.
Pardha Saradhi Upadrasta …. “చికెన్ నెక్” నుంచి “ఐరన్ నెక్” వైపు భారత్ ప్రయాణం! దేశ భద్రతా వ్యూహంలో అత్యంత కీలక ప్రాంతమైన సిలిగురి కారిడార్ (Chicken Neck Corridor) మళ్లీ జాతీయ చర్చలోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్న 120 ఎకరాల వ్యూహాత్మక భూమిని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. ఇది చిన్న విషయం కాదు. ఇది భవిష్యత్తు జాతీయ భద్రతా నిర్మాణంలో ఒక పెద్ద అడుగు.
“చికెన్ నెక్” అంటే ఏమిటి?
సిలిగురి కారిడార్ అనేది పశ్చిమ బెంగాల్‌లోని ఒక సన్నని భూభాగం. ఇది అత్యంత ఇరుకైన చోట కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. కానీ ఈ చిన్న భూభాగమే మొత్తం ఈశాన్య భారత రాష్ట్రాలను మిగతా భారతదేశంతో కలుపుతుంది.
అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, సిక్కిం వంటి రాష్ట్రాలకు భూసంబంధ మార్గం ఇదొక్కటే.
ఈ మార్గం ప్రమాదంలో పడితే, ఈశాన్య భారతదేశానికి సరఫరాలు ఆగిపోవచ్చు, సైనిక రవాణా దెబ్బతింటుంది , కమ్యూనికేషన్ వ్యవస్థలు ప్రభావితం అవుతాయి, దేశ భౌగోళిక సమగ్రతకు ప్రమాదం ఏర్పడుతుంది
అందుకే దీనిని “భారత్ అత్యంత సున్నితమైన భద్రతా ప్రాంతం”గా పరిగణిస్తారు.
భౌగోళికంగా ఎందుకు ప్రమాదకరం?
ఈ కారిడార్ చుట్టూ నాలుగు దేశాలు ఉన్నాయి: ఉత్తరంలో చైనా చుంబి వ్యాలీ , తూర్పున భూటాన్, పశ్చిమాన నేపాల్, దక్షిణంలో బంగ్లాదేశ్…
అంటే ఈ ప్రాంతం పూర్తిగా వ్యూహాత్మక ఒత్తిడిలో ఉంటుంది. ముఖ్యంగా డోక్లాం ప్రాంతంలో చైనా నిర్మాణాలు పెరగడం, బంగ్లాదేశ్‌లో చైనా ప్రభావం పెరగడం, నేపాల్‌లో చైనా అనుకూల ధోరణులు పెరగడం వల్ల భారత్ మరింత అప్రమత్తమైంది.
బంగ్లాదేశ్, పాకిస్తాన్ లు అప్పుడప్పుడు ఈ ప్రాంతాన్ని ఆక్రమించి ఈశాన్య రాష్ట్రాలను కలుపుకొని గ్రేటర్ బంగ్లాదేశ్ ఏర్పాటు చేస్తాము అని హెచ్చరిస్తూ వుంటారు
Ads
భారత్ ఎందుకు భారీ స్థాయిలో బలోపేతం చేస్తోంది?
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం , భారత సైన్యం ఈ ప్రాంతాన్ని నాలుగు స్థాయిల్లో బలోపేతం చేస్తున్నాయి.
1. సైనిక శక్తి (Kinetic Layer)
హసిమారాలో రఫేల్ యుద్ధ విమానాలు
S-400 వైమానిక రక్షణ వ్యవస్థ
బ్రహ్మోస్ క్షిపణులు
ఆకాష్ మిసైల్ బ్యాటరీలు
కొత్త ఫార్వర్డ్ మిలిటరీ గ్యారిసన్లు
ఇవి శత్రు దాడులను ముందుగానే అడ్డుకునే సామర్థ్యాన్ని ఇస్తాయి.
2. రహదారి మౌలిక సదుపాయాలు
భారత్ ఈ ప్రాంతంలో 7 కీలక జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తోంది.
NH-10 → నాథులా మార్గం
NH-110 → సిక్కిం & చుంబి వ్యాలీ యాక్సెస్
NH-317A → హసిమారా ఎయిర్‌బేస్ లాజిస్టిక్స్
NH-717 & NH-312 → బంగ్లాదేశ్ వైపు రక్షణ
ఇవి సైనిక దళాలు వేగంగా కదలడానికి సహాయపడతాయి.
3. సరిహద్దు భద్రత
ఈ ప్రభుత్వం వచ్చాక BSF కు 600 ఎకరాల భూమి బదిలీ తొందరగా చేసింది, 110 కిలోమీటర్లకు పైగా బంగ్లాదేశ్ సరిహద్దు ఫెన్సింగ్ వేగవంతం
దీంతో అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్, ఉగ్రవాద చలనం తగ్గించాలన్న లక్ష్యం.
4. భూగర్భ రైల్వే లాజిస్టిక్స్
సుమారు 35- 40 కిలోమీటర్ల భూగర్భ రైల్వే మార్గం ప్రణాళికలో ఉందని OSINT వర్గాలు చెబుతున్నాయి.
డుమ్డాంగి – టిన్మైల్ హాట్ – రంగపాని – బాగ్‌డోగ్రా మార్గం
బాగ్‌డోగ్రా ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు అనుసంధానం
దీంతో యుద్ధ పరిస్థితుల్లో పైభాగ రహదారులు దెబ్బతిన్నా సరఫరాలు ఆగకుండా కొనసాగించవచ్చు.
1971 యుద్ధం తర్వాత జరిగిన వ్యూహాత్మక తప్పిదం?
చాలామంది వ్యూహ నిపుణుల అభిప్రాయం ప్రకారం 1971 బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత భారత్ ఈ ప్రాంతాన్ని మరింత విస్తరించే అవకాశం ఉపయోగించుకోలేకపోయింది. అప్పుడు భూభాగ భద్రతను శాశ్వతంగా బలోపేతం చేసి ఉండి ఉంటే ఈరోజు చికెన్ నెక్ అంత ప్రమాదకర బలహీనతగా ఉండేది కాదని అంటున్నారు.
ఇప్పుడు ఏమి మారుతోంది?
ఇప్పటి వరకు “బలహీనమైన సన్నని మార్గం”గా భావించిన చికెన్ నెక్, ఇప్పుడు: బహుళ రహదారులు, క్షిపణి రక్షణ, వైమానిక శక్తి, సరిహద్దు ఫెన్సింగ్, భూగర్భ లాజిస్టిక్స్, కేంద్ర ప్రత్యక్ష నియంత్రణ తో “ఐరన్ నెక్”గా మారే దిశగా అడుగులు వేస్తోంది.
ఇది కేవలం ఒక రహదారి కాదు, భారత్ యొక్క ఈశాన్య భద్రతా జీవనాడి!
ఇప్పటి దాకా కేంద్రం చేసే చాలా పనులకు రాష్ట్రం అడ్డు తగిలింది, ఇప్పుడు ఈ 120 ఎకరాల భూమిను బెంగాల్ ప్రభుత్వం కేంద్రానికి అప్పగించాలనే కాకుండా ఆ భూమి ఒక్క రక్షణ బాధ్యతలు మొత్తము కేంద్రానికి ఇచ్చేసింది, అంటే పాలనలో కానీ, రక్షణ విషయములో కానీ రాష్ట్రం జోక్యం చేసుకోదు.
అసలు కేంద్రం దీన్ని కేంద్ర పాలిత ప్రాంతము చేసేయాలి. సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలను అన్నిటికీ కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసి కేంద్రం తీసుకోవాలి అని నా చిరకాల కోరిక, డిమాండ్.
ఎన్నికలకు ముందే బెంగాల్ లోని ఈ ప్రాంతములోని 6 జిల్లాలు కలిపి ఒక కేంద్ర పాలిత ప్రాంతము చేయాలి, చేస్తారు అనే వార్త చక్కర్లు కొట్టింది. చెయ్యాలి. ఇప్పుడు దీనికి రాష్ట్రం అడ్డు పెట్టదు. ఒక ఆర్డినెన్సు ఇచ్చి, పార్లమెంట్లో చట్టం చేసుకోవటమే. — ఉపద్రష్ట పార్ధసారధి
#IronNeck #ChickenNeck #SiliguriCorridor #NationalSecurity #IndianArmy #India #NortheastIndia #Rafale #BrahMos #S400 #BorderSecurity #Geopolitics #China #Bangladesh #Doklam #Teesta #Defense #StrategicAffairs #Military #IndiaFirst #PardhaTalks
Share this Article