.
( యండమూరి వీరేంద్రనాథ్ ) …….. తన జీవిత చరిత్ర వ్రాయటం మరి కొంతకాలం ఆపుదాం- అన్నాడు చిరంజీవి. సగం రాసిన ఆ పుస్తకాన్ని మరి కొన్ని నెలల/ ఒకటి రెండు సంవత్సరాల పాటు ఆపడం జరుగుతుంది. ఈ లోపు ఖాళీగా ఉండకుండా మనసుకు చాలా సంతృప్తినిచ్చే మరో పుస్తకం ప్రారంభించాను.
(ఫొటో: మా ఇంటికి వచ్చిన విశిష్ట అతిథులు. కోచ్ రమేష్. ఆయన తీర్చిదిద్దిన శిష్యురాలు ప్యారిస్ పారా ఒలింపిక్స్ మెడలిస్ట్ దీప్తి, మాజీ ఇండియన్ క్రికెట్ వికెట్ కీపర్ ఎమ్.ఎస్.కే ప్రసాద్)
Ads
ఈ పోస్ట్ పెట్టి రెండు నెలలు అయింది. ఈ అమ్మాయి జీవిత చరిత్ర వ్రాయాలన్న ఆలోచనకి అప్పుడే అంకురార్పణ జరిగింది. నేను ఎమ్మెస్ కే ప్రసాద్ చర్చించుకున్నాము. ఈ పాప జీవిత చరిత్ర రాయటం ప్రారంభించి జస్ట్ 15 రోజులైంది. దీని ముందు పుస్తకం ‘అమీబా’ పూర్తిగా నేచురల్ గా ఉంటుంది. ఈ పుస్తకం అలా కాదు. ఎన్నో మలుపులు, నాటకీయత, కళ్ళు తడిచేసే సంఘటనలు…
పారా ఒలంపిక్స్ లో అర్హత సంపాదించాలి అంటే “తనకు మానసిక వైకల్యం ఉంది” అన్న సర్టిఫికెట్ కావాలి. ఆస్ట్రేలియాలో డాక్టర్లు సర్టిఫై చేయాలి. సొంత ఖర్చుల మీద అక్కడకి వెళ్ళాలి. దానికోసం ఇల్లు, పొలం అమ్మేయాలి. ఉన్న ఒక్క జీవనాధారం అమ్మెయ్యాలా? అవకాశం వదులుకోవాలా?
నైపుణ్యం నిరూపించుకుంటే తప్ప ప్రభుత్వం సహాయం చేయదు. “మెలోడ్రామా ఎక్కడో ఉండదు. మన జీవితంలోనే ఉంటుంది?” అని 40 సంవత్సరాల క్రితం ‘శివరంజని’ అని నా నాటకంలో వ్రాశాను.
…….
ఈ అమ్మాయి చిన్నప్పటి తొలి కోచ్ ది వరంగల్. ఈమె ప్రతిభ ప్రథమంగా గుర్తించింది అతడే. కొంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అతడికి క్యాన్సర్ అని తెలిసింది. “నీకు ఒలంపిక్స్ లో బహుమతి వస్తుంది. రాక తప్పదు. వచ్చేవరకు నేను ఈ లోకం వీడను. అది తెలిశాకే వెళ్లిపోతాను” అనేవాడట.
అనుకున్నట్టుగానే ఐదు సంవత్సరాల తరువాత ఆమెకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ వార్త తెలిసిన మరుసటి రోజు ప్రొద్దున్న అతడు మరణించాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో. ఎన్నెన్నో.
దీప్తి జీవిత చరిత్ర రాయటం జీవితంలో గొప్ప అనుభవంగా భావిస్తున్నాను. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే ఈ పుస్తకం పూర్తి అవటానికి మరి ఆరు నెలలు పట్టొచ్చు. ఈ సంవత్సరపు అర్జున అవార్డు ఈమెకు రాబోతుందని నిన్ననే తెలిసింది. ప్రభుత్వం వెల్లడి చేసే వరకు చెప్పకూడదని తెల్లారే వరకూ ఆగాను. కంగ్రాట్యులేషన్స్ దీప్తి.
నీకు అర్జున అవార్డు కన్నా ఎక్కువ ఆనందం ఇచ్చే విధంగా ఈ పుస్తకం వ్రాస్తాను. దురదృష్టవశాత్తు అది నీకు తెలియకపోవచ్చు. మీ తల్లిదండ్రులకి, ఆప్తులకి తెలుస్తుంది. అంగవైకల్యం భగవంతుడు ఇచ్చింది. మనోధైర్యం మనం పెంచుకునేది.
తప్పు చేద్దాం రండి అనే పుస్తకంలో కల్కి అనే ఒక పాత్ర భగవంతుడితో “నువ్వు ఎన్ని కష్టాలైనా పెట్టు. కానీ నా మొహం మీద చిరునవ్వు చెరపలేవు” అని సవాల్ చేస్తాడు. నా అభిప్రాయానికి ఉదాహరణగా నిలిచిన నీకు అభినందనలు.
చిరంజీవి జీవిత చరిత్ర రాస్తున్నానని తెలిసి “ఈ పుస్తకానికి నీకు ఎంత డబ్బు వస్తుంది?” అని ఒక కుర్రవాడు ఫేస్బుక్ లో పెట్టాడు. డబ్బు ముఖ్యమే. కానీ అన్ని పనులూ డబ్బు కోసమే చేయము కదా బాబూ. ఈ పుస్తకం ద్వారా స్ఫూర్తి పొంది మరో 10 మంది దీప్తులు తయారవ్వాలని ఆశిస్తున్నాను…
Share this Article