Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జోలపాడి.., నిద్రపుచ్చి.., సేదతీర్చి.., రెప్పపడని సమస్యకు రెప్పపాటు సొల్యూషన్…

August 16, 2024 by M S R

చైనాలో నిద్రపుచ్చే వ్యాపారం….. నిద్ర పట్టని ప్రపంచం నిద్ర కోసం నిద్రాహారాలు మాని నిరీక్షిస్తూ ఉంటుంది. కొన్ని సెకెన్లు కాగానే కనురెప్పలు అసంకల్పితంగా పడడానికి వీలుగా కనురెప్పల వెనుక తడి ఉంటుంది. కంటి తడి లేకపోతే శాస్త్రీయంగా కనుగుడ్డుకు రక్షణ ఉండదు. గుండెతడి లేకపోతే మనిషికి విలువ ఉండదు. కను రెప్ప వేసే కాలమే నిమిషం. దేవతలకు మనలాగా కనురెప్పలు పడవు కాబట్టి వారు అనిమేషులు.

కనురెప్ప పడినంత సహజంగా, వేగంగా నిద్ర పట్టాలి. కానీ- ఇది చెప్పినంత సులభం కాదు. కొందరు నిద్రకోసం పరితపిస్తారు. నిద్రకు వేళాయెరా! అని తమను తాము జోకొట్టుకుంటూ సంగీతం వింటూ రాత్రంతా నిర్ణిద్ర గీతాలు విని తరిస్తూ ఉంటారు. కొందరికి మాత్రల్లో నిద్ర దొరుకుతుంది. కొందరికి మద్యంలో దొరుకుతుంది. కొందరికి ఏసీల్లో దొరుకుతుంది. తమకు నిద్ర ఎందుకు పట్టడం లేదని కొందరు నిద్రపోతున్న వారిని తట్టి లేపి నిలదీస్తుంటారు. నిద్ర లేమి ఒక జబ్బు అని కొందరి భయం. నిద్ర లేమి ఒక మానసిక సమస్య అని కొందరి ఆందోళన.

సర్వంసహా చక్రవర్తి హంసతూలికా తల్పం మీద పడుకున్న నిద్ర; పక్కనే కటికనేల మీద ఆయన బంటు పడుకున్న నిద్ర రెండూ ఒకటే అన్నాడు అన్నమయ్య.
“కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది”
అని శాస్త్రీయ నిరూపణను పాటలో బంధించి జోలపాడాడు ఆత్రేయ. నిజానికి నిద్ర విశ్రాంతి స్థితి. మెదడు, శరీరం బలం కూడగట్టుకోవడానికి అనువయిన సమయం. ప్రతి ఉదయం నూతనోత్సాహంతో పరుగులు పెట్టడానికి నిద్ర పెట్టుబడి. ఉత్ప్రేరకం. జీర్ణక్రియకు, ఆరోగ్యానికి అత్యవసరం.

Ads

రాత్రి ఉద్యోగాలు, రాత్రి రాచకార్యాలు, అర్ధరాత్రి దాటినా టీ వీ, స్మార్ట్ ఫోన్లు చూస్తుండడాలు…ఇలా కారణమేదయినా నైట్ లైఫ్ ను ఎంజాయ్ చేయడమన్నది ఇప్పుడు దానికదిగా ఒక ఆనందం. ఒక నవీన సంస్కృతి. పగటి నిద్ర పనికి చేటు. రాత్రి మేల్కొలుపు ఒంటికి చేటు. “గూట్లో దీపం-నోట్లో ముద్ద-కంటికి కునుకు”-ఒకప్పటి సామెత. చుక్కలు పొడిచేవేళకు ఆదమరచి నిద్రపోవాలి. సూర్యుడు పొడవకముందే నిద్రలేవాలి.

కొందరు కళ్లు తెరిచి పడుకోగలరు. కొందరు ఎక్కడయినా పడుకోగలరు. కొందరు నడుస్తూ పడుకోగలరు. కొందరు నిద్రలోనే పోతారు. కొందరు నిద్రపోకుండానే పోతుంటారు. కొందరు సరిగ్గా నిద్రకు ముందే భూత ప్రేత పిశాచ శాకినీ ఢాకినీ కథల సీరియళ్లు, హారర్ సినిమాలు చూసి నిద్రకు దూరమవుతారు. లేదా అలాంటి మనుషులను తలచుకుని తలచుకుని నిదురరాని రాత్రిళ్లు గడుపుతుంటారు.

కుంభకర్ణుడి నిద్ర యుగయుగాలుగా ఒక కొలమానం. సామాన్యులు అందుకోలేని నిద్ర అది. ఊర్మిళ నిద్ర కూడా జగద్విదితమే. భారతంలో రాయబార ఘట్టంలో కపట నిద్రలు, దొంగ నిద్రలు మనకు తెలిసినవే. యోగనిద్ర యోగవిద్యతో మాత్రమే సాధ్యమయ్యేది. ఇక ఎప్పటికీ లేవలేనిది శాశ్వత నిద్ర. తెలుగు సాహిత్యంలో ఇంకెవరూ వాడని “పెద్ద నిద్ర(మరణం)” అన్న మాటను శ్రీనాథుడు ప్రయోగించాడు. నిద్రపోయే ముందు కలలో రాక్షసులు వచ్చి గొడవచేయకూడదని-

“రామస్కందం హనూమంతం వైనతేయం వృకోదరం
శయనే యస్య స్మరణం దుస్వప్నం తస్య నస్యతి”

అని శ్రీరామచంద్రుడు, కుమారస్వామి, హనుమంతుడు, గరుత్మంతుడు, భీముడు- అయిదుగురు వచ్చి మన నిద్రను రక్షించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.

నిద్రలేవగానే-
“కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ
కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కర దర్శనమ్”
అని లక్ష్మి, సరస్వతి, పార్వతి రోజంతా చేయి పట్టి నడిపించాలని నిద్రలేచి కళ్లు తెరుస్తున్నాం.

నిద్రలో కలలు నిజమనుకుని కొందరు మేలుకున్నాక నాలుక కరుచుకుంటారు. కొందరు మెలకువలోనే కలలు కంటూ ఉంటారు. రామాయణంలో త్రిజట స్వప్నం నిజమయ్యింది కాబట్టి మన కలలు కూడా నిజం కాకపోవు అని స్వప్నశాస్త్రం చుట్టూ తిరుగుతూ ఉంటాం. పగలు చూస్తే కొందరు రాత్రి కలలోకి వస్తారు. దుస్వప్నాలు రాకుండా కాపాడాల్సిందిగా ప్రార్థనలు కూడా ఉన్నాయి. లేస్తే మనుషులు కారు కాబట్టి కొందరు త్వరగా లేవరు. రాముడికి విశ్వామిత్రుడు కౌసల్యా సుప్రజా రామా! అని అందంగా, శ్రావ్యంగా మేలుకొలుపు పాడాడు. మనకు పాలవాళ్లు, పేపర్ బాయ్ లు, ఇంకెవరో తలుపులుబాదుతూ మేలుకొలుపు పాడతారు. వెంకన్నకు అన్నమయ్య జోలపాట పాడాడు. భద్రాద్రి రామయ్యకు రామదాసు జోల పాట పాడాడు. అయోధ్య రామయ్యకు త్యాగయ్య జోలపాట పాడాడు. మనకెవరు పాడతారు జోలపాటలు?

ఆకలి రుచి ఎరుగదు- నిద్ర సుఖమెరుగదు. అలసిన శరీరం హాయిగా విశ్రాంతి తీసుకోవాలి. మనసులో వేన వేల ఆందోళనలు, భయాలు, బాధలు, ఆలోచనలు ఎగసి ఎగసి పడుతుంటే నిద్ర రమ్మన్నా రాదు. జీవితం ఎప్పుడూ యుద్ధమే. గెలిచినా, ఓడినా యుద్ధం ఆగదు. దైనందిన జీవితంలో ఏ రోజుకారోజు పోరాటమే. ఈ పోరాటానికి తగిన శక్తిని కూడగట్టి ఇచ్చేది నిద్ర ఒక్కటే. నిద్ర ఎక్కువయితే నిద్ర మొహం. తక్కువయితే నిద్రకు మొహం వాచిన ముఖం.

sleep

నిదురించే తోటలోకే పాటలు వస్తాయి. వచ్చి కొమ్మల్లో రెమ్మల్లో పూలను పూయిస్తాయి. కలలకు రంగులద్దుతాయి. గాలులకు గంధం పూస్తాయి.

