Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంతటి చిరంజీవే మరణిస్తే… తెలుగు ప్రేక్షకులు మెచ్చుతారా..?

July 3, 2025 by M S R

.
Subramanyam Dogiparthi ….. తండ్రీకొడుకుల ప్రేమ , ఆప్యాయతల చుట్టూ నేయబడిన కధ 1985 ఏప్రిల్లో వచ్చిన ఈ చిరంజీవి సినిమా కధ . తల్లీకొడుకుల , తల్లీకూతుళ్ళ , అన్నాచెల్లెళ్ళ , అక్కాతమ్ముళ్ళ ప్రేమానురాగాల చుట్టూ నేయబడిన కధలు , సినిమాలు మనకెన్నో తెలుసు . కానీ ఈ సినిమా తండ్రీకొడుకుల ప్రేమ చుట్టూ నడుస్తుంది . సినిమాను నడిపిస్తుంది .

కొడుకు చిరంజీవికి తల్లీతండ్రీ అన్నీ తండ్రే . తల్లిలాగా పెంచుతాడు . కొడుక్కి తండ్రి అంటే ఎనలేని ప్రేమ . ఆయన్ని ఎవరయినా ఒక్క చిన్న మాట అన్నా భరించడు . కొట్లాటకు దిగుతాడు . తాను ప్రేమించిన అమ్మాయి తన తండ్రిని తూలనాడితే ఆ కోపంలో ఈడ్చి కొడతాడు . ఆమె చనిపోతుంది .

ఆ హత్యానేరంలో తాను ఇరుక్కోకుండా ఉండేందుకు మరి కొన్ని హత్యలు కూడా చేస్తాడు . తన చేతి బ్రాస్లెట్ చనిపోయిన ప్రేయసి ఇంట్లో పడిపోతుంది . దానిని తెచ్చుకోవటానికి వెళ్ళటం , ప్రేయసి గుడ్డి చెల్లెలు ఇతని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించటం , క్లైమాక్సులో గుడ్డి చెల్లెలు హీరో మధ్య పెనుగులాట , ఆమె చేతిలో పొడవబడటం , పోలీసు కమీషనర్ అయిన తండ్రి షూట్ చేయటంతో సినిమా ముగుస్తుంది .

Ads

సినిమా అంతా చాలా సెంటిమెంటుతో , ఎమోషన్సుతో నడుస్తుంది . చిరంజీవి , సత్యనారాయణలు పోటాపోటీగా బ్రహ్మాండంగా నటించారు . ప్రేయసిగా నటించిన విజయశాంతి పాత్ర చనిపోవటం , అప్పటికే స్టార్డం వచ్చేసిన చిరంజీవి పాత్రలో చిరంజీవి చనిపోవడం వలనే బహుశా సినిమా కమర్షియల్గా సక్సెస్ అయి ఉండదు .

సస్పెన్స్ , ఏక్షన్ , చిరంజీవి విజయశాంతి డ్యూయెట్లు , డాన్సులు అన్నీ బాగుంటాయి . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వేటూరి వారి పాటలు బాగుంటాయి . ఇరుక్కుపోయావమ్మా నువ్వు నా చేతిలో , అపుడేనా అందుకేనా డ్యూయెట్లు బాగుంటాయి . తండ్రీకొడుకుల ప్రేమానురాగాలను చూపుతూ సాగే అమ్మగా నాన్నగా పాట చాలా బాగుంటుంది . రాజులా వెలుగు మారాజై బ్రతుకు అంటూ సాగే చిరంజీవి మిత్రబృందం మీద పిక్నిక్ పాట హుషారుగా ఉంటుంది . నేనే దోషినా అంటూ చిరంజీవి మీద సాగే విషాద పాటలో చిరంజీవి బాగా నటించారు .

కెరీర్ మొదట్లో నెగటివ్ పాత్రలను వేసినా స్టార్డం వచ్చాక సినిమా అంతా నెగటివుగా తమ అభిమాన హీరో నటిస్తే ప్రేక్షకులు తట్టుకోలేరు . ఎన్నో సినిమాలలో ప్రేమించి డాన్సులు చేసిన హీరోయిన్లు విజయశాంతిని కావాలని కాకపోయినా చంపేయటం , భానుప్రియను హింసించటం , భానుప్రియను గుడ్డి పాత్రలో చూపటం వంటి అంశాలు జనానికి జీర్ణం కాలేదనుకుంటాను . అయితే సినిమా బాగుంటుంది . కమర్షియల్గా సక్సెస్ కాకపోవచ్చు . కధ , స్క్రీన్ ప్లే , నటీనటుల నటన అన్నీ బాగుంటాయి .

నిర్మాతలు కె లక్ష్మీనారాయణ , కె వి రామారావులు యన్టీఆర్ అభిమానులేమో ! ఆయన శ్రీకృష్ణుడిగా ఉన్న బొమ్మను ప్రొడక్షన్ బొమ్మగా పెట్టుకున్నారు . తమిళ దర్శకుడు సి వి రాజేంద్రన్ దర్శకత్వం వహించారు . ప్రముఖ రచయిత సత్యానంద్ కధను , డైలాగులను వ్రాసారు . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మలు శ్రావ్యంగా పాడారు .

చిరంజీవి , సత్యనారాయణ , విజయశాంతి , భానుప్రియ , రంగనాథ్ , మురళీమోహన్ , నూతన్ ప్రసాద్ , సుత్తి జంట , కె విజయ , ప్రభృతులు నటించారు . పాలరాముడు పాత్రలో నూతన్ ప్రసాద్ సినిమాల పిచ్చి బాగుంటుంది .

నటీనటులు ఎంత బాగా నటించినా , సినిమా ఎంత బాగున్నా కమర్షియల్గా సక్సెస్ అయ్యేందుకు , కానందుకు చాలా కారణాలు ఉంటాయి . ముఖ్యంగా నిర్మాతలకు , ఎగ్జిబిటర్లకు , పంపిణీదారులకు తినే రాత కూడా ఉండాలి . ఇది/ఇదే జీవిత సారాంశం .

ఈ వేదాంతాన్ని పక్కన పెడదాం . చిరంజీవి , సత్యనారాయణ అభిమానులు తప్పక చూడతగ్గ సినిమా . యూట్యూబులో ఉంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆదానీ అనగానే మోడీ… మోడీ అనగానే వ్యతిరేకత… ఎర్రన్నలు అంతే..!!
  • డ్రంకెన్ డ్రైవ్‌తోపాటు… డ్రంకెన్ స్పీచ్ టెస్టులూ అవసరం ఇప్పుడు..!!
  • Work from hill… కొండాకోనల్లో నుంచి కొలువు… ఆరోగ్యం, ఆహ్లాదం…
  • యండమూరి, రాఘవేంద్రరావు కఠినాత్ములు సుమీ… ఆమెను చంపేశారు…
  • బీహార్‌లో ఎవరిది గెలుపు..? సట్టా బజార్ ఏమంటున్నదో తెలుసా..?
  • మీ రామజ్ఞానం ఎంత..? 108లో కనీసం 80 జవాబులు తెలిస్తే మీరు గొప్పే..!
  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి చంద్ర బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions