అనుకోకుండా కనిపించిన మావోయిస్టు నక్సలైట్ల డాక్యుమెంట్ ఒకటి చూడగానే… ఆశ్చర్యంతో నొసలు ముడిపడతాయి మనకు…! నిజానికి చైనా అనగానే దేశవ్యాప్తంగా ఉన్న అనేకానేక కమ్యూనిస్టు గ్రూపులు, పార్టీలు అంతులేని ఆరాధనను కనబరుస్తాయి కదా… మరీ సీపీఎం వంటి గ్రూపులు చైనా ప్రభుత్వంకన్నా, చైనా కమ్యూనిస్టు పార్టీకన్నా చైనాను ఎక్కువ మోస్తుంటాయి… చైనా మీద ఈగవాలనివ్వవు… వాళ్లకు చైనా అంటే ఓ స్వర్గం… అలాంటి పాలన, ఆ సమాజం వాళ్లకు ఓ ఆదర్శ గమ్యం… కానీ సీపీఐఎంల్ మావోయిస్టు పార్టీ అలియాస్ మావోయిస్టుల డాక్యుమెంట్ చైనాను ఏమన్నదో తెలుసా..? ‘‘చైనా, ఒక నూతన సోషల్ సామ్రాజ్యవాద శక్తి,.. అది ప్రపంచ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద వ్యవస్థలో అంతర్భాగం’…! నిజానికి 2017లోనే ఈ డాక్యుమెంట్ రిలీజ్ చేశామనీ, తరువాత కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీల సూచనలతో రివైజ్డు డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నట్టు పార్టీ చెప్పుకుంది… చైనాను ఓ సామ్రాజ్యవాద శక్తిగా అభివర్ణించడానికి అది సుదీర్ఘ వివరణనే జతచేసింది… ఒకప్పటి చైనా ఏమిటి..? ఇప్పటి చైనా ఏమిటి..? వివరించడానికి పార్టీ విస్తృత అధ్యయనాన్నే ఆధారంగా చేసుకున్నది…
సరే… చైనా పరిణామ గతిని, ప్రస్తుత స్థితిని అది విశ్లేషించిన తీరును సమీక్షించేంత విస్తృత అవగాహన, విశాల అధ్యయనం నాకు లేవు… కానీ దేశంలో ఓ బలమైన సాయుధ తిరుగుబాటు పార్టీ చైనా అనగానే కళ్లుమూసుకుని సమర్థించే స్థితిలో లేకుండా… వాస్తవాన్ని అర్థం చేసుకున్న తీరు ఆసక్తిగా అనిపించింది… నక్సలైట్లు అనగానే కస్సుమనే జాతీయతావాదులు, రాజ్యం సమర్థకులు కూడా చైనా పట్ల మావోయిస్టుల తాజా అవగాహన చదివితే సంబరపడతారేమో… నిజానికి చైనా సరిహద్దు దేశాలతో పెట్టుకునే పంచాయితీలే కాదు, ప్రపంచ ఆధిపత్యం దిశలో సాగిస్తున్న కుట్రలు, ప్రయత్నాల మీద ప్రపంచవ్యాప్తంగా చాలా విశ్లేషణలు వస్తున్నయ్… సుదూర దేశాల దాకా తన అక్టోపస్ భుజాల్ని చాస్తూ, వెయ్యి కాళ్ల జెర్రిలా… భారీ సముద్రమార్గాలు, రోడ్డు మార్గాల నిర్మాణాలు, నానా ప్రలోభాలతో చిన్న దేశాల్ని లోబర్చుకోవడం, పోర్టుల్ని స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాదు… అన్నిరకాల ఆయుధాల్ని పోగేస్తూ, అమ్ముతూ… అంతరిక్షం దాకా యుద్ధవ్యూహాల్ని విస్తరిస్తూ… ఒక్క ముక్కలో చెప్పాలంటే చైనా ఇప్పుడు అమెరికాకు తాత… కరోనా అనే జీవాయుధం ఆరోపణ ఉండనే ఉంది…
Ads
అమెరికా సామ్రాజ్యవాదానికి చైనా సామ్రాజ్యవాదం సమాధానమా..? ఇది చాలా చిక్కు ప్రశ్న… తన ఆదర్శాల కట్టుబాట్లను తెంచుకుని, ప్రపంచ ఆధిపత్యం అనే కాంక్షతో ఎటెటో ప్రయాణిస్తున్నదా..? ఒకప్పుడు రష్యా- అమెరికా కూటములు… ఇప్పుడు అమెరికా- చైనా కూటములా..? మళ్లీ ప్రపంచం రెండు గ్రూపులుగా, రెండు కూటములుగా పోలరైజ్ అవుతోందా..? ఇండియా ఒక అనివార్యతలాగా అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తదితర దేశాల కూటమిలోకి నెట్టేయబడుతోందా..? చైనా తాజా పోకడ ప్రపంచ రాజకీయాల్ని కొత్త దశలోకి, దిశలోకి తోసేస్తున్నాయా..? లోతైన, సంక్లిష్టమైన సబ్జెక్టు… కమ్యూనిజం, మావోయిజం అనే అరుణ బంధుత్వ మొహమాటాలేమీ లేకుండా, కుండబద్దలు కొట్టినట్టు చైనాను అధిక్షేపించడం ఇంట్రస్టింగే…!! ఈరోజు ఈనాడులో ఓ ఆర్టికల్… సందర్భానుగుణం కాబట్టి…!!
Share this Article