“కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు” అని తెలుగులో ఒక సామెత. ఆ సామెతని పక్కన పెడితే, అసలు పిల్లలు లేకపోవటం, పుట్టకపోవటమే డెమోక్రాటిక్ పార్టీ నుంచి అమెరికా ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న కమలా దేవికి కొంత కలిసి వచ్చేలా ఉంది. కమలాదేవి ప్రస్తుత వయస్సు 59 సంవత్సరాలు. అసలు ఆమె పెండ్లి చేసుకుందే 49 సంవత్సరాలప్పుడు.
పిల్లలు పుట్టలేదో లేదా వద్దు అనుకుందో ఆమె వ్యక్తిగత విషయం. కానీ అమెరికాలో మెజార్టీ పత్రికలు, ఛానల్స్ అన్నీ గతంలో ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ JD వాన్స్, కమలా దేవి మీద చేసిన వ్యాఖ్యల్ని ప్రచురిస్తూ కమలా దేవికి బాగా సపోర్ట్ చేస్తున్నై. పిల్లలు లేని జెన్నిఫర్ ఆనిస్టన్ లాంటి నటులు బాహాటంగా కమలా దేవిని సపోర్ట్ చేస్తూ JD వాన్స్ అప్పటి వ్యాఖ్యల్ని తప్పు పడుతున్నారు.
JD వాన్స్ ఎప్పుడో 2021లో ఒక ఇంటర్వ్యూలో “మన దేశంలో సంతానం లేని ఆడవాళ్ళ జీవితాలు, తాము తీసుకున్న నిర్ణయాలతో దుర్భరంగా ఉంది. డెమోక్రాటిక్ పార్టీ మొత్తం భవిష్యత్తును పిల్లలు లేని వ్యక్తులే నియంత్రిస్తున్నారు. ఉదాహరణకి కమలా దేవి. దేశానికి సంబంధించి ప్రత్యక్ష వాటా లేని అలాంటి వాళ్ళ చేతుల్లో మన దేశాన్ని పెట్టటం ఎంతవరకు సమంజసం..? ” అని మాట్లాడాడు.
Ads
ప్రస్తుతం మెజార్టీ అమెరికా మీడియా అంతా ఇవే చర్చలు. అసలే ఎక్కువ మీడియా డెమోక్రాటిక్ పార్టీ వైపు ఉంది. రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ ఈ నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష పోటీలో గెలుస్తాడు అని పాశ్చాత్య మీడియా, ప్రజల నమ్మకం. కానీ అమెరికాలో వాస్తవ పరిస్థితులు వేరు.
అమెరికాలో మెజార్టీ మీడియా డెమోక్రాటిక్ పార్టీకి కాపు కాస్తుంది. ప్రస్తుతం, అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పి, వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న కమలా దేవి పోటీ చేస్తుందని చెప్పిన మరుసటి రోజే కమలా దేవికి అమెరికా చరిత్రలో అత్యధిక విరాళాలు వచ్చాయి (ఒక్కరోజులో పోల్చి చూస్తే).
ప్రస్తుత పరిస్థితి ఎంతదాకా వచ్చింది అంటే – రిపబ్లికన్ పార్టీ అధికారికంగా కమల దేవి పాలసీ మీద విభేదించండి కానీ వ్యక్తిగతంగా ఏమీ అనొద్దు అని సూచనలు జారీ చేశారు. నిజానికి ఇలాంటి వ్యక్తిగత విషయాలని వ్యక్తిగత విషయాలుగానే ఉంచాలి, ఎవర్నీ వ్యక్తిగత విషయాలు తీసి మాట్లాడటం కరక్ట్ కాదు.
కమలా దేవి గెలుస్తదో లేదో ఇప్పుడే చెప్పలేం కానీ రోజురోజుకీ ఆమెకి సపోర్ట్ పెరుగుతుంది. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా కమలా దేవిని డెమోక్రాటిక్ పార్టీ నుంచి ప్రెసిడెన్సియల్ క్యాండిడేట్ గా బలపరుస్తున్నాడు.
ఏది ఏమైనా ప్రపంచంలో నంబర్ వన్ కంపనీలు; గూగుల్ మన పిచ్చయ్య చేతుల్లో ఉంది, మైక్రోసాఫ్ట్ ఏమో మన సత్తయ్య చేతుల్లో ఉంది. అమెరికా కూడా మన కమలమ్మ చేతికి వస్తే ఆ కిక్కే వేరు…! (ఎవరు గెలిచినా అమెరికా ప్రయోజనాలనే కాపాడతారు, వాళ్ళ వలన మనకి పైసా ఉపయోగం ఉండదు, అది వేరే విషయం)………. [ జగన్నాథ్ గౌడ్ ]
(ఆమెకు సొంత పిల్లలు లేకపోవచ్చు, కానీ ఆమెకు మేం లేమా అని ఆమె సవతి పిల్లలు కూడా సపోర్టుగా నిలబడుతున్నారు, కమలాదేవి కూడా వాళ్లను సొంత పిల్లల్లాగే ప్రేమిస్తుంది… కమలాదేవి చెల్లెలు మాయకు ఒక బిడ్డ… పేరు మీనా…)
Share this Article