ఏపీ నుంచి ఆదానీకి రాజ్యసభ సభ్యత్వం… జగన్ ఢిల్లీ పర్యటనలో ఇదీ ఓ కాన్పిడెన్షియల్ ఎజెండా ఐటమ్ అని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే కదా… నిజానికి మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యత్వం అనేదే ఇంకాస్త ముఖ్యమైన చర్చనీయాంశం… స్థూలంగా, హఠాత్తుగా వింటే నమ్మబుల్ అనిపించదు కానీ… వైసీపీ ముఖ్యుల్లో తరచూ చర్చకు వస్తున్న పేరే ఇది… అయితే జగన్ లెక్కల్లో చిరంజీవి ఎలా ఫిట్ అవుతాడో, జగన్ ఏం ఆలోచిస్తున్నాడో బయటికి ఎవరికీ తెలియదు, ఆయన ఎవరితోనూ షేర్ చేసుకోడు కాబట్టి ప్రస్తుతానికి ఇష్టాగోష్టి ముచ్చట్లలోనే పేరు నలుగుతోంది… పైగా ఇంకా చాలా టైం ఉంది కూడా… ఒకటి ఆదానీ, రెండు విజయసాయిరెడ్డి… మూడో పేరు చిరంజీవి, నాలుగోది మోడీ దగ్గర చాలా ఏళ్లపాటు ఓఎస్డీగా పనిచేసిన దళిత అధికారి కిషోర్రావు… ప్రస్తుతానికి ఇవీ పేర్లు… సాయిరెడ్డి సరే, ఆదానీ సరే… కిషోర్రావు కూడా సరే, కానీ చిరంజీవి ఎలా ఫిట్టవుతాడు..? ఇదే కదా ప్రశ్న…
నిజానికి తను ప్రజారాజ్యం పార్టీని వదిలేసుకుని, కేంద్ర మంత్రి పదవి పోయాక, కొన్నాళ్లకు రాజ్యసభ సభ్యత్వమూ పోయాక… అసలు ఆయన రాజకీయాల నుంచి ఏ ఒక్క రోజూ మాట్లాడలేదు… పూర్తిగా వాటి నుంచి డిటాచ్ అయిపోయాడు… దానికి కాంగ్రెసే ఏపీలో దాదాపు లేకుండా పోయిన దురవస్థ ఒక కారణం కావచ్చు… ఈ రాజకీయాల మీద వైముఖ్యం ఏర్పడటం కారణం కావచ్చు… ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయమే కారణం కావచ్చు… తన తమ్ముడు వేరే పార్టీ పెట్టి, అటూ ఇటూ వేర్వేరు పార్టీలతో సయ్యాటలు ఆడుతున్నా సరే చిరంజీవి మాత్రం దానికి దూరంగానే ఉన్నాడు… పవన్ కల్యాణ్ వ్యక్తిగత, సినిమా, రాజకీయ జీవితాల మీద చిరంజీవి పల్లెత్తుమాట కూడా మాట్లాడలేదు, స్పందించడు… జగన్‌తో బాగానే ఉంటున్నాడు… (వైఎస్‌తో కూడా బాగానే ఉన్నాడు అప్పట్లో…) ఇప్పుడు లాహే లాహే అంటూ ఏవో నాలుగు సినిమా స్టెప్పులేసుకుంటూ, తన సినిమాలేవో తను చేసుకుంటున్నాడు… ఈమధ్య తెలుగు ఇండస్ట్రీగా పెబ్బ అనిపించుకోవాలీ అనే తాపత్రయంతోపాటు అంబులెన్సులు, ఆక్సిజన్ బ్యాంకులు గట్రా మొదలుపెట్టేసి ప్రచారతెర మీద ప్రముఖంగా కనిపించాలనీ ఆకాంక్షించాడు… అదంతా వేరే కథ…
Ads
జగన్ కోణంలో చూస్తే… ఒక్కసారి చిరంజీవికి గనుక చాన్స్ ఇస్తే… ఏపీలోని కీలకమైన కాపు సెక్షన్‌కు సంబంధించి ఓ విశేషమైన అడుగు అనుకోవాలి… పైగా జనసేన, మెగా అభిమానుల్ని కూడా గణనీయంగా వైసీపీ వైపు లాగేయొచ్చు… ఎలాగూ మొన్నటి ఎన్నికల్లో ఓటమి అనంతరం పీకే ప్రస్తుతం బలహీన స్థితిలో ఉన్నాడు… రేపేమిటో తెలియదు… నిరంతరమూ జనం మధ్య ఉండే, జనం సమస్యలతోపాటు జర్నీ చేసే మెయిన్ స్ట్రీమ్ పొలిటిషియన్స్కే రేపురేపు అవకాశాలుంటయ్… కమల్‌హాసన్ సిట్యుయేషన్ చూశాం కదా… అయితే ఏపీలో జనసేనతో కలిసి బీజేపీ ఏవేవో ఆశల్లో ఉంది, కాపుల్ని ఆర్గనైజ్ చేసుకోవాలనే తలంపుతో ఉంది… పీకేతో అంత వీజీ కాదనీ, ఇప్పటికి తన స్నేహాలు సినిమా ట్విస్టులంత వేగంగా మారిపోతూ వచ్చాయని బీజేపీకి అర్థమయ్యేసరికి ఇంకొంతకాలం పట్టొచ్చు, ఈలోపు జగన్ బీజేపీతో ఎంత బాగున్నా సరే, పేకాట పేకాటే… సో, బీజేపీ ఇంకాస్త పెరిగేందుకు కూడా జగన్ చాన్స్ ఇవ్వడు… టీడీపీతో ఫైట్ ఎలాగూ తప్పదు, మధ్యలో బీజేపీ దూరడానికి చాన్స్ ఇవ్వడు, తెలంగాణలో కేసీయార్ బీజేపీ పెరగడానికి ఎలా చాన్సులు ఇచ్చాడో, ఆ తలనొప్పి ఏమిటో చూస్తున్నాడు కదా… సో, ఏరకంగా చూసినా చిరంజీవి, జగన్ మైత్రి ఉభయతారకమే… ఎటొచ్చీ, జగన్ జాగ్రత్తగా ఓ కన్నేసి ఉంచాల్సింది, కాస్త వెనకాముందు ఆలోచించాల్సింది చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ మీదే..!!
Share this Article