“సడిసేయకో గాలి!
సడిసేయబోకే!
బడలి పుడమి ఒడిలో జగతి నిదురించేనే!
చిలిపి పరుగులు మాని కొలిచిపోరాదే ..
ఏటి గలగలకే ఎగిరి లేచేనే
ఆకు కదలికలకే అదరి చూసేనే
నిదుర చెదరిందంటే నే నూరుకోనే …
పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే
నీలిమబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవన పూని విసిరిపోరాదే …”
అని రాజమకుటం సినిమాలోలా రామారావును నిద్రపుచ్చడనికి దేవులపల్లి గీతం పాడిన రాకుమారిలా మనల్ను ఒడిలో పెట్టుకుని నిద్రపుచ్చే భామామణి లేదని బాధపడకుండా…ఇప్పుడు “స్లీప్ మేకర్స్” సిద్ధమవుతున్నారు. చైనాలో మొదలైన స్లీప్ మేకర్స్ నేడో, రేపో భారత్ లో కూడా రాకుండాపోరు. పైగా “స్లీప్ మేకింగ్” మంచి వ్యాపారం కూడా.

చైనాలో ఉద్యోగులు, యువకులు పనిలో పడి యంత్రాల్లా తయారైపోయారు. శరీరానికి విశ్రాంతి లేదు. మనసుకు ఉల్లాసం లేదు. కంటిమీద కునుకు లేదు. దాంతో చిత్ర విచిత్రమైన ఆరోగ్యసమస్యలు ఎదురవుతున్నాయి. ఇవన్నీ లైఫ్ స్టయిల్ జబ్బులే తప్ప… మందులతో నయమయ్యేవి కావని వైద్యులు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు.

ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి సమస్యలో ఒక వ్యాపార అవకాశం ఉంటుంది. అలా చైనాలో నిద్ర కోసం మొహం వాచినవారిని నిద్రపుచ్చడానికి “స్లీప్ మేకర్స్” ను పంపే ఏజెన్సీ పుట్టుకొచ్చింది. మొదట ఇదేమి చోద్యం? అని అందరూ నవ్వుకున్నారు. ఇప్పుడు ఆ ఏజెన్సీ వ్యాపారం ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంటే నిద్రలో ఇంత వ్యాపారం దాగి ఉందా! అని ఆశ్చర్యపోతున్నారు.

స్లీప్ మేకర్స్ మన గురించి అన్ని వివరాలు తెలుసుకుని…మన ఇష్టాయిష్టాల ప్రకారం మన పక్కన పడుకుని కథలు చెబుతూ జోకొడతారు. జోల పాటలు పాడతారు. గంటకు ఇంత అని ఫీజు వసూలు చేస్తారు.

పక్కమీద పరాయి మనిషితో పడుకోవడం లాంటి నైతిక విషయాల మీద చర్చ వేరే సంగతి. స్లీప్ మేకర్స్ వల్ల హాయిగా నిద్ర పడుతోందా! లేదా! అన్నంతవరకే ప్రస్తుత చర్చ.

పిండి కొద్దీ రొట్టె అన్నట్లు ఇకపై డబ్బు కొద్దీ నిద్ర అనుకోవాల్సిన రోజులు రావచ్చు!

డబ్బులెవరికీ ఊరికే రావు-
నిద్ర ఎవరికీ ఊరికే రాదు.
డబ్బు చెట్లకు కాయదు-
నిద్రకు డబ్బులు కాయాలి!

నిదురించే తోటలోకి శేషేంద్ర పాటను పట్టుకొచ్చి కొమ్మకు కట్టేశాడు!
నిదురించే వ్యాపారంలోకి చైనా
“స్లీప్ మేకర్స్”ను పట్టుకొచ్చింది!!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘అనగనగా..’ ఓ సుమంతుడు… మరొక్కసారి అదే ఫెయిల్యూర్ అడుగు…
  • సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి అత్యంత కీలకమైన రాజ్యాంగ ప్రశ్నలు..!
  • అది సరే గానీ… మరి రేవంత్ రెడ్డి ఏమైపోతాడో చెప్పలేదేమిటి..?
  • ఫాఫం, తెలంగాణ వాళ్లు ఎవరూ దొరకడం లేదా సారూ..!!
  • దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
  • ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions