.
Subramanyam Dogiparthi
….. సినిమా ఫస్ట్ రిలీజులో కుదేలయి తదుపరి రిలీజుల్లో , టివి ప్రసారాల ద్వారా చక్కటి హాస్య రసభరిత సినిమాగా పేరు తెచ్చుకున్న సినిమా ఈ చంటబ్బాయ్ . చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22న విడుదలయిన ఏకైక సినిమా కూడా . లేడీ వేషంలో అందంగా అలరించిన సినిమా కూడా .
1986లో వచ్చిన ఈ చంటబ్బాయ్ సినిమా అనగానే ఎవరికయినా ముందు గుర్తుకొచ్చేది శ్రీలక్ష్మి తవికలే . తవిక అంటే కవితను తిప్పి చెప్పటం . ఈ డైలాగ్ సినిమాలో ఆమెదే . వారపత్రిక ఆఫీసులో తన రచనలతో , పిండి వంటలతో పొట్టి ప్రసాదుని నానాతిప్పలు పెట్టే సీన్లని ప్రేక్షకులు మరచిపోలేరు . అలాగే కాస్తంటే కాస్త విసిగించినా బావామరదులు చిరంజీవి , అల్లు అరవింద్ కొట్టుకోవటాలు సరదాగానే ఉంటాయి .
అప్పట్లో మాలాంటి థర్టీసులో ఉన్నవారికి కూడా ముచ్చటేసింది సినిమాలో “క” భాష . మా చిన్నప్పుడు అంటే 1960s లలో ఈ క భాషను తెగ మాట్లాడేవాళ్ళం . మీరూ మాట్లాడారా !? ఇలా ఎన్నో విశేషాలు ఉన్నాయి ఈ జంధ్యాల మార్క్ సినిమాలో . శంకరదాదా యంబిబియస్ కన్నా చాలా ముందే పూర్తి కామెడీ పాత్రలో చార్లీ చాప్లిన్ని గుర్తుకు తెస్తూ చిరంజీవి నటించిన సినిమా కూడా .
Ads
అప్పటికే తెలుగింట పాపులర్ అయిన మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి నవల ఆధారంగా తీయబడింది ఈ సినిమా . నవలకు చాలా మార్పులు చేసామని మల్లాది వారే టైటిల్సుకు ముందు ప్రేక్షకులకు తెలియపరచుకుంటారు . సినిమాలో చాలా భాగం విశాఖపట్టణం లోనే షూట్ చేయబడింది .
టూకీగా ఏమిటంటే : జేమ్స్ పాండ్ గా పరిచయం చేసుకునే పాండురంగారావు ప్రైవేట్ డిటెక్టివుగా ఒక అసిస్టెంట్ గణపతితో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా ప్రత్యక్షం అయి కేసుల్ని శోధిస్తూ పోలీసు వారికి సాయపడుతుంటాడు . ఆ క్రమంలో టెలిఫోన్లను క్లీన్ చేసే హీరోయిన్ సుహాసినిని కాపాడుతాడు . ఆమె ద్వారా ఆమె స్నేహితురాలు ముచ్చెర్ల అరుణ పరిచయం అవుతుంది . తన తండ్రికి పెళ్ళికి ముందే జన్మించిన కొడుకుని కనుక్కునే పనిని అప్పచెప్పుతుంది .
ఆ పరిశోధనలో ఊళ్ళూళ్ళు తిరగటం , జనాన్ని కలవటం , చివరకు ఇద్దరు బోగస్ గాళ్ళు జగ్గయ్య ఇంట్లో తిష్టవేయడం జరుగుతుంది . వాళ్ళని ఇంట్లో నుంచి పారదోలిన తర్వాత ఈ పాండే అసలు చంటబ్బాయ్ అని తెలవటం , ముందు తండ్రిని క్షమిస్తానికి మనసు అంగీకరించకపోయినా , అనాధలకు ఆస్తినంతా దానం చేస్తే అంగీకరిస్తానని చెప్పటం , ఆ షరతు మీద తండ్రిని చేరటంతో శుభం కార్డ్ పడుతుంది .
