ఈ వార్త చదవగానే ఆశ్చర్యం కొంత, ఆందోళన కొంత, ఆగ్రహం కొంత ఖచ్చితంగా కలుగుతాయి… అదేమిటంటే..? చిలుకూరు బాలాజీ గుళ్లో గరుడ ప్రసాదం పంపిణీ చేశారు… ఎందుకు..? సంతానహీనులకు సంతానం కలుగుతుందట అది తింటే…! ఎహె, ఈ రోజుల్లో కూడా ఇవి నమ్మేవాళ్లున్నారా అని ఆశ్చర్యపోవద్దు…
ఎందుకంటే..? సంతానం లేని జంటల బాధ చెప్పతరం కాదు… సమాజం చూపులు, వ్యాఖ్యలు మాత్రమే కాదు, వాళ్లకూ తమ జీవితంలో ఏదో కోల్పోయామనే బాధ ఉంటుంది… తమ పిల్లాడిని లేదా పిల్లను చేతుల్లోకి తీసుకున్న మొదటి క్షణంలో ఏ తల్లిదండ్రులకైనా ఓ అనిర్వచనీయ ఆనందం ఆవరిస్తుంది… ఈరోజుల్లో పిల్లలు లేకపోతేనేం అనే భావన అస్సలు ఉండదు, బయటికి ఏం చెప్పుకున్నా లోలోపల ఆ భావనను వాళ్ల ఆత్మలే అంగీకరించవు…
వెళ్తారు, సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్తారు, మందులు వాడుతూనే ఉంటారు, అదేసమయంలో… ఏమో, ఇదేమైనా ఫలిస్తుందేమో అని పూజల వైపు దృష్టి సారిస్తారు… అందుకే గరుడ ప్రసాదం అనగానే ఆశగా వెళ్లి ఉంటారు… తప్పు లేదు, అది వాళ్ల ఆశ, వాళ్ల నమ్మకం… అసలు తప్పు ఖచ్చితంగా వీసాల బాలాజీగా పేరొందిన చిలుకూరు గుడి నిర్వాహకులదే… ఎవరేం అనుకున్నా పర్లేదు, ఖచ్చితంగా భక్తసమాజానికి ఆ నిర్వాహకులు క్షమాపణ చెప్పాలి… గరుడ ప్రసాద వితరణ మీద కాదు, అడ్డదిడ్డం పంపిణీ మీద..!
Ads
10 వేల మందికి ప్రసాదం తయారు చేశారట, సరే, వోకే, నమ్మేవాళ్లు నమ్ముతారు, వస్తారు, తీసుకుంటారు, ఫలితం ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు, అది కాదు ఇష్యూ… లక్షన్నర మంది పోటెత్తడం ఏమిటి..? కిలోమీటర్ల తరబడీ ట్రాఫిక్ జామ్ ఏమిటి..? అయ్యో, సంతాన ప్రసాదం అయిపోతుందో ఏమో అనే ఆందోళనతో భక్తులు చివరకు కాలినడకన పరుగెత్తడం ఏమిటో…?
ఒక దశలో పోలీసులు కూడా చేతులెత్తేశారు… ఎప్పుడైనా గమనించామా..? బత్తినవారి ఆస్త్మా చేపమందు దగ్గర ఈ గందరగోళం, అరాచకం… ఇలాంటివి చేస్తున్నప్పుడు పర్‌ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి… అసలు ఆ గుడికి భక్తులు మామూలు రోజుల్లో పోటెత్తితేనే ఇబ్బందికరంగా ఉంటుంది… మరి ఈ గరుడ ప్రసాదం ఆలోచన చేసినప్పుడు, భక్తులు ఎక్కువగా వస్తారనే సోయి లేకపోతే ఎలా..?
ఎస్, దేవాదాయ ఇనుప చట్రంలోకి గుడి పోకుండా కాపాడుకుంటున్నారు అక్కడి పూజారులు, నిర్వాహకులు… గుడ్… ఆర్జితసేవలు, టికెట్లు, ప్రత్యేక దర్శనాలు వంటి దోపిడీలు లేవు, వెరీ గుడ్… భక్తజనం వస్తున్నారు కదాని కార్పొరేట్ దేవుడిగా మార్చలేదు… వెరీ వెరీ గుడ్… కానీ ఈ ప్లానింగ్ మాటేమిటి..?
నెట్‌లో ముందుగా కూపన్ తీసుకోవాలని చెప్పి, అందరికీ టైమింగ్స్ గనుక ముందే ఇస్తే, ఆ టైమ్‌కు ఆ భక్తులే వచ్చేవాళ్లు కదా… కూపన్లు ఉన్నవాళ్లే రావాలని ముందే ఖండితంగా చెప్పేస్తే సరిపోయేది… భక్తుల్లో ఆశ ఉంటుంది కాబట్టి మళ్లీ వచ్చే వారాల్లో కూడా ప్రసాదం పంపిణీ ఉంటుందని చెబితే ఇంతగా జనం పోటెత్తేవాళ్లు కాదు…
ఆ గరుడ ప్రసాదం (సంతాన ఫలప్రసాదం) సంతానాన్ని ప్రసాదిస్తుందా, ఏమిటీ నమ్మకం అనే చర్చలోకి ఇక్కడ వెళ్లడం లేదు… అసలు ఏమిటీ గరుడ ప్రసాదం అనే ఆరాల్లోకి కూడా పోవడం లేదు… మంత్రాలకు చింతకాయలు రాలతాయా, దేవుడి ప్రసాదంతో పిల్లలు పుడతారా వంటి మథనం కూడా కాదు… గుడి పెద్దల బాధ్యతా రాహిత్యం మీద ఆగ్రహం…
సంతానం లేని జంటల ఆశను, ఆతృతను సరిగ్గా అర్థం చేసుకోలేక, వాళ్లను పరుగులు పెట్టించి, పది వేల మందికి ఆ ప్రసాదం ఇచ్చి, మిగతా లక్షా చిల్లర మందిని వెనక్కి వెళ్లగొట్టిన నిర్వాకానికి, పాపానికి…. ఎస్, క్షమాపణ చెప్పండి అయ్యవార్లూ… ప్రసాద పంపిణీ పుణ్యం కాస్తా ఆవిరైపోకముందే నివారణ చేసుకొండి…!!
Share this Article