశ్ ఎన్నిక చెల్లదంటూ అప్పట్లో దాఖలైన పిటిషన్ మీద కూడా తీర్పు రావల్సి ఉంది…
వ్యవస్థను ఆయన ఓ తెగింపుతో తృణీకరిస్తూ వస్తున్నా 15 ఏళ్లుగా మన వ్యవస్థ ఏదీ తేల్చలేకపోయింది… ఒకరి పౌరసత్వం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి విలువే లేదా అనే ఓ ప్రశ్నను ఇన్నేళ్లుగా వ్యవస్థే నానబెట్టింది…
కేసుల పరిష్కారం దిశలో మన న్యాయవ్యవస్థ తీరు, జాప్యం తెలిసిందే… కానీ ఇన్నేళ్లుగా కోర్టుల సమయాలు వృథా అయ్యాయని కోర్టే అంగీకరిస్తున్నా… తప్పుడు పత్రాలు అని కోర్టే చెబుతున్నా… ఇంకా వ్యాజ్యం కొనసాగిస్తాననే పలుకుతున్నాడు ఆయన… ఇన్నాళ్ల వివాదం చదువుతూ ఉంటే ఒక సంశయం… ఈ కేసులో ఈరోజుకూ వ్యవస్థ గెలిచినట్టా..? ఓడినట్టా…? న్యాయం గెలిచినట్టా..? ఓడినట్టా..?
ప్రముఖ రాజకీయవేత్త, ఫ్రీడమ్ ఫైటర్, కమ్యూనిస్టు చెన్నమనేని రాజేశ్వరరావు కొడుకు తను… రమేశ్ ప్రస్తుత వయస్సు 68 ఏళ్లు… జర్మనీలోనే ఉన్నత చదువు… అక్కడే ఉద్యోగం… అక్కడి మహిళతోనే పెళ్లి… అక్కడిదే పౌరసత్వం… ఇద్దరు కొడుకులు, ఓ బిడ్డ… మొదట్లో వేములవాడ ఏరియాలో స్వచ్ఛందసేవ కార్యక్రమాలు చేపట్టేవాడు…
1993లో జర్మనీ పౌరసత్వం రావడంతో భారతీయ పౌరసత్వాన్ని సరెండర్ చేశాడు… తరువాత 2008 నుంచీ రాజకీయాల మీద ఆసక్తి… దాంతో భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేశాడు… అదుగో అక్కడే తప్పుడు పత్రాలు సమర్పించాడనీ, వ్యవస్థల్ని మోసం చేశాడనీ, అసలు ఆయన ఎన్నికలే చెల్లవనీ తన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ ఇన్నేళ్లుగా పోరాడుతున్నాడు…
ఇన్నేళ్ల తన పోరాటంలో న్యాయం గెలిచిందీ అంటున్నాడు ఆది శ్రీనివాస్… ఈ గెలుపు అంతిమమేనా..? ఏమో, రమేశ్ ప్రకటన మాత్రం అప్పుడే అయిపోలేదు అనే సంకేతాన్ని ఇస్తోంది… ఇంకెన్నాళ్లో…!!
Share this Article