సినిమాలో ముందు తాంబూలం చిరంజీవిదే . సినిమా అంతా హిలేరియస్సుగా నటించిన చిరంజీవి చివర్లో ఆర్ద్రతతో , విచారంతో చెప్పే డైలాగులను ప్రేక్షకులు మరచిపోలేరు . అలాగే పాటల్లో కూడా అదరగొట్టేసారు . ముఖ్యంగా నేను ప్రేమ పూజారి అనే పాటలో . హరిదాసుగా , గణాచారిగా , మిస్ మేరీగా బాగా నటించారు . జంధ్యాల చిత్రీకరణ కూడా సరదాగా ఉంటుంది .
మరో పాట అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను అనే పాటలో చార్లీ చాప్లిన్ లాగా బాగా నృత్యించారు . కొన్ని బిట్సులో కమల్ హాసన్ గుర్తుకొస్తాడు . కమల్ హాసన్ , చిరంజీవి ఇద్దరూ నృత్యాల్లో వాళ్ళకు వాళ్ళే సాటి కదా ! సుహాసిని పాత్రను కూడా ప్రేక్షకులు మరచిపోరు . హీరో లాగానే గలగలగలా మాట్లాడే వాగుడుకాయ పాత్ర . ఇంటింటికి తిరిగి టెలిఫోన్లని క్లీన్ చేసే పాత్ర . ఇప్పుడు అలా ఇంటింటికి తిరిగి క్లీన్ చేసే వృత్తి కూడా లేదనుకుంటా .
చిరంజీవి , సుహాసినిల మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే ఉంటుంది . ఉత్తరాన లేవంది ధృవ నక్షత్రం దక్షిణాన లేవంది మలయ పర్వతం , నేను నీకై పుట్టినాను డ్యూయెట్లు రెండూ చాలా డీసెంటుగా బాగుంటాయి . పాటలనన్నీ వేటూరి వారే వ్రాసారు . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , శైలజలు చాలా శ్రావ్యంగా పాడారు . పాటలు హిట్టయ్యాయి కూడా .
కాల్ మి పాండ్, జేమ్స్ పాండ్ అంటూ చిరంజీవి చెప్పుకోవడం, జేమ్స్ బాండ్ తరహాలో యాక్షన్ చేస్తూ అద్దంలో చూసుకోవడం వంటివి జంధ్యాల బాగా చిత్రీకరించాడు… చిరంజీవి బాగా చేయగలడు, కానీ అలాంటి పాత్రలు చేస్తేనేమో ప్రేక్షకులకు నచ్చదు… అదీ చిరంజీవికి శాపమో వరమో…
సుహాసిని మర్డర్ కేస్ ఒక ఇంగ్లీషు సినిమా నుండి ఎత్తుకొచ్చారని ఎక్కడో చదివాను . A shot in the dark ఆ ఇంగ్లిష్ సినిమా పేరు . భీమిరెడ్డి బుచ్చిరెడ్డి నిర్మాత . చిత్రానువాదం , సంభాషణలు , దర్శకత్వం జంధ్యాల గారివి . మిగిలిన ప్రధాన పాత్రల్లో జగ్గయ్య , ముచ్చెర్ల అరుణ , చంద్రమోహన్ , సుధాకర్ , భీమరాజు , సుత్తి సోదరులు , రావి కొండలరావు , కృష్ణవేణి , అల్లు రామలింగయ్య , డబ్బింగ్ జానకి , ఆలీ , తదితరులు నటించారు . మామ అల్లు , బావమరిది అరవిందులతో కలిసి చిరంజీవి ఈ సినిమాలో నటించటం విశేషమే .
రౌడీ పాత్రల్లో నిరంతరం తన్నులు తినే భీమరాజు ఇనస్పెక్టరుగా గుర్తుండిపోయే పాత్రలో నటించారు .
హాస్యం కాస్త అతి హాస్యం అయి ఫస్ట్ రిలీజులో అపహాస్యం అయినా తదుపరి రిలీజుల్లో ప్రేక్షకుల మెప్పు పొందటమే కాకుండా చిరంజీవి లాంటి ఏక్షన్ హీరో నటించిన గొప్ప హాస్య రసభరిత సినిమాగా కూడా పేరు తెచ్చుకుంది .
చాలామంది ఆశావహులు ఈ చంటబ్బాయ్ పాత్రను వేయాలని ఉందని చెపుతూ ఉంటారు . ఓ బెంచ్ మార్కుగా నిలిచింది . సినిమా యూట్యూబులో ఉంది . చిరంజీవి అభిమానులు , శ్రీలక్ష్మి అభిమానులు తప్పక చూడవచ్చు . It’s a hilarious investigative romantic movie . A watchable one too .
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు
Share this Article