.
. ( – విశీ (వి.సాయివంశీ ) .. … ఆమె మనసులో ఏముంది.. ఆమెలో ఎందుకంత చింత ?
… మా చుట్టాల్లో కొందరితో సహా బయట కొంతమందిని చూశాను. మగవాళ్లకు పాతికేళ్లు వస్తాయి. పెద్దగా చదువుండదు. బోలెడంత లోకజ్ఞానం ఉందన్న భ్రమ మాత్రం ఉంటుంది. పెద్దగా చదువు లేని, అమాయకురాలైన ఆడపిల్లను ఉదారంగా కట్నం తీసుకుని పెళ్లి చేసుకుంటారు. వీడికి పాతికైతే, ఆ పిల్లకు పదహారో, పదిహేడో! ఏడాదిలో మొదటి బిడ్డ, ఆపై రెండేళ్లకు ఇంకో బిడ్డ.
Ads
… ఇద్దరూ ఆడపిల్లలే అయితే మూడో బిడ్డకు కూడా రెడీ అవ్వాల్సిందే! వాడికి పోయేదేముంది, కనాల్సింది ఆ అమ్మాయి కదా! భర్త, బిడ్డలు, ఇంటి పనులతో సతమతమవుతూ ఆ అమ్మాయి పోషకాహారలోపానికి బ్రాండ్‌లా మారిపోతుంది. గాలొస్తే పడిపోయేంత బలహీనంగా తయారవుతుంది. మొగుడికి సేవలు, పిల్లల పోషణ కామన్. ‘అపురూపమైదమ్మ ఆడజన్మ.. ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా’ అనే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ కూడా కామన్.
… ఇదంతా కొద్దోగొప్పో బాధ్యతలు ఎరిగిన భర్త ఉంటేనే! బాధ్యతలు పట్టని భర్త ఉంటే భార్య పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. వీధంతా అప్పులు, ఊరందరి దగ్గరా చేబదుళ్లు. ఏ క్షణాన ఏ సమస్య వస్తుందో తెలియని భయం. ఏ అప్పులవాడు ఏ మాటంటాడోనని వణుకు. అనుభవిస్తే తప్ప అర్థం కాని నరకం అది.
దాని గురించి పాతికేళ్ల క్రితమే 1998లో మలయాళంలో సినిమా తీశారు. పేరు ‘చింతావిష్టయాయ శ్యామల’. అంటే ‘చింతాక్రాంతురాలైన శ్యామల’ అని అనువదించుకోవచ్చు. ‘చింతలో మునిగిపోయిన శ్యామల’ అని కూడా అనుకోవచ్చు.
… దేశంలో అనేక కుటుంబాల్లో నెలకొన్న సంకట స్థితికి ఈ సినిమా తెరరూపం. ఉద్యోగం చేయక, మరేదో గొప్పగా సాధించాలని, కోట్లు గడించాలని చూసే భర్త. ఉన్నదాంట్లో కుటుంబం గడిస్తే చాలని భావిస్తూ, సర్దుకుపోతూ బతికే భార్య శ్యామల. వారికి ఇద్దరు ఆడపిల్లలు. భర్త ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయని తెలిసినా, ఏమీ అనక, అతనికి అన్ని వేళలా అన్నీ అమర్చే భార్య శ్యామల.
… ఒకవైపు అప్పులు పెరుగుతున్నాయి. మరోవైపు పిల్లలు ఎదుగుతున్నారు. సంసారం ఎటుపోతుందో తెలియడం లేదు. భర్తను నిలదీసింది. తమ భవిష్యత్తుకు దారి చూపమని అడిగింది. అంతే.. చెప్పాపెట్టకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయాడు భర్త.
శ్యామల భయపడలేదు. కూర్చొని బోరుమని ఏడవలేదు. నిలదొక్కుకుంది. చేతికందిన పని చేసింది. విజయం సాధించింది. పిల్లల్ని బాగా చూసుకుంది. సొంత కాళ్ల మీద నిలబడింది. రకరకాల చోట్లు తిరిగిన భర్తకు చిట్టచివరికి జ్ఞానోదయం అయ్యింది. తన ఆశలన్నీ గాలిమేడలని, కష్టపడకుండా ఏదీ రాదని తెలిసింది. భార్యాబిడ్డల్ని వెతుక్కుంటూ వచ్చాడు. క్షమించమన్నాడు. చివరికి అంతా ఒక్కటయ్యారు.
… ఈ సినిమాకు స్ఫూర్తి ఏమిటి? ‘చింతావిష్టయాయ సీత’ అనే పేరుతో మలయాళ కవి, సంఘసంస్కర్త కుమరన్ ఆసన్ (1871-1924) రాసిన ఓ కవిత్వ సంపుటి. గర్భవతినైన తనను అడవిలో వదిలేసినప్పుడు, ఒంటరి తల్లిగా పిల్లల్ని పెంచుతున్నప్పుడు తానెంత వేదన అనుభవించానో సీత మననం చేసుకుంటున్నట్లుగా సాగే కవిత్వం అది.
ఎప్పుడది రాసింది? 1919లో. ఎంత విమర్శ వచ్చి ఉంటుంది! ఎంత వివాదం రేగి ఉంటుంది! కానీ ఆ విమర్శలు, వివాదాలు మిగిలాయా? రాసిన రాత కదా మిగిలింది. తిరువనంతపురంలోకి కేరళ యూనివర్సిటీ ఎదుట ఆసన్ విగ్రహం ఏర్పాటు చేశారు. జోహార్ కుమరన్ ఆసన్!
… మలయాళ నటుడు శ్రీనివాసన్ తనే నటించి, దర్శకత్వం వహించిన రెండో సినిమా ఇది. కేరళలో నేటికీ ఈ సినిమాకు ప్రత్యేకమైన అభిమానగణం ఉంది. మలయాళంలో ‘Women Entrepreneurship’ అంశంతో వచ్చిన సినిమాల్లో ఇదీ ఒకటి.
శ్యామలగా సంగీత (‘సమరసింహారెడ్డి’ సినిమాలో బాలకృష్ణ పెద్ద చెల్లెలు పాత్ర చేసిన నటి) అద్భుతంగా నటించి, ఆ తర్వాత కాలంలో ఆ పేరుతోనే అందరికీ గుర్తుండిపోయారు. ఆమె భర్త విజయన్‌గా శ్రీనివాసన్ నటించారు.
… సినిమాగా ఈ కథ కొంతవరకు తెలుగులో వచ్చిన ‘శుభోదయం’ సినిమాను పోలి ఉంటుంది. అయితే అంశాలుగా రెండూ వేర్వేరు అనిపిస్తాయి. ‘చింతావిష్టయాయ శ్యామల’ను ఆ తర్వాత తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘ఆవిడే శ్యామల’గా రీమేక్ చేశారు.
శ్యామలగా రమ్యకృష్ణ, ఆమె భర్తగా ప్రకాశ్‌రాజ్ పోటాపోటీగా నటించారు. కానీ మూలంలో ఉన్న సోల్ ఆ సినిమాలో కనిపించకపోవడంతో పెద్దగా ఆడలేదు. అయితే చూసేందుకు బాగుంటుంది…
Share this Article