Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ పాత్ర… ఆ నటన… థర్డ్ జెండర్ కోడ్ రాసిన మాడా… పర్యాయపదంగా…

September 18, 2024 by M S R

చూడు పిన్నమ్మా పాడు పిల్లడు పైన పైన పడతనంటడు … 1977 లో వచ్చిన ఈ చిల్లర కొట్టు చిన్నమ్మ ఎంత హిట్టయిందో అంతకన్నా వీర హిట్టయింది ఈ పాట . తిరునాళ్ళల్లో , సంబరాలలో ఈ పాట పాడకపోతే ఒప్పుకునే వారు కారు . ఈ పాటతో , తన పాత్రతో మాడా ఓ బ్రాండ్ అయిపోయాడు . ఎంతగా అంటే వీడెవడో మాడాలాగా తేడాగా ఉన్నాడే అనే అంత . పాట పాడిన బాలసుబ్రమణ్యానికి కూడా అంతే పేరు వచ్చింది . ఇలాంటి గొంతులు మార్చి పాడే పాటలు ఆయన ఒక్కరే అంత గొప్పగా పాడగలరు అని మరోసారి రుజువు చేసుకున్నారు .

థర్డ్ జెండర్ అంటే ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి అని మాడా ఓ కోడ్ ఫిక్స్ చేసినట్టుగా… ఈరోజుకూ హిజ్రాలను మాడాలు అని పిలుస్తారంటే ఆ పాత్ర ప్రభావం అర్థం చేసుకోవాలి… ఈ చిల్లర కొట్టు చిట్టెమ్మ నాటకాన్ని దాసం గోపాలకృష్ణ వ్రాసారు . సినిమాలో మాటలు కూడా ఆయనే వ్రాసారు . సాధారణంగా దాసరి తానే డైలాగులను వ్రాసుకుంటారు . కానీ ఈ సినిమాకు మాతృక అయిన నాటకాన్ని వ్రాసిన దాసం వారికే ఇచ్చేసారు . దాసం వారు నాలుగు పాటలను కూడా వ్రాసారు .

చిల్లర కొట్టు చిట్టెమ్మ నాటకం ద్వారానే ప్రముఖ నటి వాణిశ్రీ (స్టేజి పేరు రత్నకుమారి) పాపులర్ అయింది . మరి దాసరి ఆమెను ఎందుకు హీరోయిన్ గా ఎంపిక చేసుకోలేదో !? షీరోగా నటించిన జయచిత్రకు చాలా మంచి పేరు వచ్చింది . నటనాపరంగా ఆమె కెరీర్ తొలి రోజుల్లో బాగా పేరు తెచ్చిన సినిమా ఇది . ఆమెతో పాటు గోకిన రామారావుకు కూడా మంచి పేరు వచ్చింది . బాగా నటించారు .

Ads

చిన్నప్పుడు దత్తుడు (మురళీమోహన్) , చిట్టెమ్మ దేవదాసు- పార్వతిల్లాగా ప్రేమించుకుంటారు . పెద్దయ్యాక పెళ్లి చేసుకుందామని కూడా అనుకుంటారు . దత్తుడు తల్లి తన మేనకోడల్ని చేసుకోవాలని పట్టుపట్టడం , చిట్టెమ్మ ఒప్పించటంతో మరదల్నే పెళ్లి చేసుకుంటాడు . చిట్టెమ్మ అక్క ప్రసవంలో బిడ్డను కని చనిపోతుంది . బిడ్డ బాగోగులు కోసం వయసులో పెద్దవాడయిన బావను పెళ్లి చేసుకుంటుంది .

ఊళ్ళో జనం అతనికి చిట్టెమ్మ మీద లేనిపోని అనుమానాలను సృష్టిస్తారు . చివరకు చిట్టెమ్మను భర్త నరికేస్తాడు . పూజారి , మాడా నిజాలు చెప్పటంతో భర్త పిచ్చోడు అయిపోయి , చిట్టెమ్మ మీద అనుమానాలను సృష్టించిన వారి వెంటపడటంతో సినిమా ముగుస్తుంది . సాధారణంగా హీరో , హీరోయిన్ చనిపోతే ప్రేక్షకులు నచ్చరు . కానీ , ఈ సినిమాలో షీరో చనిపోయినా , ప్రేక్షకులు సినిమాను నచ్చారు .

చిన్నప్పుడు దత్తుడు , చిట్టెమ్మలుగా బేబీ రోహిణి , బేబీ తులసి నటించారు . బాల తులసికి ఇది రెండో సినిమా అనుకుంటాను . ఇద్దరూ బాగా నటించారు . దేవదాసు సినిమాలో బాల దేవదాసు , బాల పార్వతిలను గుర్తుకుతెస్తారు .

ఈ సినిమా సక్సెసులో సంగీత దర్శకుడు రమేష్ నాయుడికి పెద్ద పీటే ఉంది . ఈ సినిమాలో నాలుగు పాటల్ని దాసం వారు వ్రాస్తే , మిగిలిన మూడు పాటల్ని నారాయణరెడ్డి వ్రాసారు . చూడు పిన్నమ్మ పాడు పిల్లడు , ఏంటబ్బాయా యిదేంటబ్బాయా , చీటికి మాటికి చిట్టెమ్మంటే చీపురు దెబ్బలు తింటావురో , సువ్వీ కస్తూరి రంగా సువ్వీ కావేటి రంగా పాటల్ని దాసం వారు వ్రాసారు . వీటిల్లో సువ్వీ కస్తూరి రంగా పాట కూడా బాగుంటుంది .

మిగిలిన మూడు పాటల్ని సినారె వ్రాసారు . వీటిల్లో సుక్కల్లో పెద సుక్క సందమామా పాట చాలా బాగుంటుంది . తల్లి గోదారికే ఆటుపోటుంటే తప్పుతుందా మనిషికి , తాటిచెట్టు తల్లీ కాదు తాగినోడు మొగుడూ కాదు పాటలు బాగుంటాయి . సినారె వ్రాసిన తల్లి గోదావరికే ఆటుపోటుంటే పాటను పాడిన రమేష్ నాయుడికి నంది అవార్డు కూడా వచ్చింది .

ఇతర పాత్రల్ని ఉషాచౌదరి , నిర్మలమ్మ ప్రభృతులు నటించారు . దత్తుడి భార్యగా ఉషాచౌదరి నటించింది . ఈ సినిమాకు ముందు కానీ తర్వాత కానీ ఈమె మరి ఏ ఇతర సినిమాలలో కనిపించినట్లుగా లేదు .

సినిమాకు పేరు , డబ్బూ రెండూ వచ్చాయి . మామూలుగానే దాసరి సినిమాల్లో డ్రామా ఎక్కువ ఉంటుంది . అందులో ఈ సినిమా కధ ఒరిజనల్ గా డ్రామా . ఇంక చెప్పేదేముంది . 225 రోజులు ఆడిన ఈ సినిమా 225 రోజుల ఫంక్షన్ మద్రాసు న్యూ ఉడ్ లాండ్స్ హోటల్లో జరిగింది . యన్టీఆర్ , అక్కినేని ముఖ్య అతిధులుగా హాజరయ్యారు .

సినిమా యూట్యూబులో ఉంది . చూడనివారు తప్పక చూడండి . గోదావరి గ్రామంలో , నది నేపధ్యంగా తీసిన ఈ సినిమా అందంగా కూడా ఉంటుంది . A watchable , sentimental , drama-oriented , emotional entertainer . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు    (దోగిపర్తి సుబ్రహ్మణ్యం) 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ మాజీ జర్నలిస్టు… వెంట నడిచిన ఓ ఆటోడ్రైవర్… ఇదీ ఇంట్రస్టింగు కథే…
  • వామ్మో, ఏం కి‘లేడీ’ ప్లాన్ వేసిందిర భయ్… పాపం, ఆ భర్త బతికిపోయాడు…
  • ఉస్మాన్ తారీఖ్… కంట్రవర్సీ బౌలర్… కానీ నాణేనికి మరోవైపు ఏంటంటే…
  • యాటిట్యూడ్‌కే అమ్మ..! వాణిశ్రీ అంటే అప్పట్లో ఓ సినీ శివగామి..!!
  • ‘‘కల్వర్టు కిందకు లాక్కెళ్లి, దుస్తులు విప్పి… అత్యాచారయత్నమే కాదంటే…?’’
  • ఈ శృతి కథ మీ కథేనా … చదవండి, ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంది…
  • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిజంగా సిగ్గుపడాల్సిన ఓ వైఫల్యం..!!
  • ‘బలుపు కా బాప్’… నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేశావురా హార్దిక్…
  • తెలంగాణ రాజకీయాల్లో ఓ సైలెంట్ మార్పు..! బీసీ, వుమెన్ చైతన్యం..!
  • హోర్ముజ్ జలసంధిపై కుదరని సంధి… మళ్లీ ఉద్రిక్తతలు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions